ఐదుగురిని ప్రధానులను చేసింది చంద్రబాబే!

Lokesh Says That We Will Decide Pm In 2019 - Sakshi

2019లో ప్రధానిని డిసైడ్‌ చేసేది టీడీపీనే

కాంగ్రెస్‌కు పట్టిన గతే మోడీకి పడుతుంది   

చీరాల పర్యటనలో మంత్రి నారా లోకేష్‌

చీరాల: వాజ్‌పేయి, దేవెగౌడ, ఐకే గుజ్రాల్‌ వంటి ఐదుగురిని దేశానికి ప్రధానులను చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కిందని, 2019లో ప్రధాని పీఠం ఎవరు ఎక్కాలో ఆయనే నిర్ణయిస్తాడని రాష్ట్ర పంచాయతీ రాజ్, ఐటీశాఖ మంత్రి నారా లోకేష్‌ జోస్యం చెప్పారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మంగళవారం ప్రకాశం జిల్లా చీరాల వచ్చిన లోకేష్‌ ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. తెలుగుజాతితో బీజేపీ వైరం పెట్టుకుందని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రావన్నారు. అందుకు కర్ణాటక ఎన్నికలే ట్రైలర్‌ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి పట్టిన గతే  2019 ఎన్నికల్లో బీజేపీకి పడుతుందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం 29 సార్లు సీఎం చంద్రబాబు ఢిల్లీ చుట్టూ తిరిగినా నాలుగేళ్లుగా విభజన హామీలు కానీ, ప్యాకేజీకి నిధులు పైసా కూడా విడుదల చేయకుండా కేంద్రం మోసం చేసిందన్నారు.

కేంద్రం అన్ని విషయాల్లో మోసం చేసినా బీజేపీ పాలిత రాష్ట్రం గుజరాత్‌ కంటే అభివృద్ధిలో ఏపీ ముందంజలో ఉందన్నారు. రాష్ట్రంలో ఎన్నికల హామీ ప్రకారం రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేశామన్నారు. క్యాబినేట్‌ సమావేశాల్లో నిరుద్యోగ భృతిపై చర్చించామని మరి కొద్ది నెలల్లో రాష్ట్రంలోని నిరుద్యోగులకు నెలకు రూ.1000 చెల్లిస్తామని తెలిపారు. కొద్దినెలల్లో జిల్లాలో వాటర్‌ గ్రిడ్‌ నెలకొల్పేందుకు రూ.2900 కోట్లు కేటాయిస్తున్నామని, దీని ద్వారా ప్రతి ఇంటికి కుళాయి వస్తుందన్నారు. రాష్ట్రంలో రూ.4.500 కోట్లుతో వ్యక్తిగ మరుగుదొడ్లు నిర్మించామని చెప్పారు.  2019 ఎన్నికల్లో 25 సీట్లు ఎంపీ స్థానాలను గెలిపిస్తే ప్రధానమంత్రిని నిర్ణయించే అవకాశం టీడీపీకి దక్కుతుందన్నారు. మంత్రి ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్‌ కమిటీలకు రూ.500 కోట్లు కేటాయించి కందులు, శనగలకు, రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. చీరాల ప్రాంతంలో స్థలం కల్పిస్తే రైతు బజార్, కోల్డ్‌ స్టోరేజ్‌ నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారు. 

స్థానిక ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ అధ్యక్షతన జరిగిన ఈ సభలో మంత్రి శిద్దా రాఘవరావు, కలెక్టర్‌ వి.వినయ్‌చంద్, ఎంపీ శ్రీరాం మాల్యాద్రీ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్, కదిరి బాబూరావు, డోలా బాలవీరాంజనేయస్వామి, ముత్తముల అశోక్‌రెడ్డి, పాలపర్తి డేవిడ్‌రాజ్, ఎమ్మెల్సీ పోతుల సునీత, జడ్పీ వైస్‌ ఛైర్మన్‌ నూకసాని బాలాజీ, బీఎన్‌ విజయ్‌కుమార్, జేసీ నాగలక్ష్మీ, ఆర్డీవో కె.శ్రీనివాసరావు, ఏఎంసీ ఛైర్మన్‌ జంజనం శ్రీనివాసరావు, మున్సిపల్‌ ఛైర్మన్‌ రమేష్‌బాబు, డీఈవో సుబ్బారావు, నియోజకవర్గ ప్రత్యేకాధికారి మురళీ, పలు విభాగాల అధికారులు, మున్సిపల్‌ కౌన్సిలర్లు, పంచాయితీ సర్పంచ్‌లు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ప్రమాణ స్వీకారం... 

చీరాల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ నూతన పాలకవర్గం చైర్మన్‌ జంజనం శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు శ్యామ్, డైరెక్టర్లు, మెంబర్లుతో ఎమ్మెల్యే ఆమంచి, మంత్రి ఆదినారాయణ రెడ్డిలు ప్రమాణ స్వీకారం చేయించారు. 

 మంత్రి లోకేష్‌కు స్కాచ్‌ అవార్డు
రాష్ట్ర పంచాయితీరాజ్, ఐటీ శాఖమంత్రి నారా లోకేష్‌కు 2018 స్కాచ్‌ అవార్డుకు ఎంపికయ్యారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా అందించే అవార్డుకు ఈ ఏడాది పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు లోకేష్‌ సొంతం చేసుకున్నారు. గుడ్‌ గవర్నెన్స్, నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తిగా కేంద్రం గుర్తించి మంగళవారం అవార్డు ప్రకటించగా చీరాల పర్యటనలో ఉన్న లోకేష్‌ను ప్రకాశం జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్, జేసీ నాగలక్ష్మీ, ఆర్డీవో శ్రీనివాసరావు, నియోజకవర్గ ప్రత్యేకాధికారి మురళీ, ఇతర ఉద్యోగులు సన్మానంచి అభినందనలు తెలిపారు. డీఈవో సుబ్బారావు, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ మర్దన్‌ అలీ, డీఈ బాలకృష్ణ, ఎమ్మెల్యేలు ఆమంచి కృష్ణమోహన్, దామచర్ల జనార్దన్, బీవీఎన్‌ స్వామి, గొట్టిపాటి రవికుమార్, ఎం.అశోక్‌రెడ్డి, పి.డేవిడ్‌రాజ్, కె.బాబూరావు అభినందించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top