
లడ్డూ వద్దు నాయనా !
దేవుడి ప్రసాదమనగానే కళ్ల కద్దుకుని... కళ్లు మూసుకుని భక్తిభావంతో ఆరగిస్తాం. ఇది తరతరాలుగా, యుగయుగాలుగా వస్తున్న ఆచారం.
దేవుడి ప్రసాదమనగానే కళ్ల కద్దుకుని... కళ్లు మూసుకుని భక్తిభావంతో ఆరగిస్తాం. ఇది తరతరాలుగా, యుగయుగాలుగా వస్తున్న ఆచారం. కానీ కాలం మారుతోంది. భక్తి భావంతో కళ్లు మూసుకొని ప్రసాదం తిన్నామో ... అంతే సంగతులు. పవిత్రమైన ప్రసాదాల్లో ఈమధ్య పనికిమాలిన పదార్థాలు దర్శనమిస్తున్నాయి. భక్తుల మనోభావాలతో ఆటలాడుతున్నాయి. పవిత్రంగా భావించే వెంకన్న లడ్డూ వద్దు నాయనపై అనుకునేలా మారింది.
తిరుమల పేరు చెప్పగానే టక్కున గుర్తొచ్చేది లడ్డూ. ఈ లడ్డూకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. అంతే కాదు జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ (జిఐ మార్కు) పేటెంటూ ఉంది. తిరుమల వెళ్లే భక్తులు మహాప్రసాదం కోసం కౌంటర్ల ముందు బారులుదీరుతారు. ఇంటిల్లిపాదితో పాటు బంధువులకూ లడ్డూ ప్రసాదాన్ని పంచిపెట్టి మహాభాగ్యంగా మురిసిపోతారు భక్తులు . అసలు ఎవరైనా తిరుమల వెళ్లారంటే చాలు ... లడ్డూ ఏదీ అని టక్కున అడుగుతారు.
అంతటి పరమపవిత్ర ప్రసాదం తయారీలో అనునిత్యం ఏదో ఓ పొరపాటు దొర్లుతూనే ఉంది. ఒకసారి తోలు, వెదురుపుల్ల, మరోసారి బోల్టు, ఇంకోసారి రబ్బరు దర్శనమిచ్చి పవిత్రమైన లడ్డూను అపవిత్రంగా మార్చుతున్నాయి. ఓసారి ఏకంగా లడ్డూలో గుట్కా ప్యాకెట్టు కనిపించి భక్తులను వెక్కిరించాయి. మరికొద్దిరోజుల్లో బ్రహ్మోత్సవాలు జరగనున్నా .. ఇంకా అధికారుల్లో టేక్ ఇట్ ఈజీ పాలసీ మాత్రం పోవట్లేదు. ప్రసాదాలపై ఎన్నిసార్లు, ఎంతమంది ఫిర్యాదులు చేసినా ... వారు మాత్రం చాలా లైట్ తీసుకుంటున్నారు. ఫలితంగా మరోసారి ప్రసాదాల నాణ్యతపై దుమారం రేగింది.
భక్తులు అత్యంత ప్రీతి పాత్రంగా భావించే తిరుమల శ్రీవారి ప్రసాదమైన లడ్డులో ఇనుప ముక్క కనిపించింది. మూడు రోజుల క్రితం హైదరాబాద్ రాజేంద్రనగర్- శివరాంపల్లికి చెందిన బాబూరావు తిరుమల నుంచి లడ్డూ ప్రసాదం తీసుకువచ్చాడు. ఇంటికొచ్చి లడ్డూ తీస్తే ... అందులో ఇనుప ముక్క కనిపించింది. దీంతో అతడికి మైండ్ బ్లాంక్ అయ్యింది. దేవుని దర్శనం అనంతరం లడ్డు కొనుగోలు చేశాడు. అనంతరం హైదరాబాద్ చేరుకున్నాడు.
దేవుని ప్రసాదాన్ని బంధువులకు పంచే క్రమంలో లడ్డులో ఇనుప ముక్కను గుర్తించాడు. దాంతో శ్రీవారి ప్రసాదం తయారీలో టీటీడీ నిర్లక్ష్యం పట్ల భక్తుడు ఆగ్రహాం వ్యక్తం చేశాడు. లడ్డులోని ఇనుపముక్క ఉన్న విషయాన్ని మీడియాకి తెలియజేశాడు. ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎందుకు పట్టించుకోవడం లేదు. ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పేది ఎవరు? ఆ దేవుడికే తెలియాలి.