
పాట్నా: దేశవ్యాప్తంగా ఇటీవలి కాలంలో భర్తలను అత్యంత దారుణంగా చంపేస్తున్న ఘటనలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా మరో భర్త.. పెళ్లి అయిన 45 రోజులకు హత్యకు గురైన ఘటన చర్చనీయాంశంగా మారింది. అయితే, తన మామతో జీవించేందుకే.. అడ్డుగా ఉన్న భర్తను భార్యే హత్య చేయించింది. ఈ విషాదకర ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. దీంతో, పెళ్లి అంటేనే పురుషులు వణికిపోయే పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బీహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాకు చెందిన ప్రియాంశు (25), గుంజాదేవి (20)లకు రెండు కుటుంబాల పెద్దలు వివాహం జరిపించారు. కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల మధ్య 45 రోజుల క్రితమే వీరిద్దరికి అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. అయితే, గుంజాదేవికి తన మామ అంటే(భర్త తండ్రి కాదు) ఎంతో ఇష్టం. పెళ్లికి ముందు నుంచే గుంజాదేవీ, ఆమె మామ జీవన్‌సింగ్ (55)లు పీకల్లోతు ప్రేమలో ఉన్నారు. శారీరకంగా కూడా కలిసినట్టు తెలిసింది. ఈ క్రమంలో తన మామనే పెళ్లిచేసుకుంటానని.. గుంజాదేవీ తన పేరెంట్స్‌కు చెప్పింది. ఇందుకు కుటుంబ సభ్యులు నిరాకరించారు.
అనంతరం, ప్రియాంశుతో దేవీకి బలవంతంగా వివాహం చేశారు. తర్వాత.. తన మామను మరిచిపోలేక గుంజాదేవీ.. భర్తను దూరం పెడుతూ వస్తోంది. ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకుని తన మామను పెళ్లి చేసుకోవాలని ఆమె భావించింది. దీంతో, తన భర్తను హత్య చేసేందుకు ప్లాన్ చేసింది. ఇందుకు సుపారీ గ్యాంగ్‌తో డీల్ కుదుర్చుకుంది. గత నెల 25న ప్రియాంశు తన సోదరిని కలిసేందుకు వెళ్లి రైలులో తిరిగి పయనమయ్యాడు. ఈ క్రమంలో నవీనగర్ స్టేషన్ నుంచి ఇంటికి వెళ్తుండగా.. ఇద్దరు వ్యక్తులు అతడిపై కాల్పులు జరిపారు. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సమయంలో గుంజాదేవీ గ్రామం నుంచి పారిపోవడానికి ప్రయత్నించింది.
ఇది గమనించిన ప్రియాంశు కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఆమె కాల్ రికార్డులను పరిశీలించగా.. జీవన్‌సింగ్‌తో తరచూ టచ్‌లో ఉన్నట్లు వెల్లడైంది. అతడి కాల్ డేటా కూడా పరిశీలిస్తే సుపారీ గ్యాంగ్‌తో సంప్రదింపులు జరిపినట్లు తేలింది. ఇక, ఈ కేసులో ప్రమేయం ఉన్న ఇద్దరు సుపారీ గ్యాంగ్ సభ్యులతో పాటు నిందితురాలిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. జీవన్‌సింగ్ పరారీలో ఉండగా అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పెళ్లి అయిన నెలన్నరకే తమ కొడుకు ఇలా చనిపోయవడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.