హైదరాబాద్ మేయర్ మాజిద్ హుస్సేన్ రాజీనామా | Hyderabad mayor majid hussain resigns | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ మేయర్ మాజిద్ హుస్సేన్ రాజీనామా

Mar 7 2014 5:24 PM | Updated on Mar 18 2019 7:55 PM

హైదరాబాద్ మేయర్ మాజిద్ హుస్సేన్ రాజీనామా - Sakshi

హైదరాబాద్ మేయర్ మాజిద్ హుస్సేన్ రాజీనామా

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) మేయర్ పదవికి మాజిద్ హుస్సేన్ శుక్రవారం రాజీనామా చేశారు.

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) మేయర్ పదవికి మాజిద్ హుస్సేన్ శుక్రవారం రాజీనామా చేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ను కలసి రాజీనామా పత్రాన్ని అందజేశారు. పార్టీ ఆదేశాల మేరకే రాజీనామా చేసినట్టు మాజిద్ హుస్సేన్ స్పష్టం చేశారు.

26 నెలల పదవీ కాలంలో ప్రజలపై ఎలాంటి భారం వేయలేదని ఆయన చెప్పారు. నష్టాల్లో ఉన్న జీహెచ్ఎంసీని 572 కోట్ల రూపాయిల లాభాల్లోకి తెచ్చామని మాజిద్ తెలిపారు. కాంగ్రెస్ - మజ్లిస్ పార్టీల మధ్య గతంలో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు రెండు సంవత్సరాలు దాటిపోవడంతో మాజిద్ హుస్సేన్ పదవికి రాజీనామా చేయనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.

జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ - ఎంఐఎంల మధ్య పొత్తులో భాగంగా మొదటి రెండు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ మేయర్ పదవిని, ఎంఐఎం డిప్యూటీ మేయర్ పదవిని చేపట్టాలని, రెండేళ్ల తర్వాత పదవులు మార్చుకోవాలని ఒప్పందం చేసుకున్నారు. అయితే, తొలిసారి మేయర్ పదవి చేపట్టిన బండ కార్తీకరెడ్డి రెండు సంవత్సరాల తర్వాత మరి కొంత కాలం పాటు మేయర్ పదవిలో కొనసాగడంతో, మాజిద్ హుస్సేన్ కూడా రెండేళ్ల గడువు పూర్తయిన తర్వాత మరికొంత కాలం ఉండి.. ఇప్పుడు రాజీనామా చేస్తున్నారు.

మేయర్ పదవిని విజయవంతంగా నిర్వర్తించిన మాజిద్ హుస్సేన్.. నగర ప్రజల నోళ్లల్లో బాగా నానారని, ఆయనకు మంచి పేరే వచ్చిందని ఎంఐఎం అధిష్ఠానం భావిస్తోంది. అందుకే మాజిద్ చేత నాంపల్లి ఎమ్మెల్యే పదవికి పోటీ చేయించాలని నిర్ణయించినట్లు సమాచారం. అక్కడున్న విరాసత్ రసూల్ ఖాన్ ను అవసరమైతే వేరే నియోజకవర్గానికి మార్చడం లేదా ఏమైనా ప్రత్యామ్నాయం చూడటం లాంటి యోచనలు కూడా చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement