వైఎస్ హయాంలో ప్రతి మహిళా లక్షాధికారే | millionaires every woman in ys Reign | Sakshi
Sakshi News home page

వైఎస్ హయాంలో ప్రతి మహిళా లక్షాధికారే

Mar 22 2014 12:41 AM | Updated on Aug 14 2018 3:48 PM

వైఎస్ హయాంలో  ప్రతి మహిళా లక్షాధికారే - Sakshi

వైఎస్ హయాంలో ప్రతి మహిళా లక్షాధికారే

స్వయం సహాయక సంఘాలకు (డ్వాక్రా) 2004-09 మధ్య కాలం ఒక స్వర్ణయుగం. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు...

  • డ్వాక్రా గ్రూపులకు  వరదలా రుణాల పంపిణీ
  •  పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్ల అందజేత
  •  కార్పొరేషన్, న్యూస్‌లైన్ : స్వయం సహాయక సంఘాలకు (డ్వాక్రా) 2004-09 మధ్య కాలం ఒక స్వర్ణయుగం.  ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైఎస్ రాజశేఖరరెడ్డి స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక ఆసరా కల్పించారు. క్షేత్రస్థాయి నుంచి గ్రూపులను బలోపేతం చేయడంపై దృష్టిపెట్టారు. నిర్లిప్తంగా ఉన్న ఇందిర క్రాంతిపథం విభాగాన్ని పటిష్టం చేశారు. బ్యాంకర్లతో మాట్లాడి స్వయంసహాయక సంఘాలకు ఇబ్బడిముబ్బడిగా రుణాలు మంజూరుచేయిం చారు.

    ప్రతి మహిళను లక్షాధికారిని చేస్తానన్న మాటకు కట్టుబడ్డారు. పావలా వడ్డీ రుణాలు, పిల్లలకు స్కాలర్‌షిప్పులు, ఇందిరమ్మ ఇళ్లు, వృద్ధాప్య, వితంతు పింఛన్లు, అభయహస్తం, ఆమ్‌ఆద్మీ, జనశ్రీ బీమాయోజన, దీపం వంటి పథకాలతో మహిళల జీవితాల్లో వెలుగులు నింపారు. ఉపాధి హామీ, పనికి ఆహారం వంటి పథకాల్లోనూ స్వయం సహాయక సంఘ సభ్యులకు భాగస్వామ్యం కల్పించారు.  గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న రైతాంగాన్ని ఆదుకునేందుకు ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల బాధ్యతను స్వయం సహాయక సంఘాల మహిళలకు అప్పగించారు.
     
    నెరవేరిన సొంతింటి కల
     
    బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను డ్వాక్రా మహిళలు సద్వినియోగం చేసుకున్నారు. అనేక వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి లాభాలను ఆర్జించారు. చేతి వృత్తుల్లో రాణించారు.   అప్పులు సకాలంలో చెల్లించడంతో కొత్త రుణాలిచ్చేందుకు బ్యాంకర్లు ముందుకొచ్చారు. ఒక్కో గ్రూపు (పదిమంది సభ్యులు)కు 2004కు ముందు లక్ష రూపాయల రుణం ఇచ్చేందుకు బ్యాంకర్లు ముప్పుతిప్పలు పెట్టేవారు.  వైఎస్ హయాంలో  ఒక్కో గ్రూపునకు రూ.5-10 లక్షల వరకు గ్రూపు రుణాలు అందాయంటే  మార్పును అర్థం చేసుకోవచ్చు. ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం ద్వారా గ్రూపుల్లోని అర్హులైన మహిళలకు ఇళ్లు కేటాయించారు.  మహిళ సొంతింటి కల నెరవేరినట్లయింది.
     
    సంక్షేమ సంతకం.. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో 12 వేల స్వయం సహాయక సంఘాలుండగా.. గుడివాడలో 1,689, జగ్గయ్యపేటలో 935, మచిలీపట్నంలో 3,369, నందిగామలో 640, నూజి వీడులో 709, పెడన లో 631, తిరువూరులో 602, ఉయ్యూరులో 625 డ్వాక్రా గ్రూపులు పనిచేస్తున్నాయి. ఎనిమిది మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థ పరిధిలో 2,67,465 మంది మహిళలు వైఎస్ వల్ల లబ్ధిపొందారు.

    2009లో రెండోసారి అధికారంలోకి వచ్చాక  డ్వాక్రా సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో నెలవారీ పింఛన్ ఇచ్చేందుకు అభయహస్తం పథకాన్ని ప్రవేశపెట్టారు.  నగరంసహా జిల్లాలో 44,378 మంది ఈ పథకంలో చేరారు. జనశ్రీ బీమాయోజన ద్వారా స్వయం సహాయక సంఘ సభ్యురాలితో పాటు కుటుంబం మొత్తానికి బీమా కల్పించారు. పథకంలోని సభ్యుల పిల్లలకు  ఎనిమిదో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు  స్కాలర్‌షిప్పులు అందించారు. సంక్షేమ సంతకంతో వైఎస్ స్వయం సహాయక సంఘ మహిళల జీవితాల్లో  కొత్త వెలుగులు నింపారు.
     
     నిజంగా స్వర్ణయుగమే..
     వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం నిజంగా స్వర్ణయుగమే. ఆ రోజుల్లో పావలా వడ్డీ రుణాలు సక్రమంగా ఇచ్చేవారు. గత ప్రభుత్వ పాలనలో రుణాలందక నానా బాధలు అనుభవించాం.. మళ్లీ డ్వాక్రా సంఘాలకు నూతన తేజం రావాలంటే వైఎస్‌లాంటి మనిషి అధికారంలోకి రావాలి.
     - గంగునేని ప్రభావతి, శ్రీలక్ష్మీ డ్వాక్రా సంఘం అధ్యక్షురాలు, మండవల్లి
     
     ఎందరికో లాభదాయకం..
     డ్వాక్రా మహిళలకు రుణాలు పెంచడంతోపాటు అభయహస్తం, పావలా వడ్డీరుణాలు అందించడమే కాకుండా పక్కా ఇళ్ల నిర్మాణం మహిళల పేరుతో జరిపించిన మహానేత వైఎస్ చరిత్రలో నిలిచిపోతారు. ఆయన మహిళలకు చేసిన సేవలను మేం ఎన్నటికీ మరువలేం. ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం వంటి పథకాలతో పరోక్షంగా ఎన్నో కుటుంబాలకు మేలు చేశారు.     
     -వేల్పుల పద్మకుమారి, జిల్లా సమాఖ్య మాజీ అధ్యక్షురాలు, పెనుగంచిప్రోలు
     
     మహిళలకు రాజన్న పెద్దపీట
     ప్రతి మహిళను లక్షాధికారిని చేస్తానని భరోసా ఇచ్చి.. ఆచరించి చూపి.. మహిళలకు పెద్దపీట వేసిన ముఖ్యమంత్రిగా రాజన్న చరిత్రలో మిగిలిపోతారు. ఆయన ఉన్నప్పుడు డ్వాక్రా సంఘాలకు రుణాలు సక్రమంగా అందేవి. ఆయన హఠాన్మరణం చెందాక మమ్మల్ని పట్టించుకున్న వారే లేరు. ఇది నిజంగా మా దురదృష్టం.      
     - వరిగంజి చాందినీకళ, ఎంపీటీసీ మాజీ సభ్యురాలు, హనుమాన్‌జంక్షన్
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement