వైసీపీ నేతల తలలు నరుకుతాం!

Janasena Leader Sake Pawan Comments on YSRCP Leaders - Sakshi

ప్రకాష్‌రెడ్డినే కాదు ఎవరి తలలైనా నరుకుతాం

జనసేన నేత సాకే పవన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

ముక్తకంఠంతో ఖండించిన జిల్లా ప్రజలు, నేతలు

శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీసేందుకేనని విమర్శలు

సాక్షి ప్రతినిధి, అనంతపురం:  గతంలో ఫ్యాక్షన్‌  గొడవలతో అట్టుడికిన అనంతపురం జిల్లాలో గడిచిన ఐదు నెలల కాలంలో ప్రశాంతవాతావరణం నెలకొంది. ఈ వాతావరణాన్ని చెడగొట్టే ఉద్దేశ్యంతోనే జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ ప్రోద్భలంతో ఆ పార్టీకి చెందిన సాకే పవన్‌... ప్రకాష్‌ రెడ్డితో పాటు ఇతర వైసీపీ నేతల తలలు నరుకుతామని వ్యాఖ్యలు చేశారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలతో పాటు జిల్లా ప్రజలు మండిపడుతున్నారు. ఒకవైపు వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ముఖ్యమంత్రి నేతృత్వంలో పరిపాలన సాగుతుండగా... కులాల ప్రస్తావనతో పాటు తలలు నరుకుతామంటూ మదనపల్లెలో స్వయంగా పవన్‌కళ్యాణ్‌ సమక్షంలో ఈ వ్యాఖ్యలు చేయడం వెనక కుట్ర ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యాఖ్యలను నిరసిస్తూ జిల్లాలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలతో వివిధ ప్రజా సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. మరోవైపు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి... ఎస్పీకి కలిసి జనసేన నేతల వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. మరోవైపు ఎస్వీ యూనివర్శిటీతో...

పవన్‌ విజ్ఞతకే వదిలేస్తున్నా..
జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ సమక్షంలో ఆ పార్టీకి చెందిన వ్యక్తి చేసిన వ్యాఖ్యలను పవన్‌ విజ్ఞతకే వదిలేస్తున్నానని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం ‘సాక్షి’తో మాట్లాడారు. ‘‘సాకే పవన్‌ మాజీ మంత్రి పరిటాల సునీత వర్గీయుడు.  ఎన్నికల్లో నన్ను ఓడించాలనే కుట్రతోనే అతన్ని జనసేన తరపున బరిలోకి దింపారు. అలాంటి వ్యక్తి కేవలం నన్ను మాత్రమే కాకుండా ఇతర వైసీపీ నేతల తలలు కూడా నరుకుతామనే విధంగా వ్యాఖ్యానించారు. అక్కడే ఉన్న పవన్‌ కనీసం వారించలేదు.  మొన్నటి ఎన్నికల్లో సరిగా డిపాజిట్లు కూడా దక్కించుకోలేని జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ అడ్రస్సులేని రాజకీయ నేత.’’ అన్నారు. తన రాజకీయ ఉనికిని కాపాడుకొనేందుకు గుర్తింపు లేని కొంతమంది నాయకులు, కార్యకర్తలను వెంట వేసుకొని తిరుగుతున్నాడన్నారు. టీడీపీతో కుమ్మకై గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన జనసేన పార్టీ నేత పవన్‌ కళ్యాణ్‌ తన ఉనికిని కాపాడుకొనేందుకు అడ్రస్సులేని తన పార్టీ కార్యకర్తలు అనవసరమైన మాటలు మాట్లాడించాడన్నారు. అయితే రాప్తాడు నియోజక వర్గంలో ప్రస్తుతం ఫ్యాక్షన్‌  రాజకీయాల దూరంగా శాంతికుసుమాలు పూయిస్తున్న తరుణంలో తిరిగి ఇక్కడ ఫ్యాక్షన్‌ ను ప్రేరేపించే వాఖ్యలు చేయటం తగదన్నారు. ఇటువంటి వ్యాఖ్యలను ఖండించటంతో పాటు వాటిని మాట్లాడిన జనసేన పార్టీ నేతతో పాటు పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌పై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.

సాకే పవన్‌ కుమార్‌ వెనుక ఎవరూ..?
మా అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఆదేశిస్తే రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డితో పాటు జిల్లా వైఎస్సార్‌సీపీ నాయకులు తలలు నరుకుతామని అనుచిత వ్యాఖ్యలు చేసిన సాకే పవన్‌కుమార్‌ వెనుక ప్రతిపక్ష టీడీపీ నేతల హస్తం ఉన్నట్టు వైఎస్సార్‌సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరి మండలానికి చెందిన సాకే పవన్‌ కుమార్‌ ప్రస్తుతం అనంతపురంలోని చిన్న మెకానిక్‌ షాపు పెట్టుకొని జీవిస్తున్నాడు. అయితే ఇతను గతంలో పరిటాల కుటుంబానికి దగ్గరగా ఉండేవాడని, గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వారి ప్రోద్బలంతోనే ఇతను జనసేన తరఫున పోటీ చేశాడని తెలుస్తోంది. అయితే ఎన్నికల్లో తన పార్టీ తరఫున ప్రచారం చేసుకోకుండా టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరామ్‌తో డబ్బులు తీసుకొని వారికి మద్దతుగా పనిచేసినట్లు ఆరోపణలు వినిపించాయి. ఇప్పుడు కూడా టీడీపీ నాయకుల ప్రోత్సాహంతోనే అతను ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డిపై అనుచిత మాట్లాడాడని నియోజక వర్గంలోని వైఎస్సార్‌సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

జనసేన పార్టీ దిష్టిబొమ్మ దహనం
వైఎస్సార్‌ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో అనంతపురంలోని ఎస్‌కే యూనివర్శిటీ ముఖద్వారం వద్ద గురువారం సాయంత్రం జనసేన పార్టీ దిష్టి బొమ్మను దహనం చేశారు. నాయకులు జయచంద్రారెడ్డి, అంకే శ్రీనివాస్, హేమంత్‌కుమార్, హనుమంతరెడ్డి తదితరులు మాట్లాడుతూ రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టే వ్యాఖ్యలు తగవన్నారు.

పవన్‌కుమార్‌పై చర్యలు తీసుకోండి
రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిపైన, రెడ్డి సామాజిక వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాప్తాడు జనసేన పార్టీ నాయకుడు సాకే పవన్‌కుమార్‌ చర్యలు తీసుకోవాలని చెన్నేకొత్తపల్లి మండల వైఎస్సార్‌సీపీ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మండల కన్వీనర్‌ మైలారపు గోవిందరెడ్డితో కలసి చెన్నేకొత్తపల్లి పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐ రమేష్‌బాబుకు ఫిర్యాదు చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top