భూంఫట్ | Land grabbing | Sakshi
Sakshi News home page

భూంఫట్

Aug 27 2015 4:40 AM | Updated on Sep 3 2017 8:10 AM

ఆక్రమణదారులు దేవుడి భూములనూ వదలట్లేదు. రూ.15కోట్ల విలువ చేసే చెన్నకేశవస్వామి భూమి కబ్జా కోరల్లో చిక్కుకుంది

 కర్నూలు(న్యూసిటీ)/కల్లూరు రూరల్ : ఆక్రమణదారులు దేవుడి భూములనూ వదలట్లేదు. రూ.15కోట్ల విలువ చేసే చెన్నకేశవస్వామి భూమి కబ్జా కోరల్లో చిక్కుకుంది. కల్లూరు మండలం సల్కాపురం గ్రామంలో వెలసిన శ్రీ చెన్నకేశవ ఆంజనేయస్వామికి నిత్య ధూప దీప నైవేద్యాలకు 17.95 ఎకరాల భూము ఉంది. 94 సర్వే నెంబర్‌లో 3.75 ఎకరాలు, సర్వే నెంబర్ 72లో 4.53 ఎకరాలు, 71 సర్వే నెంబర్‌లో 7.51 ఎకరాలు, 44 సర్వే నెంబర్‌లో 2.16 ఎకరాల భూమిని అర్చకులు పి.సంజీవయ్య తండ్రి కేశవయ్య, పి.భీమయ్య తండ్రి అనంతయ్యకు ప్రభుత్వం కేటాయించింది.

ఈ సర్వే నెంబర్లలోని భూములు ఆర్‌ఓఆర్ 1-బీలో దేవాదాయ ధర్మాదాయశాఖ పేరు మీద ఉన్నా.. రెవెన్యూ అధికారుల లీలలతో దేవుని భూములకు రెక్కలొచ్చాయి. భూములన్నీ శివకేశవయ్యరెడ్డి తండ్రి వెంకటరామిరెడ్డి పేరు మీదకు మారిపోయాయి. ప్రస్తుత వీఆర్‌ఓ పుల్లారెడ్డి, గతంలో కల్లూరు తహశీల్దార్‌గా పని చేసిన టి.అంజనాదేవి సమయంలో భూములు విక్రయిం చినట్లు రికార్డులను బట్టి తెలుస్తోంది. ఈ భూములను తనఖా పెట్టి ఏకంగా లక్షల రూపాయలు బ్యాంకుల్లో అప్పుగా తీసుకోవడం గమనార్హం.

2007 సంవత్సరంలో సర్వే నెంబర్ 72లోని 4.53 ఎకరాల భూమిని కల్లూరు సహకార సంఘంలో తనఖా పెట్టి రూ.3 లక్షలు, 2010 సంవత్సరంలో సర్వే నెంబర్ 71లోని 7.5 ఎకరాలు భూమిని తా కట్టు రూ.50 వేలు, 2010 సంవత్సరంలో సర్వే నెం బర్ 72లోని 7.51 ఎకరాల భూమి తాకట్టు పెట్టి రూ.3 లక్షలు పంట రుణంగా తీసుకున్నట్టు రికార్డుల్లో తేలింది. అయితే, ఇంత జరుగుతున్నా దేవాదాయ ధర్మాదాయ భూములను కాపాడటంలో అధికారులు మాత్రం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 3,086 దేవాలయాలకు సంబంధించి 66,472 ఎకరాల ఆలయ భూములు ఉన్నాయి. ఇందులో వందలాది ఎకరాల భూములు ఇప్పటికే ఆక్రమణదారుల చెరలో ఉన్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.
 
 భూములు అమ్మినట్లు రుజువైతే క్రిమినల్ కేసులు
 సల్కాపురంలోని శ్రీ చెన్నకేశవ ఆంజనేయస్వా మి దేవాలయ భూములు అమ్మినట్లు రుజువైతే క్రిమినల్ కేసులు బనాయిస్తాం. అమ్మిన వారినీ, కొన్న వారినీ జైలుకు పంపుతాం.
 - వెంకటేశ్వర్లు, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్
 
 కంప్యూటర్ అడంగల్‌లో పొరపాటు
 కంప్యూటర్ ఆన్‌లైన్ అడంగల్, ఆర్‌ఓఆర్‌లో పొరపాటుగా వేరేవాళ్ల పేర్లు నమోదయ్యాయి. రెవెన్యూ రికార్డుల్లో ఎక్కడా శివకేశవయ్యరెడ్డి తండ్రి వెంకటరామిరెడ్డి పేర్లు లేవు. ‘మీ ఇంటికి-మీభూమి’లో ఫిర్యాదు వచ్చింది. అడంగల్, ఆర్‌ఓఆర్‌లో పేరు సవరిస్తాం.
 - శివరాముడు, కల్లూరు తహశీల్దార్

Advertisement
 
Advertisement
Advertisement