టీడీపీ నేతలే క్రికెట్‌ బు‘కీ’లు!

Police Arrested TDP Leaders For Cricket Betting In Guntur - Sakshi

ముగ్గురు నిర్వాహకులు సహా14 మంది అరెస్ట్‌

భారీగా గంజాయి, నగదు, సెల్‌ఫోన్లు స్వాధీనం

బుకీల్లో పిడుగురాళ్ల టీడీపీ మున్సిపల్‌ కౌన్సిలర్, నేతలు

సాక్షి, గుంటూరు: గుంటూరు జిల్లాలో క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్న బుకీలు, బెట్టింగ్‌ రాయుళ్లను గుంటూరు రూరల్‌ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. మాచవరం మండలం పిల్లుట్లకు చెందిన జిల్లా రాంబాబు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అరెస్టు చేసిన నిర్వాహకులు, బుకీలను విలేకరుల ముందు సోమవారం హాజరుపరిచారు. ఈ సందర్భంగా రూరల్‌ ఎస్పీ వెంకటప్పలనాయుడు వివరాలు వెల్లడించారు.

రాంబాబు ఇచ్చిన సమాచారం మేరకు సీసీఎస్, టాస్క్‌ఫోర్స్, సత్తెనపల్లి సబ్‌ డివిజనల్‌ పోలీసులతో కూడిన బృందాలను రంగంలోకి దించినట్టు తెలిపారు. పిడుగురాళ్లలో కొండమోడు ప్రాంతంలో అపూర్వ హోటల్‌లో ఈ నెల 22న క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న చల్లగుండ్ల బాబు, గుదె భీష్మలను బృందాలు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాయని చెప్పారు. వీరి నుంచి కమ్యూనికేటర్‌ బాక్స్, ల్యాప్‌ట్యాప్, రూ.20 వేలు నగదు, ఐదు సెల్‌ఫోన్లు, ఒక్కొక్కరి వద్ద పావు కిలో గంజాయి స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.

అదే హోటల్‌లో బెట్టింగ్‌లు కాస్తున్న పిడుగురాళ్ల మున్సిపల్‌ రెండో వార్డు కౌన్సిలర్‌ కోయ శ్యామలరావు, మరో 11 మందిని ఈ నెల 23న అరెస్టు చేసినట్టు తెలిపారు. వీరి వద్ద నుంచి ఒక సెల్‌ఫోన్, రూ.21 వేలు నగదు, ఒక టీవీనీ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠాను అరెస్టు చేసిన ఎస్‌ఐ రవీంద్రబాబు, ఏఎస్‌ఐ దరియాసాహెబ్, పీసీ గోపాల్, కరీముల్లా, గుర్నా«థ్‌రెడ్డి, పార్థసారథి, హోంగార్డు బాషాలను రూరల్‌ ఎస్పీ అభినందించారు. 

బుకీలు, నిర్వాహకులంతా టీడీపీ నేతలే..
బెట్టింగ్‌ ముఠాలో టీడీపీ కౌన్సిలర్‌తోపాటు, పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు ఉండడం గమనార్హం. పిడుగురాళ్ల మున్సిపాల్టీలోని రెండో వార్డు కౌన్సిలర్‌ కోయ శ్యామలరావు అలియాస్‌ శ్యామ్‌తోపాటు ఆ పార్టీ నేతలు చల్లగుండ్ల బాబూరావు, గుదె భీష్మ, వడ్లవల్లి సైదారావు, మద్దికుంట వెంకటేశ్వరరావు, భవిరిశెట్టి విష్ణుమూర్తి, షేక్‌ మస్తాన్‌వలి, ఆవుల పుల్లారావు, చల్లగుండ్ల అంజయ్య క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడుతూ పోలీసులకు దొరికిపోవడం చర్చనీయాంశంగా మారింది. వీరిని వదిలేయాలంటూ అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఒత్తిళ్లు తెచ్చినప్పటికీ వాటికి లొంగకుండా పోలీసులు అందరినీ అరెస్టు చేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top