2న ఉదయం 7.10 ఓలా స్కూటీపై సింగిల్‌గా ఉన్న కొండారెడ్డిని పట్టుకున్న పోలీసులు
నిగ్గు తేల్చిన నిఘా నేత్రాలు
పోలీసుల మెడకే చుట్టుకోనున్న కేసు
కుట్రపూరితంగానే వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు కొండారెడ్డితోపాటు ఇద్దరిని అరెస్టు
బెంగళూరు నుంచి విశాఖకు డ్రగ్స్ రప్పించినట్లు పోలీసులు స్క్రీన్‌ప్లే
2వ తేదీ సాయంత్రం 5.45గంటలకు రైల్వేస్టేషన్ వద్ద వారిని పట్టుకున్నట్లు ఎఫ్‌ఐఆర్‌లో నమోదు
కానీ ఉదయం 7.10కి మద్దిలపాలెంలో అదుపులోకి తీసుకున్నట్లు సీసీ ఫుటేజీలు లభ్యం
సాయంత్రం అరెస్టు చేస్తే టీడీపీ హ్యాండిల్స్‌లో ఉదయం 11.45కే పోస్టులు ఎలా సాధ్యం?
ఎంవీపీ పోలీస్‌స్టేషన్ పరిధిలో పట్టుకుని ఫోర్త్ టౌన్‌లో కేసు ఎందుకు నమోదు చేశారు?
టీడీపీ ఆదేశాలతోనే పోలీసులు కుట్రపూరితంగా విద్యార్థులపై కేసు పెట్టారంటున్న తల్లిదండ్రులు
విశాఖ సిటీ: తెలుగుదేశం పార్టీ డైరెక్షన్‌లో విశాఖ ఖాకీలు చూపిన కక్షపూరిత డ్రగ్స్ కథా చిత్రంలో అసలు వ్యవహారం బయటపడింది. బెంగుళూరు నుంచి విశాఖకు డ్రగ్స్ తరలించారన్న నెపంతో ముగ్గురు విద్యార్థులను అరెస్టు చేసిన కేసు.. ఇప్పుడు పోలీసుల మెడకు చుట్టుకునేలా ఉంది. కేవలం రాజకీయ కుట్రలో భాగంగానే వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పులగం కొండారెడ్డి(23)ని డ్రగ్స్ కేసులో ఇరికించినట్లు అతడి తల్లిదండ్రులు సీసీ ఫుటేజ్ ఆధారాలను బయటపెట్టారు. పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేసిన వివరాలు.. సీసీ ఫుటేజీలు, ఇతర వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.
పక్కా స్కెచ్ ప్రకారమే..?
విశాఖలో డ్రగ్స్ కేసులో వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు కొండారెడ్డితోపాటు ఇంజినీరింగ్ ఆఖరి సంవత్సరం చదువుతున్న మురాడ గీత్ చరణ్, తంగి హర్షవర్ధన్ నాయుడులను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో పోలీసుల తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది. కొండారెడ్డి ఆదేశాల మేరకు గీత్ చరణ్ బెంగుళూరు నుంచి 48 ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్‌ను విశాఖకు తీసుకువచి్చనట్లు పోలీసులు చెప్పారు.
ఈ నెల 2వ తేదీ సాయంత్రం 5.45కు రైల్వే న్యూకాలనీ సాయిబాబా మందిరంలో వద్ద వీరిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. అక్కడ హర్షవర్ధన్‌నాయుడుతో కలిసి ఓలా స్కూటీపై వచ్చిన కొండారెడ్డికి గీత్ చరణ్ ఆ డ్రగ్స్ ఇస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా టాస్‌్కఫోర్స్ పోలీసులు పట్టుకున్నట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. అయితే కొండారెడ్డి తల్లిదండ్రులు రిలీజ్ చేసిన సీసీ ఫుటేజ్ వీడియోలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి.
ఒక్కడినే పట్టుకున్నారు
2వ తేదీ ఉదయం 7.10కి మద్దిలపాలెం ప్రాంతంలో ఉన్న జయభేరి కొండారెడ్డి ఓలా స్కూటీపై సింగిల్‌గా వెళుతున్నట్లు సీసీ ఫుటేజ్‌లో రికార్డ్ అయింది. ఆ వెనుకే ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి కొండారెడ్డిని ఆపారు. అందులో ఒక వ్యక్తి బైక్ దిగి కొండరెడ్డి చెంపపై కొట్టాడు. ఇంతలో మరో ఏడు బైక్‌లపై 14 మంది చేరుకున్నారు. కొండారెడ్డిని బైక్‌పై ఎక్కించుకుని తీసుకువెళుతున్న దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. వీరు పోలీసులేనని కొండారెడ్డి తల్లిదండ్రులు చెబుతున్నారు.
టీడీపీ మాధ్యమాల్లో ఉదయమే పోస్టులెలా సాధ్యం?
పోలీసులు మాత్రం 2వ తేదీ సాయంత్రం 5.45కు అరెస్టు చేసినట్లు మీడియాకు వెల్లడించడంతో పాటు ఎఫ్‌ఐఆర్‌లో కూడా అలాగే నమోదు చేశారు. అతడిని సాయంత్రం అరెస్టు చేస్తే.. టీడీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఆ రోజు ఉదయం 11.45 గంటలకే కొండారెడ్డిని అరెస్టు చేసినట్లు ఫొటోలు ప్రత్యక్షమవడం విశేషం. వైఎస్సార్ సీపీ నాయకులతో కొండారెడ్డి కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేయడం గమనార్హం.
మద్దిలపాలెం నుంచి తీసుకెళ్లి..!
ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్దిలపాలెంలో సింగిల్‌గా వెళుతున్న కొండారెడ్డిని కొట్టి తీసుకువెళ్లినట్లు కెమెరాలో స్పష్టంగా ఉంది. పోలీసులు మాత్రం ఆ రోజు సాయంత్రం 5.45కు ఫోర్త్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రైల్వే న్యూకాలనీ వద్ద స్నేహితులిద్దరితో కలిసి ఉండగా అదుపులోకి తీసుకున్నట్లు ఎఫ్‌ఐఆర్‌లో చూపించారు.
జీపీఎస్‌తో గుట్టు రట్టు..!
కొండారెడ్డి ఓలా స్కూటీకి జీపీఎస్ ఉంది. మద్దిలపాలెంలో అతడిని పట్టుకున్న తర్వాత స్కూటీని టాస్‌్కఫోర్స్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. అక్కడి నుంచి స్టేషన్‌కు 3.1 కిలోమీటర్లు ప్రయాణించినట్లు రికార్డు అయింది. కానీ సాయంత్రానికి 14.3 కిలోమీటర్లు ప్రయాణించినట్లు ఉంది. రైల్వే న్యూకాలనీలో అరెస్టు చేసినట్లు చూపించాలని ముందుగానే ప్లాన్ చేసుకుని ఆ స్కూటీని అక్కడికి తీసుకువెళ్లినట్లు అతడి తల్లిదండ్రులు చెబుతున్నారు.
విద్యార్థుల సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలకు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్న కారణంగానే రాజకీయ కుట్రలో భాగంగానే ప్రభుత్వం, పోలీసులు తన కుమారుడు కొండారెడ్డిపై డ్రగ్స్ కేసు నమోదు చేసినట్లు అతడి తండ్రి సూర్యనారాయణరెడ్డి ఆరోపిస్తున్నారు.


