ప్రజల వద్దకే పాలన.. నిజమైన వేళ!

Public happy On the performance of village and ward secretaries - Sakshi

గ్రామ, వార్డు సచివాలయాల పనితీరుపై ప్రజల హర్షాతిరేకాలు 

ఏళ్ల తరబడి పరిష్కారం కాని సమస్యలకూ రోజుల వ్యవధిలో మోక్షం

అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన సీఎంకు ప్రజానీకం కృతజ్ఞతలు

ఈమె పేరు గెడ్డం కృష్ణవేణి. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం. భర్తతో తగువులు వచ్చి విడిపోయి కుమార్తెతో కలిసి జీవిస్తోంది. బతుకు తెరువు కోసం రొయ్యల ఫ్యాక్టరీలో రోజువారీ కూలీగా పనిచేసుకుంటూ కుమార్తెను చదివించుకుంటోంది. ఆమెకు అన్ని అర్హతలున్నా ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు ఏవీ ఇప్పటి వరకు అందలేదు. గత ప్రభుత్వ హయాంలో రేషన్‌ కార్డు కోసం తిరగని కార్యాలయం అంటూ లేదు. ఎన్నిసార్లు అర్జీలు పెట్టుకున్నా పట్టించుకోలేదు. జన్మభూమి కమిటీలకు విన్నవించుకున్నా ఏవో కారణాలు చెప్పి తిరస్కరించేవారు.

చివరకు విసుగెత్తిపోయి కాకినాడ కలెక్టరేట్‌కు కూడా వెళ్లిందామె. అయినా ఫలితం శూన్యం. ఇక జీవితంలో రేషన్‌కార్డు రాదనే అభిప్రాయానికి వచ్చేసింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కృష్ణవేణిలో ఆశలు చిగురించాయి. జగన్‌ మాటలపై నమ్మకంతో మరోసారి రేషన్‌కార్డు కోసం అర్జీ పెట్టుకోవాలనుకుంది. సచివాలయ వ్యవస్థ ఏర్పాటయ్యాక తన గోడును చెప్పుకుని దరఖాస్తు చేసుకుందామని మండల కార్యాలయానికి వెళ్లే ప్రయత్నంలో ఉండగానే వలంటీర్‌ ఇంటికి వచ్చి అర్జీ పూర్తి చేసుకుని రేషన్‌ కార్డు మంజూరు చేశారు. ఒకటో తేదీ నుంచి పింఛన్‌ కూడా వస్తుందని తెలియడంతో ఆమె ఆనందానికి అవధుల్లేవు.

ప్రతి పనికీ పీక్కుతినే దళారుల వ్యవస్థ లేదు.. రోజుల తరబడి కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు.. వేలకు వేలు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు.. అవినీతి, అక్రమాలు జరగడానికి ఆస్కారమే లేదు.. అంతకుమించి కిలోమీటర్ల దూరం ప్రయాణించకుండా సొంత ఊరిలోనే పనులు జరగడం చూసి కలా? నిజమా? అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏకంగా 541 రకాల ప్రభుత్వ సేవలు ఇంటి ముందుకే అందుబాటులోకి రావడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అందులో 336 సేవలు 72 గంటల్లోనే పూర్తి చేస్తున్నారు.  ‘ప్రజల వద్దకే పాలన’ అన్న మాటలను రాజకీయ నాయకుల నోట వినడమేగానీ ఎప్పుడూ ప్రత్యక్షంగా చూడలేదని, ఇప్పుడు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా సీఎం వైఎస్‌ జగన్‌ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారని కృతజ్ఞతలు చెబుతున్నారు. ప్రభుత్వ పథకాలను డోర్‌ డెలివరీ చేయడానికి ఉద్దేశించిన వలంటీర్ల వ్యవస్థ కూడా ప్రజల నుంచి మంచి మార్కులు కొట్టేసింది.

వలంటీర్లు తమకు కేటాయించిన ఇళ్ల వద్దకు వెళుతూ.. వారికున్న సమస్యలను తెలుసుకొని పరిష్కార మార్గాలు కూడా సూచిస్తున్నారు. ఆహ్లాదకరమైన, విశాలమైన భవనాల్లో చిరునవ్వుతో పలకరించే ఉద్యోగులతో జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజు నుంచి సచివాలయ వ్యవస్థ పూర్తిస్థాయిలో పనిచేయడం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సచివాలయాల్లో పనుల తీరుపై సాక్షి రాష్ట్ర వ్యాప్తంగా అభిప్రాయాలు సేకరించింది. ఏళ్ల తరబడి పరిష్కారం కాని సమస్యలు సచివాలయాల్లో రోజుల్లోనే పరిష్కారం కావడంతో ప్రతి ఒక్కరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రేషన్‌కార్డులు, పింఛన్‌లు, రైతులకు అవసరమయ్యే అన్ని రకాల సర్టిఫికెట్‌లు, అడంగల్‌లు, మరణ, జనన ధ్రువీకరణ పత్రాలు, గ్రామ సమస్యలు.. ఇలా ఏమైనా సరే వెంటనే పరిష్కారం అవుతున్నాయి. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం రాష్ట్రంలో సాకారమైందని పేర్కొంటున్నారు. 
– సాక్షి, నెట్‌వర్క్‌

నాలుగు గంటల్లో దాహం తీరింది
విశాఖ జిల్లా ఏజెన్సీలోని పాడేరు మండలం సుండ్రుపుట్టు గ్రామ సచివాలయం పరిధిలోని లోచలిపుట్టు గ్రామంలోని ఈ చేతి పంపు పాడైపోయి కొన్ని నెలలు గడిచిపోయాయి. స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో తాగునీటి కోసం గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. తమకు దగ్గరలోనే ఇటీవల గ్రామ సచివాలయం ప్రారంభం కావడంతో గ్రామస్థుడు గురువారం ఉదయం పది గంటలకు అక్కడికి వెళ్లి ఫిర్యాదు చేశాడు. అక్కడి సచివాలయంలోని సిబ్బంది వెంటనే స్పందించారు. పాడైన పాత పైపులను తొలగించి కొత్త పైపులను వేయించారు. మధ్యాహ్నానికల్లా బోరు బాగు అయ్యింది. దీంతో గిరిజనులు సంబరాలు చేసుకున్నారు.  

సచివాలయాల్లో స్పందన బాగుంది 
నా వయసు 70 సంవత్సరాలు. వృద్ధాప్య పింఛను కోసం గత ఐదేళ్లుగా తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక గ్రామ సచివాలయం ఏర్పాటు చేయడంతో అక్కడకు వెళ్లి ఈ నెల 28వ తేదీన పింఛన్‌ దరఖాస్తును అధికారులకు అందజేశా. వారు వెంటనే నా వివరాలను నమోదు చేసుకొని పింఛన్‌కు అర్హులని తెలియజేశారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి వలంటీర్లు ఇంటి వద్దకే వచ్చి పింఛన్‌ అందజేస్తారన్నారు. 
– తిరుపాల్‌రెడ్డి, ఊడుమాల్పురం, కర్నూలు జిల్లా 

రెండేళ్ల సమస్యకు సత్వర పరిష్కారం   
మా నాన్న జరుగుమల్లి వెంకటేశ్వర్లు రెండేళ్ల కిందట చనిపోయారు. ఆయన పేరు మీదున్న 1.5 ఎకరాల భూమిని నా పేరు మీద అడంగల్‌లో మార్చడానికి రెండేళ్ల నుంచి తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నప్పటికీ పని కాలేదు. సచివాలయ వ్యవస్థ పూర్తిగా అందుబాటులోకి రావడంతో నా వద్ద ఉన్న డాక్యుమెంట్లతో సచివాలయం ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నా. మూడు రోజుల్లోనే పని పూర్తవుతుందని సంబంధిత ఉద్యోగి రసీదు ఇచ్చారు. 
–  జరుగుమల్లి చిరంజీవి, అల్లూరు,నెల్లూరు జిల్లా 

వెంటనే ఇంటి స్థలం 
నాకు సొంత ఇల్లు లేదు. గతంలో జన్మభూమి సభల్లో ఇంటి స్థలం మంజూరు చేయాలని అర్జీలు పెట్టుకున్నా. అయినా నాటి ప్రభుత్వం, టీడీపీ నాయకులు స్థలం మంజూరు చేయలేదు. గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసిన తరువాత వలంటీర్లు ఇంటింటి సర్వేలో నన్ను నిరుపేదగా గుర్తించారు. ఇంటి స్థలం మంజూరుకు ప్రతిపాదించారు. ఇంటి స్థలం పంపిణీ జాబితాలో నా పేరు వచ్చింది. మా కుటుంబమంతా సీఎం జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం. 
– అప్పలనాయుడు, జయితి గ్రామం, సాలూరు మండలం, విజయనగరం జిల్లా 

సత్వర పరిష్కారం 
నేను కూలి పని చేసుకొని బతుకుతున్నా. గత ప్రభుత్వంలో నిర్వహించిన జన్మభూమి గ్రామ సభల్లో ఎన్నో పర్యాయాలు రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ మంజూరు కాలేదు. దీంతో ఎలాంటి ప్రభుత్వ పథకాలు అందేవికావు. ఇటీవల ప్రారంభమైన గ్రామ సచివాలయంలో ఈనెల 27న రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నా. గురువారం కార్డు మంజూరైంది. ఇప్పటి నుంచి ప్రభుత్వ పథకాలు అన్నీ నాకు అందుతాయి. గ్రామ సచివాలయం వ్యవస్థతో ఎంతటి పనైనా, సమస్య అయినా పరిష్కారం అవుతుందనే నమ్మకం కలిగింది. 
– ఈర్ల రాధాకృష్ణ, నాగులవరం, అర్థవీడు మండలం, ప్రకాశం జిల్లా 
ప్రకాశం జిల్లా అల్లూరు గ్రామంలోని గ్రామ సచివాలయం–2 వద్ద దరఖాస్తు చేసుకునేందుకు వచ్చిన గ్రామ ప్రజలు   

పదేళ్లుగా పరిష్కారం కానిది నిమిషాల్లో అయింది 
నా తండ్రి పేరు చిన్న విశ్వనాథం. 2010లో ఆయన చనిపోయారు. అప్పటి నుంచి ఇంటి పన్ను రశీదు ఆయన పేరు మీదే వస్తోంది. పేరు మార్పు కోసం లాయర్‌ అఫిడవిట్, తహసీల్దార్‌ సర్టిఫికెట్‌ ఉన్నప్పటికీ నేటి వరకు ఇంటి పన్ను రశీదుపై పేరు మాత్రం మారలేదు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సచివాలయ వ్యవస్థ తీసుకు రావటంతో ఇంటి పన్ను రశీదుపై నాపేరును నిమిషాల్లో మార్చారు. మండల కార్యాలయాల చుట్టూ తిరగకుండా మా గ్రామంలోనే నా పని పూర్తయినందుకు చాలా సంతోషంగా ఉంది. 
– బైసు షరాబందీ, ముండ్లపాడు, పెనుగంచిప్రోలు మండలం, కృష్ణా జిల్లా 

లంచం ఇవ్వాల్సిన బాధ తప్పింది.. 
గతంలో అడంగల్‌ కాపీ పొందడానికి వారాలు పట్టేది. మీ–సేవలో ముందుగా దరఖాస్తు చేసుకున్న తర్వాత వీఆర్‌వో, ఆర్‌ఐ, సర్వేయర్, సూపరింటెండెంట్‌ పరిశీలన అనంతరం తహసీల్దార్‌ ధ్రువీకరణ ముగిసాక అడంగల్‌ ఇచ్చేవారు. దీనికి తోడు దరఖాస్తు త్వరగా ముందుకు కదలడం కోసం ప్రతి టేబుల్‌ వద్ద ఎంతో కొంత ముట్టజెప్పాల్సి వచ్చేది. ప్రస్తుత ప్రభుత్వంలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. గ్రామ సచివాలయాలు ప్రారంభమయ్యాయి. అండంగల్‌ కాపీ కోసం దరఖాస్తు చేసుకున్న వెంటనే ఐదు నిమిషాల్లో అందించారు. సచివాలయాల ద్వారా సేవలు త్వరితగతిన అందుతున్నాయి.  
– శివయ్య, రైతు, త్యాళ్ళూరు, పెదకూరపాడు మండలం, గుంటూరు జిల్లా 

వేగంగా స్పందించారు.. రేషన్‌కార్డు ఇచ్చారు 
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మండలం శనివారపు పేటకు చెందిన గణేష్‌ వ్యవసాయ కూలీ. పెళ్లయి ఆరేళ్లు దాటింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. తన కుటుంబం పేరిట రేషన్‌ కార్డు కోసం తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేశాడు. కనీసం అతని దరఖాస్తు కూడా తీసుకోలేదు. మీ–సేవకు వెళ్లి ఆన్‌లైన్‌లో పలుమార్లు దరఖాస్తు చేసినప్పటికీ వీఆర్వో కనీసం విచారణ జరపలేదు. రేషన్‌ కార్డు రాలేదు. దీనివల్ల పలు ప్రభుత్వ పథకాలకు అర్హత లేకుండా పోయింది. ఇప్పుడు జగన్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్న కాలనీలోనే సచివాలయం వచ్చింది. అక్కడ స్పందనలో ఫిర్యాదు చేస్తే వెంటనే సచివాలయ ఉద్యోగి ఇంటికి వచ్చి విచారణ చేశారు. వెంటనే రేషన్‌కార్డు వస్తుందని చెప్పారు. ఇంత వేగంగా రేషన్‌కార్డు సమస్య తీరిపోవడం నమ్మలేకపోతున్నానని, పాలన అంటే ఇలాగే ఉండాలని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. 

రెండు గంటల్లోనే అంగన్‌వాడీకి స్థలం
అనంతపురం జిల్లా పెనుకొండలోని నారాయణమ్మ కాలనీలో అంగన్‌వాడీ భవన నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ సచివాలయం–1లో ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ సుజాత ఉదయం దరఖాస్తు చేసుకున్నారు. కేవలం రెండు గంటల్లోనే 680–2 సర్వే నంబర్‌లో 3 సెంట్ల స్థలాన్ని అంగన్‌వాడీ భవన నిర్మాణానికి కేటాయిస్తూ తీర్మానం చేసి సచివాలయ కార్యదర్శి పవన్‌కుమార్‌ రెడ్డి ఉత్తర్వులు అందజేశారు. 

ఇకపై వ్యయప్రయాసలు లేవు 
నా పేరు రెడ్డప్ప. చిత్తూరు జిల్లా నిమ్మనపల్లె మండలం రెడ్డివారిపల్లె పంచాయతీ సోమానుపల్లె ఎస్టీ కాలనీలో నివాసం ఉంటున్నాను. నిమ్మనపల్లె మండల కేంద్రం మా గ్రామం నుంచి 15 కిలోమీటర్లు. ఏ పత్రం కావాలన్నా, పని కావాలన్నా అధికారుల కోసం అక్కడికి వెళ్లాల్సిందే. రెండురోజుల కిందట భూమికి సంబంధించి 1బి కావాల్సి వస్తే మీ–సేవకు వెళ్లాలని అనుకుంటుండగా వలంటీరు కనిపించి రెడ్డివారిపల్లె సచివాలయంలో ఉచితంగానే ఇస్తున్నట్లు చెప్పాడు. సరే ఓ సారి వెళ్లి చూద్దామనుకుని వెళితే.. నేను అడిగిన 1–బిని నిమిషాల వ్యవధిలో అక్కడే కూర్చోబెట్టి అక్కడికక్కడే ఇచ్చారు. ప్రభుత్వ సేవలన్నింటినీ ప్రజల ముంగిటకు చేర్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ ఇంతలా ఉపయోగపడుతుందని ఇప్పుడే తెలిసింది. ప్రభుత్వానికి కృతజ్ఞతలు. 

ఒక్క రోజులోనే భూ సమస్య పరిష్కారం.. 
నేను ఎన్నో ఏళ్ల కిందటే నాకున్న భూమిని అమ్మాను. అయితే ఆన్‌లైన్‌లో ఇప్పటికీ ఆ భూములు నా పేరు మీదే కనిపిస్తున్నాయి. దీంతో భూములు కొనుగోలు చేసిన వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్ని అర్జీలు ఇచ్చినా పరిష్కారం లభించలేదు. గ్రామంలో ఏర్పాటు చేసిన సచివాలయానికి వెళ్లి నా సమస్యను విన్నవించి అధికారులకు అర్జీ అందజేశా. ఒక్క రోజులోనే సమస్యను పరిష్కరించారు. నయా పైసా ఖర్చు లేకుండా, మండల కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా సమస్య పరిష్కారమైనందుకు చాలా సంతోషంగా ఉంది.  
– మిడతాన సత్తిబాబు, రైతు, పెదఖండేపల్లి, ఎస్‌.కోట మండలం, విజయనగరం జిల్లా 

24 గంటల్లోనే మరణ ధ్రువీకరణ పత్రం
ఈ ఫొటోలోని వ్యక్తి పేరు బి.రాజన్న. వైఎస్సార్‌ జిల్లా కమలాపురం మండలం చదిపిరాళ్ల పంచాయతీ, రామచంద్రాపురం గ్రామానికి చెందిన వారు. ఆయన సతీమణి బి.కాంతమ్మ జనవరి 25న మృతి చెందారు. ఈ నేపథ్యంలో 29వ తేదీ మధ్యాహ్నం ఆయన చదిపిరాళ్ల సచివాలయానికి వెళ్లి తన భార్య మరణ ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆ మరుసటి రోజే అంటే గురువారం (30వ తేదీ) ఉదయం సచివాలయ ఉద్యోగులు ఆయనకు ధ్రువీకరణ పత్రం అందజేశారు. సర్టిఫికెట్‌ కోసం ఎన్ని రోజులు పడుతుందో.. ఎక్కడెక్కడ తిరగాల్సి వస్తుందోనని భయపడ్డానని, 24 గంటల్లోపే అందించడం ఊహించలేకపోయానని రాజన్న తెలిపారు. ఇంతటి వేగవంతమైన పాలన అందిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. 

కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు
ఈ నెల 19వ తేదీన మా తాత భీమారెడ్డి చనిపోయాడు. ఈ నెల 24వ తేదీన మా పంచాయతీలో ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయంలో మా తాత డెత్‌ సర్టిఫికేట్‌ కావాలని దరఖాస్తు చేసుకున్నాను. నాకు 26వ తేదీన గ్రామ సచివాలయం ప్రారంభోత్సవం రోజున సర్టిఫికెట్‌ను సచివాలయ సిబ్బంది అందజేశారు. గతంలో పలు సర్టిఫికేట్‌లు కోసం కార్యాలయాల చుట్టూ రోజుల తరబడి తిరిగిన అనుభవం ఉంది. ఇంత త్వరగా పని పూర్తి అయ్యేలా సచివాలయాలు ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి 
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి హ్యాట్సాఫ్‌. 
– పులుగు శ్రీనివాసరెడ్డి, కొత్తపాలెం పంచాయతీ మూలగాని వారిపాలెం, చినగంజాం మండలం, ప్రకాశం జిల్లా   

ముఖ్యమంత్రికి ధన్యవాదాలు 
నా భర్త చనిపోయి 15 సంవత్సరాలు అయ్యింది. పింఛన్‌ కోసం ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా ఇప్పటివరకు పింఛన్‌ రాలేదు. గ్రామంలో ఏర్పాటు చేసిన సచివాలయం స్పందన కౌంటర్‌లో అర్జీ ఇచ్చిన వెంటనే స్పందించారు. అర్హత జాబితాలోకి నా అర్జీ వెళ్లింది. రోజుల కొద్దీ తిరగకుండానే నిమిషాల్లోనే పనులు పూర్తి కావటం చాలా సంతోషం కలిగిస్తుంది. ఇలాంటి వ్యవస్థ తీసుకొచ్చిన ముఖ్యమంత్రి జగన్‌కు ధన్యవాదాలు. 
– జంగాల మహాలక్ష్మి, అనిగండ్లపాడు, పెనుగంచిప్రోలు మండలం, కృష్ణా జిల్లా 

గతంలో 30 కిలోమీటర్లు పోవాల్సి వచ్చేది! 
నాపేరు రఘు. ఊరు నూతిమడుగు గ్రామం, కళ్యాణదుర్గం నియోజకవర్గం అనంతపురం జిల్లా. నాకు 2.50 ఎకరాల పొలం ఉంది. భూమికి సంబంధించిన 1బి, అడంగల్‌ కావాలంటే 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న కంబదూరులోని తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లేవాళ్లం. రోజుల కొద్దీ కార్యాలయం చుట్టూ తిరిగినా పనులు జరిగేవి కావు. ఇప్పుడు భూమికి సంబంధించిన 1బి, అడంగల్‌ను మా ఊరి సచివాలయంలోనే తీసుకున్నా. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం చాలా బాగుంది.  

గౌరవంగా కూర్చోబెట్టి నా పని పూర్తి చేశారు.. 
గతంలో ఏ పని కావాల్సినా మండల కేంద్రానికో, పట్టణానికో వెళ్లాల్సి వచ్చేది. మీ–సేవలో దరఖాస్తు చేసుకోవడం, దానికి డబ్బులు కట్టడం, వారు రెండు, మూడు రోజుల తర్వాత రమ్మంటే తిరిగి ఖర్చులు పెట్టుకుని వెళ్లి రావడం జరిగేది. పదిహేను రోజుల కిందట నా భర్త కృష్ణమూర్తి చనిపోయారు. ఆయనకు సంబంధించిన మరణ ధ్రువీకరణ పత్రం కోసం ఊర్లోని సచివాలయానికి వెళ్లా. అక్కడ ఎంతో గౌరవంగా వారు కూర్చోబెట్టి నా పని తెలుసుకుని, వివరాలన్నీ అడిగి అక్కడికక్కడే 5 నిమిషాల్లో మరణ ధృవీకరణ పత్రం ఇవ్వడమే కా>కుండా సచివాలయంలో ఏఏ పత్రాలు తీసుకోవచ్చో వివరంగా చెప్పారు. డబ్బులు ఖర్చు కాకుండా, క్యూలో నిల్చునే పనిలేకుండా, ఉన్న ఊర్లోనే కావాల్సిన పత్రాలు క్షణాల్లో అందుతుంటే అంతకంటే సంతోషం ఏముంటుంది. 
– జయమ్మ, దిగువపల్లె, ముష్టూరు పంచాయతీ, నిమ్మనపల్లె మండలం, చిత్తూరు జిల్లా 

మా ఊరిలోనే క్షణాల్లో 1–బి 
గతంలో 1–బి కావాలంటే ఎచ్చెర్ల మీ సేవ కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేది. అక్కడ సర్వర్లు పనిచేయక పోవటం, ఇంటర్నెట్‌ సమస్యలు వంటివి తలెత్తేవి. దీంతో ఒక్కోసారి 1–బి కోసం రెండు మూడు సార్లు తిరగాల్సి వచ్చేది. గణతంత్ర దినోత్సవం నుంచి స్థానికంగా గ్రామ సచివాలయం సేవలు ప్రారంభమయ్యాయి. దీంతో 1బి క్షణాల్లో అందుతోంది. 
– ఎస్‌ఎం పురం గ్రామం, ఎచ్చెర్ల మండలం, శ్రీకాకుళం జిల్లా  

వెతుక్కుంటూ పింఛన్‌ వచ్చింది 
గతంలో ఏడెనిమిది సార్లు పృద్ధాప్య పింఛన్‌ కోసం దరఖాస్తులు చేసుకున్నా. ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు మా గ్రామ వలంటీర్‌ నా దగ్గరకు వచ్చి దరఖాస్తు తనే పూర్తి చేసి ఆధార్, రేషన్‌ కార్డు జిరాక్స్‌ తీసుకున్నారు. వెంటనే పింఛన్‌ మంజూరైంది. నాకు సొంత ఇల్లు లేకపోవడాన్ని గుర్తించి ఇంటి స్థలం కూడా వచ్చేలా చూశారు. ఏదైనా ప్రజలకు మేలు చేయాలంటే ఇలాగే చేయాలి 
– దుర్గెంపూడి ఈశ్వరరెడ్డి, మిరియాల, కారంపూడి మండలం, గుంటూరు జిల్లా 

ఏడాదిన్నర ఎదురుచూపులకు తెర 
తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రధాన కేంద్రం రంపచోడవరానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పందిరిమాడి గ్రామంలో గూడల సూర్యప్రకాష్‌రావు, వెంకటలక్ష్మి దంపతులు నివాసం ఉండేవారు. విధి వక్రీకరించి భర్త ఏడాదిన్నర కిందట అనారోగ్యంతో చనిపోయాడు. అప్పటి నుంచి వితంతు పింఛన్‌ కోసం వెంకట లక్ష్మి అనేక పర్యాయాలు ఎంపీడీవో కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం లభించలేదు. చూస్తాం.. చేస్తాం అనే అధికారుల సమాధానాలతోనే ఏడాదిన్నర గడిచిపోయింది. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించాక వచ్చిన గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ఆమెకు న్యాయం జరిగింది. వితంతు పింఛను కోసం ఆమె దరఖాస్తు చేయకుండానే వలంటీరు నేరుగా ఇంటికి వచ్చి అర్జీ తీసుకుని వెళ్లాడు. ఇక పింఛన్‌ రాదని అనుకున్న ఆమెకు వెంటనే వితంతు పింఛన్‌ మంజూరైంది. రెండు నెలలుగా పింఛను అందుతోందని, దీంతో తన కష్టాలు గట్టెక్కాయని ఆమె ఆనందపడుతోంది.  

ఇప్పుడు ఇంటి వద్దకే పింఛన్‌ 
అప్పుడు కాళ్లరిగేలా తిరిగినా పట్టించుకోలేదు 
పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం సత్రపుపాలెంకు చెందిన చింతపూడి సత్యవతిది మధ్య తరగతి కుటుంబం. భర్త ఆరేళ్ల కిందట అనారోగ్యంతో మృతి చెందాడు. కుటుంబ పోషణ భారం కావడంతో గత ప్రభుత్వ హయాంలో వితంతు పింఛన్‌ కోసం పలుమార్లు దరఖాస్తు చేసుకుంది. తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరిగినా పనికాలేదు. జన్మభూమి కమిటీ వారిని కలిస్తేనే పింఛన్‌ వస్తుందని చెప్పడంతో వారి చుట్టూ కూడా కాళ్లరిగేలా తిరిగింది. ఇదిగో.. అదిగో.. అంటూ కాలం వెళ్లదీసి ఆఖరికి పింఛన్‌ దరఖాస్తును తిరస్కరించేవారు. ఇలా చాలా సార్లు జరిగింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక ఎక్కడికీ వెళ్లనక్కర్లేకుండానే ఇంటివద్దకు వచ్చిన వలంటీర్‌ అమె కుటుంబ వివరాలు సేకరించి తీసుకెళ్లారు. మళ్లీ వారే పిలిచి మీపేరు గ్రామ సభలో చదివి వినిపించాం.. మీకు పింఛన్‌ మంజూరైంది అని చెప్పారు. 1వ తేదీన ఇంటికి వచ్చి పింఛన్‌ అందిస్తామని గురువారం ఉదయమే వలంటీర్‌ వచ్చి చెప్పివెళ్లారు. దీంతో సత్యవతి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

దరఖాస్తు చేసిన వెంటనే అడంగల్‌ అందుకున్నా 
నాకు 2 ఎకరాలు మెట్ట భూమి ఉంది. ఈ పొలంపై బ్యాంక్‌లో పంట రుణం తీసుకోవడానికి బ్యాంక్‌కి వెళితే 1బి అడంగల్‌ కావాలని అడిగారు. ఈ నెల 27న ఉదయం మా గ్రామంలోని సచివాలయ అధికారిని సంప్రదించగా అదే రోజు మధ్యాహ్నానికి 1బి అడంగల్‌ సర్టిఫికెట్‌ అందజేశారు. మా గ్రామంలోనే ఇంత మంచి సేవలు అందుబాటులోకి రావడం చాలా సంతోషకరంగా ఉంది.   
– పఠాన్‌ అమీనా, మహిళా రైతు, కనపర్తి, నాగులుప్పలపాడు మండలం, ప్రకాశం జిల్లా 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top