పెనుభూతమైన అనుమానం | husband killed by wife | Sakshi
Sakshi News home page

పెనుభూతమైన అనుమానం

Feb 4 2018 9:26 AM | Updated on Feb 4 2018 9:26 AM

husband killed by wife - Sakshi

నరసాపురం రూరల్‌ : నరసాపురం రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రుస్తుం బాద పంచాయతీ మండావారిగరువులో భార్యపై అనుమానంతో భర్త ఆమెను హత్య చేశాడు. శనివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్టు నరసాపురం సీఐ ఎం.సుబ్బారావు తెలిపారు. మల్లుల వెంకటేశ్వరరావు భార్య మహాలక్ష్మి (29)పై  భర్త అనుమానం పెంచుకున్నాడు. వేరే వ్యక్తితో లైంగిక సంబంధం ఉందనే ఆరోపణలతో రెండు, మూడు సార్లు ఆమెను కొట్టినట్టు కూడా కుటుంబ సభ్యులు తెలిపారన్నారు.

 విడాకులు ఇవ్వాలని ఆమెపై ఒత్తిడి తేగా ఆమె ఒప్పుకోకపోవడంతో శనివారం తెల్లవారుజామున ఇనుపరాడ్డుతో ఆమె తలపైనా, ముఖం పైనా దాడి చేశాడు. ఆమె 11 ఏళ్ల కుమారుడు అడ్డం రాగా అతడిని పక్కకు తోసేసినట్టు సీఐ తెలిపారు. ఆమె మృతి చెందిందని నిర్ధారించుకున్న అనంతరం రూరల్‌ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి వెంకటేశ్వరరావు స్వయంగా లొంగిపోయినట్టు నరసాపురం టౌన్‌ ఎస్సై చంద్రశేఖర్‌ తెలిపారు. మహాలక్ష్మి మృతి చెందిందని తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.

 మృతురాలికి 13 ఏళ్ల కుమార్తె కల్యాణి, 11 ఏళ్ల రాజేష్‌ (కుమారుడు) ఉన్నారు. మృతదేహానికి నరసాపురం ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. నిందితుడిని కోర్టుకు హాజరుపర్చనున్నట్టు సీఐ తెలిపారు. పట్టణ ఎస్సై చంద్రశేఖర్, రూరల్‌ ఎస్సై చెన్నం ఆంజనేయులు, ఏఎస్సైలు శ్రీనివాస్, అడపా సత్యనారాయణ, రైటర్‌ భాస్కరరావు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement