కొసరు మాని.. అసలుకే ఎసరు | Ration shops Quota no increase in Rajahmundry | Sakshi
Sakshi News home page

కొసరు మాని.. అసలుకే ఎసరు

Aug 3 2014 1:32 AM | Updated on Sep 2 2017 11:17 AM

కొసరు మాని.. అసలుకే ఎసరు

కొసరు మాని.. అసలుకే ఎసరు

‘అయిదేళ్ల క్రితం పండుగ దగ్గరకు వచ్చిందంటే రేషన్ దుకాణాల్లో కోటా పెంచే వారు. గోధుమలు, కందిపప్పు మరో కిలో అదనంగా వచ్చేవి. పంచదార రెండు కిలోలు ఇచ్చిన

సాక్షి, రాజమండ్రి : ‘అయిదేళ్ల క్రితం పండుగ దగ్గరకు వచ్చిందంటే రేషన్ దుకాణాల్లో కోటా పెంచే వారు. గోధుమలు, కందిపప్పు మరో కిలో అదనంగా వచ్చేవి. పంచదార రెండు కిలోలు ఇచ్చిన రోజులూ ఉన్నాయి. ఇప్పుడు   పండుగ వచ్చినా.. మామూలుగా ఇచ్చే సరుకులే లేవు పొమ్మంటున్నారు’ జిల్లాలో తెల్లరేషన్‌కార్డుదారులైన పేదల గోడు ఇది. దాదాపు గత నెలంతా ముస్లింలకు పవిత్రమైన రంజాన్ మాసం. ఇప్పుడు శ్రావణ మాసం రావడంతో హిందువులకు పండుగల కాలం ప్రారంభమైంది. ఇక ఒకదాని వెనుక ఒకటిగా పండుగలు వస్తూనే ఉంటాయి. ఏ పండుగ వచ్చినా నూనె, పప్పుల అవసరం ఎక్కువ అవుతుంది. అయితే..‘కొసరుకు ఆశపడే వేళ అసలుకే ఎసరు పెట్టిన’ చందంగా పండుగ వేళల్లోనే పేద జనానికి.. మామూలు రోజుల్లో ఇచ్చే వెచ్చాలు కూడా లేకుండా చేస్తోంది ప్రస్తుత ప్రభుత్వం.
 
 ఇప్పటికే ‘అమ్మ హస్తం’ సరుకుల జాబితాలో పామాయిల్, చింతపండు, పసుపు, కారం పంపిణీకి మంగళం పాడిన ప్రభుత్వం కందిపప్పు, గోధుమల పంపిణీకి కూడా ఎగనామం పెడుతోంది.జిల్లాలో సుమారు 12.50 లక్షల తెల్ల రేషన్ కార్డులున్నాయి. జూన్, జూలై నెలల్లో అన్ని చౌక దుకాణాల్లో కందిపప్పు పంపిణీ చేయలేక పోయారు. 20 శాతం దుకాణాలకు మాత్రమే అందాయని డీలర్లు అంటున్నారు. గత ఏప్రిల్ నుంచి పామాయిల్ పూర్తిగా నిలుపు చేశారు. జూన్, జూలై నెలల్లో బియ్యం, పంచదార మాత్రమే ఇచ్చారు. ఉప్పు ప్యాకెట్ల పంపిణీ కూడా సక్రమంగా జరగడంలేదు. ఆగస్టులో కూడా ఇదే తీరు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
 
 కందిపప్పు కోసం డీడీ తీసినా దండగే..
 తెల్లరేషన్ కార్డులకు కిలో కందిపప్పు ప్యాకెట్ రూ.50కి అందిస్తున్నారు. మార్కెట్‌లో కిలో కందిపప్పు రూ.75 నుంచి రూ.80 వరకూ పలుకుతోంది. హెచ్చుధరకు కొని పేదలకు రూ.50కి అందించడం ఆర్థిక భారమన్న భావనతో ఆగస్టులో కూడా కందిపప్పు కొనాలా వద్దా అనే మీమాంసలో పౌరసరఫరాల అధికారులు ఉన్నారు. రేషన్ డీలర్లు కావల్సిన రాబోయే నెలకు అవసరమైన సరుకుల నిమిత్తం ముందుగా డీడీలు తీసి పౌరసరఫరాల శాఖ అధికారులకు అందజేస్తారు. ఆ ప్రకారం వాళ్లకు సరుకుల పంపిణీ జరుగుతుంది. గత రెండు నెలల అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని కందిపప్పు కోసం డీడీలు తీయాలా వద్దా అని డీలర్లు సంశయిస్తున్నారు. అధికారులు కూడా సరుకు వస్తుందంటేనే కందిపప్పుకు డబ్బు కట్టండని లోపాయకారీగా సలహా ఇస్తున్నారని, దీంతో వృథాగా కట్టడమెందుకని డీలర్లు కూడా కట్టడం లేదని తెలుస్తోంది. ‘మేం ముందుగా డబ్బు కడితే కానీ సరుకులు ఇవ్వరు. రాని సరుకులకు డబ్బులు చెల్లించి, కష్టాలు కొనితెచ్చుకునేందుకు మేమూ సిద్ధంగాలేము’ అని ఓ డీలరు ‘సాక్షి’ వద్ద వ్యాఖ్యానించారు. రేషన్ సరుకుల పంపిణీలో నెలకొన్న అనిశ్చితికి ఆ మాటలే సాక్ష్యం.
 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement