ఉచిత షాక్ | no free electricity to farmers | Sakshi
Sakshi News home page

ఉచిత షాక్

Jan 10 2014 2:57 AM | Updated on Sep 5 2018 1:46 PM

2009కి ముందు సర్కారు భరించిన సర్వీస్ చార్జీలను రైతులపైనే వేయాలని కిరణ్ ప్రభుత్వం రెండేళ్ల కిందటే ఆదేశాలిచ్చింది.

వరంగల్, న్యూస్‌లైన్: రైతులపై రాష్ట్ర ప్రభుత్వం ‘భస్మాసుర హస్తాన్ని’ ప్రయోగిస్తోంది. వారి చేతులను వారి నెత్తిపైనే పెట్టుకునేలా చేసి.. ఉచిత విద్యుత్ భారాన్ని తగ్గించుకుంటోంది. 2009కి ముందు సర్కారు భరించిన సర్వీస్ చార్జీలను రైతులపైనే వేయాలని కిరణ్  ప్రభుత్వం రెండేళ్ల కిందటే ఆదేశాలిచ్చింది. రూ.20 ఉన్న సర్వీస్ చార్జీలను రూ.30కి పెంచడమే కాకుండా... చెల్లింపులపై దొంగాటకు తెరతీసింది. ముందుగా కోట్లాది రూపాయలు పెండింగ్‌లో పెట్టి వాటిని విడుదల చేయకుండా.... రైతుల నుంచి వసూలు చేసుకోకుండా ఫైల్‌ను తొక్కి పెట్టింది.

 ప్రభుత్వం చెల్లిస్తుందంటూ 2012 నవంబర్ వరకూ విద్యుత్ శాఖ అధికారులను మభ్యపెట్టింది. కానీ... అదే ఏడాది డిసెంబర్‌లో సర్వీస్ చార్జీలను రైతుల నుంచే వసూలు చేసుకోవాలని ఈఆర్‌సీ, డిస్కంలకు దొంగచాటున ఆదేశాలిచ్చింది. పాత పద్దులను కూడా వసూలు చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు.. రైతులకు అనుమానం రాకుండా సేవాపన్నును వడ్డీతో సహా రాబట్టుకునే పన్నాగాన్ని అమల్లోకి తెచ్చింది. ఫలితంగా ఉచిత విద్యుత్‌ను విని యోగించుకుంటున్న జిల్లా రైతులపై వడ్డీ భారం సుమారు రూ.4,68,06,600 పడుతోంది.

 పన్నాగం ఇదే...
 నెలల వారీగా సర్వీస్ చార్జీలు చెల్లించడం రైతులకు ఇబ్బందిగా ఉంటుందని... పంట దిగుబడులు, సీజన్లను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఆరునెలలకోసారి కట్టేలా ప్రభుత్వం అవకాశం కల్పించింది. రైతులకు వెసులుబాటు కల్పించినట్లు అనిపించినా... ఇక్కడే అసలు మతలబు దాగి ఉంది. సర్వీస్ చార్జీలకు వడ్డీ వేసి వారిని దొంగదెబ్బ తీసింది.

 భారం ఇలా...
 వ్యవసాయానికి ఉచిత విద్యుత్ వినియోగించే రైతులు జిల్లాలో 2,60,037 మంది ఉన్నారు. ఉచిత విద్యుత్‌ను వినియోగించుకునే ప్రతి రైతు నెలకు రూ. 30 చొప్పున సర్వీసు చార్జీ చెల్లించాలి. ప్రభుత్వం అవకాశం కల్పించిన మేరకు ఒక్కో రైతు ఆరు నెలలకు చెల్లించాల్సింది రూ.180. సర్వీస్ చార్జీలపై నెలకు 0.5 పైసల చొప్పున వసూలు చేస్తున్న వడ్డీ నెలకు రూ.15 చొప్పున ఆరు నెలలకు రూ.90. ఇలా ప్రతి రైతుపై ఆరు నెలలకు రూ.270 భారం పడుతోంది. అంటే ఆరు నెలలకు 2,60,037 మంది రైతులు సర్వీస్ చార్జీల కింద రూ.4,68, 06,660 కాగా... వడ్డీ కింద రూ.2,34,03,330 చెల్లించా ల్సి వస్తోంది. ఇలా ఏడాదికి సర్వీస్ చార్జీల పేరిట రూ.9,36, 13,320... వడ్డీ కింద రూ.4,68,06,660 భారం పడుతోంది.

 కరెంటోళ్ల స్పెషల్ డ్రైవ్
 రైతుల నుంచి సర్వీస్ చార్జీల వసూళ్లకు ఎన్పీడీసీఎల్ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. వ్యవసాయ బావుల వద్దకు వెళ్లి రైతులను బెదిరిస్తున్నారు. చెల్లించని పక్షంలో రబీలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని, మీటర్లు తీసుకెళతామని హెచ్చరిస్తుండడంతో రైతులు బెంబేలెత్తుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement