ఎన్‌టీఆర్‌ వైద్యం మంజూరు కాలేదని.. | peoples don't know the about NTR health cards | Sakshi
Sakshi News home page

ఎన్‌టీఆర్‌ వైద్యం మంజూరు కాలేదని..

Mar 21 2017 11:44 AM | Updated on Oct 20 2018 6:19 PM

టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ స్థానంలో అమలు చేస్తున్న ఎన్‌టీఆర్‌ వైద్యసేవతో లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు.

► లోటస్‌ హాస్పిటల్‌లో ఆపరేషన్‌ థియేటర్‌  నుంచి పంపిన వైనం
►  హాస్పిటల్‌ ఎదుట బాధితుడి బంధువుల ఆందోళన
►  డీఎంహెచ్‌ఓ, పోలీసులకు ఫిర్యాదు
 
నెల్లూరు: టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ స్థానంలో అమలు చేస్తున్న ఎన్‌టీఆర్‌ వైద్యసేవతో లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు. ఏ జబ్బుకు ఎన్‌టీఆర్‌ వైద్యసేవ వర్తిస్తుందో తెలియని పరిస్థితి. నెల్లూరు నగరంలోని పొగతోటలో ఉన్న లోటస్‌ హాస్పిటల్‌లో సోమవారం రోగులకు ఇదే పరిస్థితి ఎదురైంది. సోమవారం సాయంత్రం ఆపరేషన్‌ థియేటర్‌ లోపలికి శస్త్రచికిత్సకు తీసుకెళ్లిన వ్యక్తిని ఎన్‌టీఆర్‌ వైద్యసేవ మంజూరు కాలేదంటూ నిర్ధాక్షిణ్యంగా బయటకు పంపేశారు. దీంతో బాధితుడు, అతని బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు.

చిల్లకూరుకు చెందిన చల్లా అంకయ్య అనే రైతు ఈ నెల 7న ప్రమాదానికి గురయ్యాడు. ప్రమాదంలో షోల్డర్‌ బోన్‌ దెబ్బతింది. 13వ తేదీ లోటస్‌ హాస్పిటల్‌లో ఆర్థోవైద్యుడు తులసీరామ్‌ను కలిశాడు. ప్లేట్‌లు అమర్చి శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని, ఎన్‌టీఆర్‌ వైద్యసేవ మంజూరవుతుందని తెలిపారు. ఈ నెల 19న మధ్యాహ్నం వైద్యుడు తులసీరామ్‌ అంకయ్యకు ఫోన్‌ చేసి ఎన్‌టీఆర్‌ వైద్యసేవ మంజూరైందని ఆస్పత్రిలో చేరితే 20వ తేదీ శస్త్రచికిత్స చేస్తామని చెప్పాడు. రూ.20 వేలు ప్రభుత్వం మంజూరు చేస్తుం దని, ప్లేట్‌ల కోసం రూ.4 వేలు సొంతంగా ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుందని తెలిపాడు. దీంతో ఆదివారం సాయంత్రం అంకయ్య ఆస్పత్రిలో చేరాడు.

వైద్య సేవ నమోదు అయినట్లు అంకయ్య సెల్‌కి రెండు మెసేజ్‌లు వచ్చాయి. సోమవారం ఉద యం నుంచి ఏమీ ఆహారం తీసుకోవద్దని యాంటీబయాటిక్‌ డోస్‌లు ఇచ్చారు. సాయంత్రం 7 గంటలకు ఆపరేషన్‌ చేసేందుకు అంకయ్యను సిద్ధం చేశారు. 6 గంటలకు ఆపరేషన్‌ థియేటర్‌లోకి తీసుకెళ్లారు. ఎన్‌టీఆర్‌ వైద్యసేవ మంజూరు కాలేదంటూ ఆర్థోసర్జన్‌ తులసీరామ్‌ శస్త్రచికిత్స చేసేందుకు నిరాకరించారు. నిస్సహాయ స్థితిలో అంకయ్య మిన్నకుండిపోయి ఆస్పత్రి ఆవరణలో తనకు జరిగిన తీరుపై నిరసన వ్యక్తం చేశా రు. ఎన్‌టీఆర్‌ వైద్యసేవ మంజూరు కానప్పుడు తనను ఎందుకు ఇబ్బంది పెట్టాలని ప్రశ్నించారు.

సాధారణ ఆపరేషన్‌ కాబట్టి సరిపోయింది కానీ గుండె ఆపరేషన్‌ లాంటివి అయి ఉంటే నా పరిస్థితి ఏమిటంటూ వాపోయారు. అనంతరం డీఎంహెచ్‌ఓ వరసుందరానికి ఫోన్లో ఫిర్యాదు చేశారు. అలాగే 4వ నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై డాక్టర్‌ తులసీరామ్‌ సాక్షితో మాట్లాడుతూ సాధారణంగా ఇలాంటి కేసులకు ఎన్‌టీఆర్‌ వైద్యసేవ మంజూరవుతుందని, కానీ ఎందువల్లనో మంజూరు కాలేదని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మేమేం చేయగలమని అన్నారు.  
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement