పోటెత్తిన వరద.. ప్రకాశం గేట్లు ఎత్తివేత

Krishna Water Release From Prakasam Barrage To Down - Sakshi

72 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్న అధికారులు

ప్రాజెక్టును పరిశీలించిన కలెక్టర్‌ ఇంతియాజ్‌

సాక్షి, విజయవాడ: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానది ఉగ్రరూపం దాల్చింది. కర్ణాటకతో సహా తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల్లో జలకళ సంతరించుకుంది. మంగళవారం ఉదయం నుంచి పులిచింతల ప్రాజెక్టులోని 17 గేట్లను ఎత్తి దిగువన గల ప్రకాశం బ్యారేజికి నీటిని వదులుతున్నారు. దీంతో ప్రకాశంకు భారీ ఎత్తున వరద రావడంతో ప్రాజెక్టులో నీటినిల్వ 12 అడుగులకు చేరింది. దీంతో 72 గేట్లను ఎత్తిన అధికారులు వరదను దిగువకు వదులుతున్నారు. కృష్ణానది ఉదృతంగా ప్రవహిస్తుడడంతో జగ్గయ్యపేటలోని ముత్యాల, వేదాద్రి, రావిరాల గ్రామల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

మరోవైపు నాగార్జున సాగర్‌ నుంచి పులిచింతల ప్రాజెక్టుకు భారీ వరద చేరుతోంది. దీంతో నదీ పరివాహక ప్రాంతంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మంగళవారం ఉదయం ప్రాజెక్టులోని 17 గేట్లను ఎత్తివేశారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 175 అడుగులు కాగా, సాగర్‌ గేట్లను పూర్తిగా ఎత్తడంతో ప్రస్తుతం 152 అడుగులకు చేరింది. సాగర్‌, శ్రీశైలం నుంచి వరద ఉదృతంగా ఉండడంతో పులిచింతల, ప్రకాశం బ్యారేజ్‌ల్లో నీటి నిలువ గంటగంటకు పెరుగుతోంది. దీంతో ప్రాజెక్టు పరిధిలోని ముంపు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. మరోవైపు ఎగువ నుంచి వస్తున్న వరదతో శ్రీశైలం, సాగర్‌లో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. దీంతో వచ్చిన నీటిని వచ్చినట్టే దిగువకు వదులుతున్నారు.

వరదను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం..
ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి విడుదలను కలెక్టర్ ఇంతియాజ్ అహ్మాద్ పరిశీలించారు.  ప్రకాశం బ్యారేజీ  నుంచి 72 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసిన అధికారులు గేట్లు ఎత్తే ముందు సైరన్ మోగించి అప్రమత్తం చేశారు. మధ్యాహ్నం మూడు గంటలకి వరద పెరిగే అవకాశం ఉన్నట్లు కలెక్టర్ ఇంతియాజ్ అహమ్మద్  తెలిపారు. ముందు జాగ్రత్తగా గేట్ల ఎత్తి నీటిని విడుదల చేశామాన్నారు. పరీవాహక ప్రాంతాలను అప్రమత్తం చేశామని, మత్యకారులు వేటకు వెళ్లొద్దని ఆయన సూచించారు. వరద మరింత పెరిగినా.. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, రెస్క్యూ టీంలు కూడా సిద్ధంగా ఉన్నాయని కలెక్టర్‌ తెలిపారు. ఎక్కడ ఎవరికీ ఏ ఇబ్బంది తలెత్తినా టోల్ ఫ్రీ నంబర్ కు సమాచారం ఇవ్వచ్చని పేర్కొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top