పోలీసుల పై టీడీపీ వర్గీయుల దాడి | Police to investigate attack on TDP leaders | Sakshi
Sakshi News home page

పోలీసుల పై టీడీపీ వర్గీయుల దాడి

Aug 10 2013 2:34 AM | Updated on Aug 10 2018 9:40 PM

నూతన సర్పంచ్ ప్రమాణ స్వీకారం సందర్భంగా టీడీపీ వర్గీయులు, పోలీసుల నడుమ వాగ్వాదం, తోపులాట, రాళ్ల దాడి ఘటనలు చోటు చేసుకోవడంతో ఒక కానిస్టేబుల్ గాయపడ్డాడు.

కంబదూరు, న్యూస్‌లైన్: నూతన సర్పంచ్ ప్రమాణ స్వీకారం సందర్భంగా టీడీపీ వర్గీయులు, పోలీసుల నడుమ వాగ్వాదం, తోపులాట, రాళ్ల దాడి ఘటనలు చోటు చేసుకోవడంతో ఒక కానిస్టేబుల్ గాయపడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. మండల పరిధిలోని ములకనూరు గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా టీడీపీ మద్దతుతో గోవిందమ్మ గెలుపొందింది. శుక్రవారం ఆమె ప్రమాణ స్వీకారం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్భాటం ప్రదర్శించేందుకు టీడీపీ నాయకులు లక్ష్మినారాయణ చౌదరి, శ్రీరాములు, ప్రకాష్ రెడ్డి, తిమ్మరాజు, వెంకేశులు తదితరులు సిద్ధమయ్యారు. డప్పుల శబ్దాలు, బాణా సంచాల నడుమ ర్యాలీ నిర్వహిస్తుండగా,  గ్రామంలోని పరిస్థితుల దృష్ట్యా ఎస్‌ఐ నారాయణ యాదవ్ వారిని అడ్డుకున్నారు.
 
 వారి నుంచి డప్పులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో  టీడీపీ వర్గీయులైన పురుషులు, మహిళలు ఎస్‌ఐతో వాగ్వాదం చేశారు. ఈ సందర్భంగా తోపులాట చోటుచేసుకుంది. తమపై చేయి చేసుకున్నాడని ఆరోపిస్తూ మహిళలు ఎస్‌ఐని తోసివేశారు. గతంలో ఎస్‌ఐ ప్రవర్తనపై ఆగ్రహంతో ఉన్న టీడీపీ వర్గీయులు ఇదే అదనుగా వారిపై తిరగబడ్డారు.  కొందరు వ్యక్తులు రాళ్లు రువ్వడంతో ప్రసాద్ అనే కానిస్టేబుల్ తలకు గాయమైంది. కాగా, కావాలనే కానిస్టేబుల్ తలపై  రాయితో కొట్టారని పోలీసులు అంటున్నారు. పరిస్థితి అదుపుతప్పుతుందని భావించిన టీడీపీ నాయకులు ఆ పార్టీ సానుభూతి పరులకు సర్దిచెప్పారు. కంబదూరు ఎస్‌ఐ మంత్రి రఘువీరా ఏజెంటుగా వ్యవహరిస్తూ తమను ఇబ్బందులు పెడుతున్నాడని టీడీపీ నాయకులు మండిపడ్డారు. గాయపడిన కానిస్టేబుల్‌కు కళ్యాణదుర్గం ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేయించి అనంతపురానికి తరలించారు. కళ్యాణదుర్గం  ఎస్‌ఐ కత్తి శ్రీనివాసులు  గ్రామానికి చేరుకుని బందోబస్తు నిర్వహించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, బాధ్యులపై చర్యలు తీసుకోనున్నట్లు ఎస్‌ఐ నారాయణ యాదవ్ తెలిపారు.
 
 కానిస్టేబుల్‌కు పరామర్శ
 అనంతపురం క్రైం, న్యూస్‌లైన్:  ములకనూరు సంఘటనలో గాయపడి అనంతపురంలోని ఆశ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ ప్రసాద్‌ను  పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు త్రిలోక్‌నాథ్, సెక్రెటరీ గోరంట్ల మాధవ్ పరామర్శించారు. దాడిని  తీవ్రంగా ఖండించారు.

Advertisement
 
Advertisement
Advertisement