మట్టి బాట మాయం.. మురుగు నీరు దూరం

Special Story On Kurnool District Iranbanda Village - Sakshi

(జి. రాజశేఖర్‌నాయుడు, కర్నూలు): కర్నూలు జిల్లా మండల కేంద్రం దేవనకొండకు 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఐరన్‌బండ బీ సెంటర్‌ గ్రామం. ఉదయం 7 గంటలకు కర్నూలు నుంచి బయలుదేరితే రెండు గంటల ప్రయాణం. 9 గంటల ప్రాంతంలో దారిలో ఉల్లి నాట్లు వేయిస్తున్న మద్దిలేటి అనే రైతును ‘సాక్షి ’పలుకరించింది. గత ఏడాది రెండు ఎకరాల్లో ఉల్లి సాగు చేశానని, ధర బాగా ఉండడం వల్ల క్వింటాల్‌ రూ.4,800కు అమ్ముడుపోగా మొత్తం రూ.8 లక్షలు చేతికొచ్చిందని సంతోషంగా చెప్పాడు. ఈ ఏడాదీ ధరలు బాగా ఉంటాయనే రెండు ఎకరాల్లో తిరిగి ఉల్లి సాగు చేస్తున్నానన్నాడు. గ్రామంలోకి అడుగుపెట్టగా బందే నవాజ్, ప్రకాశం అనే యువకులు ఎదురయ్యారు. గ్రామంలో ఫ్లోరైడ్‌ సమస్య ఉందని, మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ పాడైనందున నాలుగు కిలోమీటర్లు నడచి వెళ్లి తాగునీటిని తెచ్చుకునేవారమని చెప్పారు. అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే చర్యలు తీసుకున్నారని తెలిపారు.

► గ్రామ సచివాలయం సమీపంలో చెట్టు కింద కొందరు వృద్ధులు కూర్చొని ఉన్నారు. ప్రభుత్వంతో ఏ పని ఉన్నా దేవనకొండకు వెళ్లాల్సిన అవసరం ఇప్పుడు లేదన్నారు. అన్ని పనులు ఊర్లోనే జరిగిపోతున్నాయని చెప్పారు. దశాబ్దాలుగా కంకర తేలిన రోడ్డుపై ప్రయాణంతో ఇబ్బంది పడేవాళ్లం.. సచివాలయ వ్యవస్థ ఏర్పాటైన అనంతరం రోడ్డు కోసం ఇచ్చిన అర్జీపై వెంటనే స్పందన లభించింది. రూ.3.50 కోట్లతో నేడు కరివేముల మెయిన్‌ రోడ్డు నుంచి తమ గ్రామం వరకు 6 కి.మీ. మేర  రోడ్డు నిర్మించినట్లు చెప్పారు .  
► పుట్టుకతోనే దివ్యాంగుడైన కొడుకు(11) పింఛన్‌ కోసం తల్లి బోయ రంగమ్మ గతంలో ఆరేళ్ల పాటు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగింది. ఎలాగైనా పింఛన్‌ వచ్చేలా చూడాలని కూలీనాలీ చేసిన సొమ్ము రూ.10 వేల వరకు ఖర్చు చేసింది. ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు. గ్రామ వలంటీరుకు చెప్పగానే సమస్య పరిష్కారమైంది. దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయించి నెలకు రూ.3 వేలు పింఛన్‌ ఇంటికే తెచ్చి ఇస్తున్నారని రంగమ్మ చెప్పింది. 
► వర్షాకాలంలో గ్రామంలోని అంతర్గత రోడ్లు మురుగు నీటితో నిండిపోయేవి. ప్రస్తుతం రూ.18 లక్షల జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో డ్రైనేజీ నిర్మాణం చేపట్టారు.  
► ఇంకా స్ధానికులు ఏమన్నారంటే...రేషన్‌కార్డు లేదని, ప్రభుత్వ పథకం మంజూరు కాలేదని చెబితే, వెంటనే సచివాలయంలో కారణం వివరిస్తున్నారు. ఆయా సమస్యలకు పరిష్కారమార్గాన్ని చూపుతున్నారు. రైతులకు సంబంధించిన పాసు పుస్తకాలు, అడంగల్‌ సమస్యలు వేగంగా పరిష్కారం అవుతున్నాయి. ప్రభుత్వ పథకాలను అర్హులైన వారందరు ఉపయోగించుకుంటున్నారు. 

పెట్టుబడి సాయం అందింది
కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభిస్తోంది. పెట్టుబడి కోసం అధిక వడ్డీలకు అప్పులు చేయకుండా గత ఏడాది నుంచి ఆర్ధిక సాయం అందిస్తున్నారు.ఇçప్పుడు అందిన సాయంతో వ్యవసాయానికి మందులు, విత్తనాలు తెచ్చుకున్నాను.  
– పెద్ద శేషన్న, రైతు

అమ్మ ఒడి కింద రూ.15 వేలు ఇచ్చారు
నా కొడుకు దావీదు 2వ తరగతి చదువుతున్నాడు. అమ్మ ఒడి పథకం కింద రూ.15 వేలు బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి. ప్రభుత్వం ఇచ్చిన ఈ డబ్బును పొదుపుగా కొడుకు చదువుకు వినియోగిస్తాను. పేద పిల్లల చదువు పట్ల శ్రద్ధ చూపుతున్నందుకు రుణపడి ఉంటాం.
  – రంగవేణి, గృహిణి

మా ఊరు రోడ్డు బాగుపడింది 
ఎన్నో ఏళ్లుగా ఎవరూ పట్టించుకోని రోడ్డు బాగుపడింది. గతంలో ఈ రోడ్డుపై ప్రయాణం అంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని చేయాల్సి వచ్చేది. కొత్త రోడ్డు వేయాలని కోరిన వెంటనే తారురోడ్డు వేశారు. 
    – నాయక్‌ సుభాన్‌   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top