నీట్‌ రూల్స్‌ వెరీ టఫ్‌

NEET Exams Rules Tough in Guntur - Sakshi

5వ తేదీన జిల్లాలోని 11 కేంద్రాల్లో పరీక్ష

ముక్కు పుడక, గాజులు, చెవి దిద్దులపై అభ్యంతరాలు

వాటిని తొలగించిన తరువాత పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులకు అనుమతి

మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత నో ఎంట్రీ

వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల ఐదో తేదీన జాతీయస్థాయి అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్‌) జరగనుంది. ఈ పరీక్ష నిర్వహణలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ కఠిన నిబంధనలు అమలు
చేస్తోంది. పరీక్ష కేంద్రంలోకి అనుమతించే ముందు విద్యార్థులను మెటల్‌ డిటెక్టర్లతో తనిఖీ చేస్తారు. హ్యాండ్‌ బ్యాగులు, బెల్టులు, టోపీ, డెబిట్, క్రెడిట్‌ కార్డులు సహా చేతికి వాచీ ఉన్నా పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.

గుంటూరు ఎడ్యుకేషన్‌: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 5న జరగనున్న జాతీయ స్థాయి అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్‌) నిర్వహణలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ కఠిన నిబంధనలు అమలు పరుస్తోంది. నీట్‌ నిర్వహణ బాధ్యతలను నిర్వర్తిస్తున్న నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) గుంటూరు నగర, శివార్లలో పరిధిలోని విద్యాసంస్థల్లో 11 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశానికి జిల్లా వ్యాప్తంగా 8,460 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. పరీక్ష కేంద్రాల్లో కాపీయింగ్, పేపర్‌ లీకేజీ వంటి సంఘటనలకు ఆస్కారం లేకుండా చూసే పేరుతో కఠిన నిబంధనలు అమలు పరుస్తున్నారు. జాతీయ స్థాయిలో ఎయిమ్స్‌ వంటి ఉన్నతస్థాయి వైద్య విద్యాసంస్థలు, రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో సీటు సాధించాలనే లక్ష్యంతో నీట్‌కు హాజరవుతున్న విద్యార్థులు ఎన్‌టీఏ విధించిన నిబంధనలను దృష్టిలో ఉంచుకోవాలి.

పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి ఇలా..
ఆదివారం మధ్యాహ్నం 2.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకూ నీట్‌ జరగనుంది. విద్యార్థులను మధ్యాహ్నం 12.30 నుంచి పరీక్ష కేంద్రాల ప్రాంగణంలోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం 1.30 వరకూ పరీక్ష హాల్లోకి పంపిన తర్వాత పరీక్ష కేంద్రాల ప్రధాన గేట్లను మూసివేయాలని ఎన్‌టీఏ విడుదల చేసిన నీట్‌ మార్గదర్శకాల్లో పొందుపర్చింది. 1.30 తర్వాత వచ్చే విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు. పరీక్ష కేంద్రంలోకి వచ్చిన విద్యార్థులకు ఎన్‌టీఏ నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం నీట్‌ రాసేందుకు సూచనలు చెప్పడం, ఓఎంఆర్‌ షీట్‌ పూర్తి చేయించేందుకు అరగంట సమయాన్ని కేటాయించారు.

క్షుణ్ణంగా తనిఖీలు
మధ్యాహ్నం 1.30 గంటలకు పరీక్ష హాల్లోకి వచ్చిన విద్యార్థులు వారికి కేటాయించిన సీటులో కూర్చున్న తర్వాత ఇన్విజిలేటర్‌ వచ్చి అడ్మిట్‌ కార్డులో వివరాలను పరిశీలించిన తర్వాత క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. విద్యార్థుల వద్ద ఎటువంటి స్లిప్పులు, నిషేధిత సామగ్రి లేవని నిర్ధారించుకున్న తర్వాత 1.45 గంటలకు ఓఎంఆర్‌ బుక్‌లెట్లు పంపిణీ చేసి పరీక్ష రాయడంలో సూచనలు ఇస్తారు. తదుపరి 1.50 గంటలకు గైర్హాజరైన విద్యార్థుల ఓఎంఆర్‌ షీట్లను స్వాధీనం చేసుకుని, 1.55 గంటలకు ఓఎంఆర్‌ షీట్లపై వివరాలను నమోదు చేయిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2.00 గంటలకు ఖచ్చితంగా పరీక్ష ప్రారంభమవుతుంది. తదుపరి సాయంత్రం 5.00 గంటల వరకూ విద్యార్థులు పరీక్ష కేంద్రాల్లో నుంచి బయటకు వెళ్లేందుకు అవకాశం లేదు.

కఠినమైన ఆంక్షలు
నీట్‌కు హాజరయ్యే విద్యార్థినీ విద్యార్థుల వస్త్రధారణ, ఆభరణాలపై ఆంక్షలు విధించారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు యంత్రాంగం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. పరీక్ష కేంద్రంలోకి అనుమతించే ముందు విద్యార్థులను మెటల్‌ డిటెక్టర్లతో తనిఖీలు చేయనున్నారు. హ్యాండ్‌ బ్యాగులు, బెల్టులు, టోపీ, డెబిట్, క్రెడిట్‌ కార్డులు సహా చేతికి వాచీ సైతం ధరించి వచ్చినా అనుమతించరు. ఆఖరుకు వాటర్‌ బాటిల్స్‌ సైతం తీసుకురాకూడదు. విద్యార్థినులు చెవులకు రింగులు, చెవి దిద్దులు, ముక్కు పుడక, మెడలో గొలుసులు, నెక్లెస్‌ వంటి ఆభరణాలతో పాటు జడకు పిన్నులు, క్లిప్స్‌తో రాకూడదు. లేత రంగు వస్త్రాలనే ధరించి రావాలి. పంజాబీ డ్రెస్‌లు లేత రంగులోనే ఉండాలి. హాఫ్‌ హ్యాండ్స్‌ కలిగి ఉన్న షర్ట్‌లు, టాప్‌లే ధరించాలి. షర్ట్‌లకు పెద్ద, పెద్ద బటన్లతో పాటు స్టిక్కర్లు అతికించి ఉండరాదు. హై హీల్స్‌ చెప్పులు, బెల్టులు, బూట్లతో వస్తే అనుమతించరు. సాధారణ పాదరక్షలే ధరించాలి.

వెబ్‌సైట్‌లో మార్గదర్శకాలు
నీట్‌–2019 మార్గదర్శకాల పేరుతో పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తమ వెంట ఏం తెచ్చుకోవాలో, వేటిని తీసుకురాకూడదో వివరిస్తూ ఎన్‌టీఏ తన అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపర్చిన 101 పేజీల ఇన్ఫర్మేషన్‌ బులిటెన్‌లో ప్రత్యేకంగా నాలుగు పేజీల జాబితాలో పేర్కొంది. నీట్‌–2019 నగర సమన్వయకర్తగా గుంటూరులోని డాక్టర్‌ కేఎల్‌పీ పబ్లిక్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ వై.రధినీ చౌదరి వ్యవహరిస్తున్నారు.

వీటిని వెంట తెచ్చుకోవాలి
నీట్‌కు హాజరయ్యే విద్యార్థులు అడ్మిట్‌ కార్డుపై పాస్‌పోర్టు సైజు ఫొటో అతికించి, మరొక పాస్‌పోర్ట్‌ సైజు ఫొటో వెంట తీసుకురావాలి. పరీక్ష రాసేందుకు పెన్నులను పరీక్ష కేంద్రాల్లోనే అందజేస్తారు. సమయం తెలిసేలా పరీక్ష హాల్లో గడియారాలను ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థులను సకాలంలో పరీక్ష కేంద్రాలకు తీసుకువచ్చేందుకు తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు పాటించాల్సి ఉంది.

నీట్‌ పరీక్ష కేంద్రాలు ఇవే
ఆర్వీఆర్‌ అండ్‌ జేసీ ఇంజినీరింగ్‌ కళాశాల, చౌడవరం, గుంటూరు శివారు
మలినేని పెరుమాళ్లు విద్యాసంస్థలు, పుల్లడిగుంట, వట్టిచెరుకూరు మండలం
కళ్లం హరనాథ్‌రెడ్డి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, చౌడవరం, గుంటూరు శివారు
కేకేఆర్‌ అండ్‌ కేఎస్సార్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ (కిట్స్‌), వింజనంపాడు, వట్టిచెరుకూరు మండలం
చలపతి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, లాం, గుంటూరు శివారు
హిందూ ఫార్మసీ కళాశాల,     అమరావతి రోడ్డు, గుంటూరు
వాసిరెడ్డి వెంకటాద్రి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్, నంబూరు, పెదకాకాని మండలం
ప్రియదర్శిని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్, 5వ మైలు, పుల్లడిగుంట, వట్టిచెరుకూరు మండలం
డాక్టర్‌ కేఎల్‌పీ పబ్లిక్‌ స్కూల్, జేకేసీ కళాశాల రోడ్డు, గుంటూరు
జేకేసీ కళాశాల, గుంటూరు
చేబ్రోలు హనుమయ్య ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ సైన్సెస్, చౌడవరం, గుంటూరు శివారు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top