
నరసాపురంలో నారాయణ స్కూల్ వద్ద విద్యార్థుల ఆందోళన
నరసాపురంలో నారాయణ స్కూల్ వద్ద విద్యార్థులు, మైలవరంలో తల్లిదండ్రుల ఆందోళన
నరసాపురం/మైలవరం: ‘మా పాఠశాలలో ఫీజు మొత్తం ఒకేసారి కట్టినవారిని ఒకలా చూస్తున్నారు. విడతలవారీగా కట్టేవారిని మరోలా చూస్తూ కూలి పనులు చేయిస్తున్నారు...’ అంటూ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని పంజా సెంటర్‌లో ఉన్న నారాయణ స్కూల్ విద్యార్థులు సోమవారం ఆందోళనకు దిగారు. పాఠశాల నిర్వాహకుల వేధింపులు అధికమయ్యాయంటూ విద్యార్థులు గేటుకు తాళం వేసి ఆందోళన చేపట్టారు. ఈ విషయం తెలిసి స్కూల్ వద్దకు పట్టణ ఎస్‌ఐ జయలక్ష్మి, పోలీసులు వచ్చారు.
‘ఫీజులు కట్టకపోతే సిబ్బందికి జీతాలు ఎలా ఇస్తారు...’ అంటూ ఎస్‌ఐ స్కూల్ యాజమాన్యానికి అనుకూలంగా మాట్లాడటంతో విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ఫీజులు చెల్లించకపోతే తల్లిదండ్రులను అడగాలి. మాతో చెత్త ఎత్తించడం, గ్రౌండ్‌లో మొక్కలు కోయించడం, బెంచీలు మోయించడం వంటి పనులు ఎందుకు చేయిస్తున్నారు? మంత్రి పాఠశాల కాబట్టి ఎస్‌ఐ వచ్చి యాజమాన్యానికి మద్దతుగా మాట్లాడుతున్నారా?’ అని నిలదీశారు. అదే సమయంలో గేటుకు విద్యార్థులు వేసిన తాళాన్ని పాఠశాల సిబ్బంది రాడ్డుతో పగలగొట్టి కొందరు పిల్లలను లోపలికి పంపారు. వారిని ఆందోళన చేస్తున్న విద్యార్థులు అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.
దాదాపు రెండు గంటలపాటు విద్యార్థుల ఆందోళన అనంతరం పాఠశాల యాజమాన్యం తరఫు ప్రతినిధులు వచ్చి ఇకముందు విద్యార్థులకు ఎటువంటి పనులు చెప్పకుండా చూస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ప్రిన్సిపాల్ రాజన్ క్షమాపణలు చెప్పారు.
దీంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడు ముచ్చర్ల త్రిమూర్తులు తదితరులు విద్యార్థులకు మద్దతు తెలిపారు.
మైలవరంలో తల్లిదండ్రుల ఆందోళన
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నారాయణ పాఠశాల ప్రిన్సిపాల్, యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా అర్హులైనా తమ పిల్లలకు తల్లికి వందనం డబ్బులు పడలేదని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం పాఠశాల గేటు వద్ద ఆందోళన నిర్వహించారు. పాఠశాలల నుంచి విద్యార్థుల డేటాను ఎంఈవో కార్యాలయానికి పంపడంలో యాజమాన్యం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.