ప్రయాణికుల కస్సుబస్సు

RTC Services Delayed In Tirupati For Chandrababu Deeksha - Sakshi

బస్సులన్నీ సీఎం సభకే

జిల్లాలో అవస్థలు పడ్డ ప్రయాణికులు

ఎన్నికల కోడ్‌ ఉల్లఘించిన ఆర్టీసీ అధికారులు

తిరుమలలో బస్సుల్లేక భక్తులకు తిప్పలు

ఆర్టీసీకి రూ.కోటికి పైగా నష్టం

ఆర్టీసీ బస్సులు ఆదివారం రూటు మార్చాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సులన్నీ తిరుపతికి మళ్లాయి. సీఎం సభకు జనాన్ని తరలించేందుకు ఆర్టీసీ తనవంతు బాధ్యతను భుజాలకెత్తుకుంది. జిల్లావాసులను పక్కన పెట్టి,చివరకు తిరుమలకు వచ్చే యాత్రికులను సైతం లెక్కచేయలేదు. దీంతో ఉన్నఅరకొర బస్సుల్లో ఎక్కలేక, ప్రయాణించలేకప్రయాణికులు, యాత్రికులునానాఅగచాట్లు పడ్డారు.  

తిరుపతి సిటీ: జిల్లాలోని గ్రామీణ ప్రాం తాలకు తిరిగే ఆర్టీసీ బస్సులను తిరుపతిలో సీఎం చేపట్టిన బహిరంగ సభకు మళ్లించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ప్రయాణికులు బస్సుల్లేక నానా అవస్థలు పడ్డారు. ఉదయం పూట సొంత పనుల నిమిత్తం గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు, మండల కేంద్రాలకు వచ్చిన ప్రజలు తిరిగి వెళ్లేందుకు బస్సులు లేకపోవడంతో నానా తంటాలుపడ్డారు. జిల్లా వ్యాప్తంగా అన్ని డిపోల్లో 1,246 బస్సు సర్వీసులు ఉన్నాయి. వాటిలో 750 బస్సులను ధర్మపోరాట దీక్షకు కార్యకర్తలను, డ్వాక్రా మహిళలను తరలించేందుకు వినియోగించారు. దీంతో ఆర్టీసీకి కూడా కోటి రూపాయలకు పైగా నష్టం వాటిల్లింది. దీంతో అసలే నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి మరో దెబ్బ పడింది.

ఎన్నికల కోడ్‌ ఉల్లఘించిన ఆర్టీసీ అధికారులు
జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మే 25వ తేదీ దాకా కోడ్‌ అమలులో ఉంది. మొదట 1,005 బస్సులు కావాలని టీడీపీ నేతలు, రవాణా శాఖా మంత్రి ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున బస్సులను ప్రభుత్వ ఛలానా ద్వారా ఇవ్వడానికి కుదరదని అధికారులు రవాణా శాఖ మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. ఎలాగైనా బస్సులు పంపించి తీరాలని ఆర్టీసీ అధికారులపై మండిపడ్డారు. ఒకానొక దశలో రీజనల్‌ మేనేజర్‌ చెంగల్‌రెడ్డి చేతులెత్తేయడంతో నెల్లూరు జోన్‌ ఈడీ మహేశ్వర తిరుపతికి వచ్చి రెండు రోజులపాటు మంత్రి అచ్చెన్నాయుడు, ఇతర పార్టీ నేతలు, ఆర్టీసీ ఆర్‌ఎం ఇతర అధికారులతో చర్చించారు.

ఆర్టీసీ అధికారుల ఐడియా
ఎన్నికల కోడ్‌ అమలులో ఉండడంతో ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తే తాము ఎక్కడ ఇరుక్కుంటామనే భయంతో ఆ పార్టీ నేతలకు ఆర్టీసీ అధికారులే ఐడియా అందించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మండలాధ్యక్షులు, జెడ్పీటీసీలు బస్సులు మండలానికి ఇన్ని చొప్పున కావాలని ఆర్టీసీ అధికారులను కోరినట్లు పేర్కొన్నారు. వారిచేతనే నియోజకవర్గాల వారీగా, మండలాల వారీగా 750 బస్సులకు కోటి 20 లక్షల డబ్బును అధికార పార్టీ నేతల నుంచి వసూలు చేశారు. ఆదివారం సాయంత్రం వరకు కూడా బస్సుల కోసం డబ్బులు చెల్లించని అధికార పార్టీ నేతలు సోమవారం ఉదయానికల్లా బస్సులను ఎలా గ్రామాలకు పార్టీ కార్యకర్తలు, మహిళల కోసం పంపించారో.. దీన్ని బట్టి చూస్తే ఆర్టీసీ అధికారులు అధికార పార్టీ నేతలు, మంత్రుల పట్ల ఎంత స్వామి భక్తి ప్రదర్శించారో దీన్నిబట్టి మనకు ఇట్టే తెలుస్తోంది. మరో 400 బస్సులను పక్క జిల్లాల నుంచి తెప్పించుకున్నారు. మరో 200 బస్సులు తమిళనాడు నుంచి తెప్పించుకుని తిరుపతి సభకు జనాన్ని తరలించారు.

తిరుమలలో అవస్థలు పడ్డ ప్రయాణికులు
తిరుమల నుంచి తిరుపతికి భక్తులను తరలించేందుకు కావాల్సినన్ని బస్సుల్లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జిల్లా వ్యాప్తంగా ఇతర డిపోల నుంచి తిరుమలకు రావాల్సిన బస్సులన్నింటిని రద్దు చేశారు. వాటన్నింటిని చంద్రబాబు బహిరంగ సభకు మళ్లించారు. దీంతో తిరుమల నుంచి ఒక్కొక్క బస్సులో సీటింగ్‌ కెపాసిటీ ప్రకారం 45 మంది ప్రయాణికులను ఎక్కించాల్సి ఉండగా సోమవారం ఒక్కొక్క బస్సులో 70 నుంచి 80 మంది భక్తులను కుక్కి తిరుపతికి పంపారు.

హఠాత్తుగా రద్దు..
జిల్లా వ్యాప్తంగా 750 బస్సులను రోజువారీ తిరుగుతున్న రూట్లలో రద్దు చేసి తిరుపతిలో జరిగే బహిరంగ సభకు పంపారు. దీంతో జిల్లాలో అనేక ప్రాంతాల్లో, పట్టణాల్లో ఉన్న ప్రయాణికులకు అవస్థలు తప్పలేదు. ఆర్టీసీ అధికారులు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఉన్నట్టుండి బస్సులను రద్దు చేయడం పట్ల ప్రయాణికులు ఆర్టీసీ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రయాణాలను వాయిదా వేసుకోలేక ట్యాక్సీలు, ఆటోల్లో వారు చేరాల్సిన ప్రాంతాలకు ఎట్టకేలకు అవస్థలు పడుతూ చేరుకునే పనిలో నిమగ్నమయ్యారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top