ఆరోగ్యశ్రీ పెండింగ్ బకాయిలు ఓటీఎస్ చేస్తామని అక్టోబర్‌లో ప్రకటన
ప్రభుత్వ ష్యూరిటీ లేకుండా నేరుగా ఆస్పత్రులకు రుణం ఇప్పించేలా ఎత్తుగడ
ఆస్పత్రులతో చర్చించిన వైద్యశాఖ ఉన్నతాధికారులు.. బకాయిలు చెల్లించకుండా రుణం ఇప్పిస్తామనడంపై తిరగబడ్డ ఆస్పత్రుల యాజమాన్యాలు
నమ్మించి నట్టేట ముంచిన సర్కారు తీరుపై ఆగ్రహావేశాలు
సాక్షి, అమరావతి: ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులను చంద్రబాబు సర్కారు మరోసారి మోసం చేసింది. ఆరోగ్యశ్రీ బకాయిలను వన్ టైమ్ సెటిల్‌మెంట్ (ఓటీఎస్) చేస్తామన్న ప్రభుత్వం నెట్‌వర్క్ ఆస్పత్రుల నెత్తిన భస్మాసుర హస్తం పెట్టేందుకు యత్నించి భంగపడింది. ప్రభుత్వం తమ బకాయిల మొత్తంలో కొంత తగ్గినా ఒప్పందం మేరకు ఒకేసారి అందుతుందని ఆస్ప్రత్రుల యాజమాన్యాలు ఒటీఎస్‌కు అంగీకరించగా.. బకాయిల మొత్తాన్ని బ్యాంకుల ద్వారా రుణాల రూపంలో ఇప్పిస్తామని తిరకాసు పెట్టడంతో యాజమాన్యాలు మండిపడుతున్నాయి.
ఏరు దాటాక తెప్పతగలేసినట్టుగా..
నెట్‌వర్క్ ఆస్పత్రులకు రూ.3 వేల కోట్లకుపైగా చంద్రబాబు సర్కారు బకాయి పడింది. బకాయిల వసూలు కోసం ఆస్పత్రుల యాజమాన్యాలు ఈ ఏడాది సెప్టెంబర్15 నుంచి అక్టోబర్ 31 వరకూ ఆరోగ్యశ్రీ సేవల్ని నిలిపివేసి సమ్మెలోకి వెళ్లాయి. బకాయిల కోసం ఆస్పత్రుల యాజమాన్యాలు రోడ్లెక్కి ర్యాలీలు, నిరసనలు కార్యక్రమాలు సైతం చేపట్టాయి. ఈ నేపథ్యంలో వైద్యశాఖ మంత్రి వై.సత్యకుమార్, ఉన్నతాధికారులు నెట్‌వర్క్ ఆస్పత్రుల ప్రతినిధులతో చర్చలు జరిపారు.
బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చి ఆస్పత్రులకు బకాయిలన్నీ ఓటీఎస్ చేస్తామని హామీ ఇచ్చారు. ఓటీఎస్ ప్రతిపాదనకు సీఎం చంద్రబాబు అంగీకరించినట్టు వెల్లడించారు. ప్రభుత్వమే ఓటీఎస్ ప్రతిపాదనను తెరపైకి తేవడంతో మొత్తం బకాయిలన్నీ రాబట్టుకుని ఆరోగ్యశ్రీ పథకంతో తెగదెంపులు చేసుకోవచ్చని ఆస్పత్రుల యజమానులు భావించారు. కానీ.. సమ్మె విరమించాక చంద్రబాబు సర్కార్ ధోకా ఇచ్చినట్టు తెలుస్తోంది.
సర్కారు ష్యూరిటీ ఉంటేనే రుణం
ఆరోగ్యశ్రీ బిల్లుల్ని వన్‌టైమ్ సెటిల్‌మెంట్ చేసేందుకు ప్రభుత్వం రూ.3 వేల కోట్ల రుణానికి వేట ప్రారంభించింది. అధికారులు ఇప్పటికే నాలుగుసార్లు బ్యాంకర్లతో సమావేశమయ్యారు. ప్రభుత్వం ష్యూరిటీ ఉంటుందనే ఉద్దేశంతో మొదటి భేటీలో బ్యాంకర్లు అధికారులు చెప్పిన ప్రతిపాదనకు ప్రాథమికంగా సానుకూలత తెలిపారు. రెండో భేటీలో ప్రభుత్వం ష్యూరిటీ ఉండబోదని.. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ మాత్రమే ష్యూరిటీ ఉంటుందనే విషయాన్ని అధికారులు వెల్లడించడంతో మెజారిటీ శాతం బ్యాంకర్లు రుణాలిచ్చేందుకు వెనక్కి తగ్గినట్టు సమాచారం.
రెండు బ్యాంకులు మాత్రం ప్రభుత్వం లెటర్ ఆఫ్ కన్సెంట్ ఇస్తే నేరుగా ఆస్పత్రులకు రుణాలిస్తామని చెప్పినట్టు తెలిసింది. ఇదే ప్రతిపాదనను అధికారులు ఆస్పత్రుల ముందు ఉంచగా.. ‘ప్రభుత్వం నుంచి మాకు రావాల్సిన డబ్బులకు మేం రుణాలు పొందడం ఏమిటి. బ్యాంకుల్లో మేం నేరుగా రుణాలు తెచ్చుకోగలం. మీరేమీ మాకు మధ్యవర్తిత్వం చేయనవసరం లేదు’ అని తెగేసి చెప్పినట్టు సమాచారం.
తామే ప్రైమరీ పార్టీగా ఉండి రుణాలు తీసుకుంటే భవిష్యత్‌లో బ్యాంక్‌లు రుణాలు తిరిగి చెల్లించమని తమ పీకమీద కత్తి పెడతాయని యాజమాన్యాలు తిరగబడటంతో ప్రభుత్వ ఎత్తుగడ బెడిసికొట్టింది. ఈ పరిణామాలతో ఆ రెండు బ్యాంక్‌లు ప్రభుత్వం ష్యూరిటీ ఉంటేనే రుణాల అంశాన్ని పరిశీలిస్తామని తెగేసి చెప్పినట్టు సమాచారం.
రుణం తెచ్చి బకాయి తీరుస్తామని చెప్పిన ప్రభుత్వం బ్యాంకులకు ష్యూరిటీ ఇవ్వకపోవడంపై నెట్‌వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. గతంలో బకాయిల కోసం సమ్మె చేసిన సమయంలో కల్ల»ొల్లి హామీలిచ్చి మోసం చేశారని, ఇప్పుడూ అదే జరిగిందని ఆస్పత్రుల యాజమాన్యాలు ప్రభుత్వంపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నాయి.
చేసిన అప్పులన్నీ ఏమైనట్టు
ఎఫ్‌ఆర్‌బీఎం, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలన్నింటినీ ఉల్లంఘిస్తూ ఇప్పటికే చంద్రబాబు సర్కార్ రూ.2.81 లక్షల కోట్లకుపైగా అప్పులు చేసింది. ఇంత పెద్దఎత్తున అప్పులు తెచ్చినా రాష్ట్ర ప్రజలకు సంజీవని అయిన ఆరోగ్యశ్రీ పథకం బిల్లులు చెల్లించకపోవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది. విద్య, వైద్య శాఖల్లో నాడు–నేడు పనులను ప్రభుత్వం నిలిపివేసింది.
ప్రభుత్వ వైద్య కళాశాలల్ని ప్రైవేట్‌కు కట్టబెట్టేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా చూసినా గుంతల రోడ్లే దర్శనం ఇస్తున్నాయి. ఇటు అభివృద్ధి, అటు సంక్షేమం అన్ని కార్యక్రమాలు ఆపేసి.. ప్రజల ప్రాణరక్షణలో కీలకమైన ఆరోగ్యశ్రీ బకాయిలు కూడా తీర్చని ప్రభుత్వం రూ.2.81 లక్షల కోట్లను ఏం చేసిందనే ప్రశ్నలు సామాన్యుల్లోనూ రేకెత్తుతున్నాయి.


