ఇలా అయితే ఎలా?

Polavaram project works was going very slow - Sakshi

పోలవరం హెడ్‌ వర్క్స్‌ పనుల నత్తనడకపై తీవ్ర అసంతృప్తి

అధికారులు, కాంట్రాక్టర్లను నిలదీసిన మసూద్‌ హుస్సేన్‌ కమిటీ

2019 డిసెంబర్‌ నాటికి ఎలా పూర్తిచేస్తారు?

గిట్టుబాటు కావడంలేదన్న కాంట్రాక్టర్లకు చురకలు ... పనుల్లో నాణ్యతపై పెదవి విరుపు

సీఎస్‌ఎంఆర్‌ఎస్‌ ప్రమాణాల మేరకు పనులు చేయాలని ఆదేశం

నేడు విజయవాడలో ఉన్నతాధికారులతో సమీక్ష.. రేపు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీకి నివేదిక

సాక్షి, అమరావతి/పోలవరం: నత్తనడకగా సాగుతున్న పోలవరం ప్రాజెక్టు హెడ్‌ వర్క్స్‌ (జలాశయం) పనుల తీరుపై జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) డైరెక్టర్‌ జనరల్‌ మసూద్‌ హుస్సేన్‌ నేతృత్వంలోని నిపుణుల కమిటీ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. గత ఏప్రిల్‌ 21 నాటికి.. ఇప్పటికీ పనుల్లో ఏమాత్రం ప్రగతి కన్పించకపోవడాన్ని ఎత్తిచూపింది. ఇలాగైతే డిసెంబర్, 2019లోగా ప్రాజెక్టును ఎలా పూర్తిచేస్తారని నిలదీసింది. గిట్టుబాటు కాకపోవడంవల్లే పనులు చేయలేకపోతున్నామని చెప్పిన కాంట్రాక్టర్లపై.. ఆ విషయం టెండర్ల సమయంలో తెలియదా అంటూ చురకలు వేసింది.

అంతకుముందు.. కేంద్రం ఆదేశాల మేరకు ఆదివారం రాత్రి విజయవాడకు చేరుకున్న మసూద్‌ హుస్సేన్‌ కమిటీ.. సోమవారం ఉదయం 10.30 గంటలకు పోలవరం హెడ్‌వర్క్స్‌ వద్దకు చేరుకుంది. మధ్యాహ్నం రెండు గంటల వరకూ పనులను నిశితంగా పరిశీలించింది. స్పిల్‌ వే పనుల నాణ్యతపై పెదవి విరిచింది. సీఎస్‌ఎంఆర్‌ఎస్‌ సంస్థ సూచించిన నాణ్యత ప్రమాణాల మేరకే పనులు చేయాలని ఆదేశించింది. భోజన విరామానంతరం మూడు నుంచి రాత్రి ఏడు గంటల వరకూ అధికారులు, కాంట్రాక్టర్లతో సమావేశమైంది. తమ పరిశీలనలో వెల్లడైన అంశాలు.. అధికారులు ఇచ్చిన నివేదికను పోల్చిచూసిన కమిటీ.. పనుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తంచేసింది.

ఆరు నెలల్లో ఏం చేశారు?
కాగా, గత ఏప్రిల్‌ 21, 22 తేదీల్లో పోలవరం పనులను తాము పరిశీలించినప్పటికీ, ఇప్పటికీ ఏమాత్రం పురోగతి లేకపోవడాన్ని కమిటీ సభ్యులు ప్రశ్నించారు. ఈ ఆరు నెలల కాలంలో ఏం పనులు చేశారని నిలదీశారు. రోజుకు మూడు వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు చేస్తున్నామని, వర్షాకాలం పూర్తయితే మరింత పెంచుతామని కాంట్రాక్టర్లు చెప్పగా.. అప్పుడూ ఇలాగే చెప్పారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంక్రీట్‌ పనులకు క్యూబిక్‌ మీటర్‌కు ప్రస్తుతం రూ.3,600 చొప్పున ఇస్తున్నారని.. కనీసం రూ.ఆరు వేలు ఇస్తే గిట్టుబాటు అవుతుందని.. ఆ మేరకు ధరలు పెంచాలని కాంట్రాక్టర్లు కోరగా.. టెండర్లు దరఖాస్తు చేసేటపుడు ఆ విషయం తెలియదా అంటూ చురకలు అంటించారు.

అక్టోబరు నాటికే మట్టి పనులు పూర్తిచేస్తామని చెప్పారని.. ఇప్పటికి ఇంకా 2.96కోట్ల క్యూబిక్‌ మీటర్లు మిగిలిపోవడానికి కారణాలు ఏమిటిని ప్రశ్నించారు. తవ్విన మట్టిని ఏడు నుంచి ఎనిమిది కి.మీల మేర తరలించాల్సి వస్తోందని, ప్రభుత్వం రెండు కి.మీల దూరానికి మాత్రమే బిల్లులు ఇస్తోందని.. దీనివల్ల గిట్టుబాటు కావడంలేదంటూ కాంట్రాక్టర్లు వివరించారు. ఇంజనీరింగ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ విధానంలో పనులు దక్కించుకున్న మీకు నిబంధనలు తెలియవా.. ఇప్పుడు గిట్టుబాటు కావడంలేదని సాకులు చెబితే ఎలా అంటూ కమిటీ అసహనం వ్యక్తంచేసింది. 

నేడు కీలక సమావేశం
పోలవరం హెడ్‌ వర్క్స్‌ను పరిశీలించిన కమిటీ సభ్యులు సోమవారం రాత్రి విజయవాడకు చేరుకున్నారు. మంగళవారం ఉదయం జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు, అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్ష నిర్వహించనుంది. డిసెంబర్, 2019లోగా ప్రాజెక్టును పూర్తిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చిస్తారు. అనంతరం కమిటీ సభ్యులు ఢిల్లీకి వెళ్లి అక్కడ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీకి పోలవరంపై నివేదిక ఇవ్వనుంది. దీని ఆధారంగానే 25న ఢిల్లీలో రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు, కాంట్రాక్టర్లతో గడ్కరీ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top