బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాధ్‌సింగ్ రాష్ట్ర పర్యటన మరోసారి వాయిదా పడింది. గత నెల 21న జరగాల్సిన ఆయన పర్యటన నేటికి వాయిదా పడింది.
అనారోగ్య కారణాలతో నేటి పర్యటన రద్దు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాధ్‌సింగ్ రాష్ట్ర పర్యటన మరోసారి వాయిదా పడింది. గత నెల 21న జరగాల్సిన ఆయన పర్యటన నేటికి వాయిదా పడింది. అయితే అనారోగ్య కారణాలవల్ల రాజ్‌నాధ్ బుధవారం కూడా రాష్ట్రానికి రావడంలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి ఎన్.రామచంద్రరావు తెలిపారు. అయితే ఆర్‌ఎస్‌ఎస్ నేతలు రాంలాల్, సతీష్, మురళీధర్‌రావు వస్తున్నారని, నిర్దేశిత కార్యక్రమాలు యధావిధిగా కొనసాగుతాయని వారు చెప్పారు. పార్టీ పునర్నిర్మాణం, సీమాంధ్ర ఉద్యమం, అంతర్గత కలహాలు, పోటీ చేసే నియోజకవర్గాలు తదితర అంశాలను కోర్‌కమిటీ సమావేశంలో చర్చిస్తారని తెలిసింది.
పార్టీ తొలి ప్రాధాన్యత జాబితాలో ఉన్న సికింద్రాబాద్, మహబూబ్‌నగర్, నిజమాబాద్, కరీంనగర్, మల్కాజ్‌గిరి లోక్‌సభస్థానాల అభ్యర్థుల పేర్లు కేంద్ర నాయకత్వానికి చేరాయి. వీరిలో బండారు దత్తాత్రేయ, నాగం జనార్దన్‌రెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, సీహెచ్ విద్యాసాగరరావు, నల్లు ఇంద్రసేనారెడ్డి, ఎన్.రామచంద్రరావు, డాక్టర్ కె.లక్ష్మణ్ పేర్లు ఉన్నాయి. మరోవైపు టీడీపీతో పొత్తు వ్యవహారమై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈనేపథ్యంలో గత పొత్తులు, గెలిచిన సీట్లు వంటి వాటిని మరోసారి సమీక్షించనున్నారు. టీడీపీతో పొత్తు వ్యవహారంలో కీలకపాత్ర పోషిస్తున్నట్టుగా భావిస్తున్న వెంకయ్య నాయుడు కూడా బుధవారం జరిగే సమావేశాలకు హాజరుకావడం లేదని తెలిసింది.