కరెంట్ కట్‌కట | power cut | Sakshi
Sakshi News home page

కరెంట్ కట్‌కట

Feb 18 2015 2:15 AM | Updated on Jul 28 2018 6:48 PM

కరెంటు కష్టాలు మొదలయ్యాయి. టీడీపీ అధికారంలోకి వచ్చాక కరెంటు కష్టాలు ఉండవని టీడీపీ అధినేత చంద్రబాబు ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చారు.

 నెల్లూరు (రవాణా): కరెంటు కష్టాలు మొదలయ్యాయి. టీడీపీ అధికారంలోకి వచ్చాక కరెంటు కష్టాలు ఉండవని టీడీపీ అధినేత చంద్రబాబు ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక తానేమీ తక్కువ కాదంటూ ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు. మొన్న కరెంటు చార్జీలకు పచ్చజెండా ఊపిన బాబు సర్కారు.. నేడు అనధికారిక కోతలకు ఆమోదముద్రవేసింది.
 
  వేసవి ప్రారంభం కాకముందే జిల్లాలో కరెంటు కోతలు పెడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ‘ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్’ పేరుతో 4 నుంచి 5 గంటలపాటు అనధికారిక కోతలు విధిస్తున్నారు. మార్చి నుంచి మండలకేంద్రాలు, ఏప్రిల్ ప్రారంభం నుంచి కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో కోతలు విధించాలని జిల్లా అధికారులకు ప్రభుత్వం అనధికారిక ఆదేశాలు జారీచేసినట్లు సమాచారం. దీంతో వారంరోజులుగా జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో కరెంటు కోతలు విధిస్తున్నారు.
 
  ఫిబ్రవరి మధ్యలోనే నాలుగు గంటలపాటు కోతలు విధిస్తే రాబోయే రోజుల్లో కోతలు ఏ స్థాయిలో ఉంటాయోనని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 11,86,838 విద్యుత్ సర్వీసులు ఉన్నాయి. వీటిలో 9,06,973 గృహాలు, 73,992 వాణిజ్య అవసరాలకు, 42,122 పరిశ్రమలు, 1,44,864 వ్యవసాయ, 7,119 వీధిదీపాలు, 3,330 వాటర్ వర్క్స్, 495 భారీ పరిశ్రమలు, 7,943 ఇతర సర్వీసులు ఉన్నాయి. పూర్తి స్థాయిలో ఈ సర్వీసులకు రోజుకు 1.10 కోట్ల యూనిట్లు కోటా అవసరమవుతుందని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రభుత్వం ప్రస్తుతం రోజుకు 96 లక్షల యూనిట్ల కరెంటు మాత్రం సరఫరా చేస్తున్నట్లు అధికారవర్గాలు వెల్లడించాయి.
 
 పెరిగిన వినియోగం..
 తగ్గిన సరఫరా..
 జిల్లాలో గత వారంరోజులుగా విద్యుత్ వినియోగం అనూహ్యంగా పెరిగింది. ప్రస్తుతం రోజుకు 99 లక్షల యూనిట్లు వినియోగిస్తున్నారు. శుక్రవారం 99 లక్షలు, శనివారం 97 లక్షల యూనిట్ల కరెంటును వినియోగించినట్లు అధికారులు చెబుతున్నారు. అదే వారంరోజుల క్రితం 94 లక్షల యూనిట్లు వినియోగించారు. వారంరోజుల వ్యవధిలో రోజుకు 5 లక్షల యూనిట్ల కరెంటు వినియోగం పెరగటంతో అధికారులు అనధికారిక కోతలకు దిగారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ డిమాండ్ ఉన్న సమయంలో 4 నుంచి 5 గంటలపాటు ‘ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్’ పేరుతో కరెంటు కోతలు విధిస్తున్నారు.
 
 నిరంతరాయ కరెంటు హామీ ఉత్తుత్తిదే
 టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామాల్లో 24 గంటల పాటు నిరంతరాయంగా కరెంటు సరఫరా చేస్తామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఢంకా బజాయించారు. అయితే అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్నా నిరంతర సరఫరా సంగతేమో కానీ.. గతంలో ఇస్తున్న కరెంటు సరఫరాలోనూ సుమారు 5 గంటలపాటు కోతలు విధిస్తున్నారు. రైతులకు పగటిపూట 7 గంటలపాటు నిరంతరాయంగా కరెంటు ఇస్తామన్న బాబు హామీ తుంగలో తొక్కారు.
 
 రాత్రి సమయాల్లో మూడు విడతలుగా కరెంటు సరఫరా చేస్తున్నారు. అదికూడా 5 నుంచి 6 గంటల పాటు మాత్రమే సరఫరా చేస్తున్నట్లు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏడు గంటలకే దిక్కులేకపోతే.. 9 గంటల కరెంటు సరఫరాపై అస్సలు నమ్మకం లేదని రైతులు చెబుతున్నారు. జిల్లాలో ఉదయగిరి, ఆత్మకూరు, వెంకటగిరి, కావలి, సర్వేపల్లి, సూళ్లూరుపేట, గూడూరు, కోవూరు నియోజకవర్గాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో రోజూ కరెంటు సరఫరాలో కోత విధిస్తున్నట్లు స్థానికులు స్పష్టం చేస్తున్నారు. నెల్లూరు నగరంలోనూ కరెంటు కోతలు తప్పటం లేదు. రిపేర్ల పేరుతో పలు ప్రాంతాల్లో గంట నుంచి రెండు గంటలపాటు కరెంటు కోతలు విధిస్తున్నారు.
 
 వారం రోజులుగా అనధికారిక కోతలు
 -వెంకటేశ్వరావు, టెక్నికల్ డీఈ ట్రాన్స్‌కో
 జిల్లాలో వారం రోజుల నుంచి అనధికారిక ‘ఈఎల్‌ఆర్’ అమలు చేస్తున్నాం. రోజుకు 3 నుంచి 4 గంటలపాటు హైదరాబాద్‌లోని ఉన్నతాధికారులే కోత అమలుచేస్తున్నారు. ఈ కోతలు ఎంతకాలం ఉంటుందో చెప్పలేం. రానున్న రోజుల్లో మండలాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లోనూ ఈఎల్‌ఆర్ విధించక తప్పదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement