యానాం నియోజకవర్గానికి వైఎస్సార్ చేసిన మేలుకు కృతజ్ఞతగా నిర్మాణం
పుదుచ్చేరి ప్రభుత్వ ప్రతినిధి మల్లాడి కృష్ణారావు వెల్లడి
యానాం: కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి పరిధిలోని యానాం నియోజకవర్గానికి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన మేలుకు కృతజ్ఞతగా ఆయన పేరిట మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు డాక్టర్ వైఎస్సార్ స్మృతి మందిరాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఢిల్లీలో పుదుచ్చేరి ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న ఆయన యానాం యర్రా గార్డెన్స్‌లోని తన నివాసం ఎదురుగా సొంత నిధులతో దీన్ని నిర్మించారు. ఇందుకోసం రూ.లక్షలు వెచ్చించి స్థలం కొనుగోలు చేశారు.
రూ.కోటి పైగా ఖర్చుతో రెండంతస్తుల్లో నిర్మించిన వైఎస్సార్ స్మృతి మందిరాన్ని ఆదివారం ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా మల్లాడి కృష్ణారావు మాట్లాడుతూ తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఆదివారం నాటికి 36 ఏళ్లవుతోందన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని.. వైఎస్సార్ స్మృతి మందిరం, గోవుల నిలయాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. యానాం నియోజకవర్గానికి వైఎస్సార్ చేసిన మేలును వివరించారు.


