ఆవేశంతో ఒకరు, అనుమానంతో మరొకరు... | Sakshi
Sakshi News home page

ఆవేశంతో ఒకరు, అనుమానంతో మరొకరు...

Published Mon, Oct 13 2014 9:19 AM

ఆవేశంతో ఒకరు, అనుమానంతో మరొకరు... - Sakshi

ఆవేశంతో ఒకరు, అదనపు కట్నం కోసం మరొకరు, అనుమానంతో ఇంకొకరు.. సమస్య ఏదైనా చివరికి కట్టుకున్న భార్య కడతేరిపోతుంది. నిండునూరేళ్లు సాగాల్సిన సంసారంలో కలతల కారణంగా అనేకమంది అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు.   తాగినమైకంలో భార్య తలపై రోకలి బండతో కొట్టిచంపాడు ఓ దుర్మార్గుడు. ఆవేశంతో కట్టుకున్న దాన్ని కడతేర్చాడు మరో కసాయి. ఈ విధంగా భార్యలను భర్తలు హత్యలు చేయడం ఎక్కువైపోతోంది. కుటుంబ గొడవల్లో   అధికంగా భార్యలే బలవుతున్నారు.

చిత్తూరు జిల్లా కుప్పం మండలం గోనుగూరుకు చెందిన సరితతో కర్ణాటక రాష్ట్రం బోడేపల్లికి చెందిన మునియప్పకు 11 ఏళ్ల క్రితం పెళ్లైంది. వీరికి ఇద్దరు కుమారులున్నారు. తరచూ గొడవలు పడుతున్న వీరికి పెద్దలు పలుమార్లు సర్దిచెప్పారు. అయినా తీరుమారలేదు. మునియప్ప తాగుడు మానలేదు.ఈ నేపథ్యంలో పీకల దాకా తాగివచ్చిన మునియప్ప భార్య సరితతో గొడవపడ్డాడు. తాగినమైకంలో పక్కనే ఉన్న రోకలిబండతో సరిత తలపై కొట్టి చంపేశాడు.   

ప్రకాశం జిల్లా మార్కాపురంలోనూ గొడవల కారణంగా కట్టుకున్నోడి చేతిలోనే భార్య కన్నుమూసింది. డ్రైవర్స్‌ కాలనీకి చెందిన పులిమి శ్రీనుకు శివరామపురానికి  చెందిన రాజేశ్వరితో 8 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్న శ్రీను తరచూ భార్యతో గొడవ పడుతున్నాడు. ఈ నేపథ్యంలో శ్రీను భార్య రాజేశ్వరితో గొడవపడి ఆమెను కిరాతకంగా హత్య చేశాడు.

ఇక హైదరాబాద్ పాతబస్తీ రెయిన్‌బజార్‌లోని హఫీజ్‌నగర్‌లో ఇటువంటి సంఘటనే జరిగింది. సంసారంలో చెలరేగిన గొడవల్లో ఆవేశానికి గురైన భర్త సయ్యద్‌ జఫర్‌ భార్య నాజియ బేగంను రోకలి బండతో మోదాడు. ఆ తర్వాత సయ్యద్‌ జఫర్‌ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దంపతుల మరణంతో వీరి నలుగురు పిల్లలు రోడ్డున పడ్డారు.

ఇటువంటి ఘటనలలో మహిళలు ప్రాణాలు కోల్పోతుంటే, వారి పిల్లలు దిక్కులేనివారవుతున్నారు. వారి ఆలనాపాలన చూసేవారులేక, వారు అసాంఘీక శక్తులుగా మారే ప్రమాదం ఉంది.
**

Advertisement
Advertisement