లేసు.. భేష్‌ | Narasapuram laces win production award | Sakshi
Sakshi News home page

లేసు.. భేష్‌

Jul 19 2025 6:07 AM | Updated on Jul 19 2025 6:07 AM

Narasapuram laces win production award

అల్లికల్లో రాణిస్తున్న పశ్చిమ మహిళలు 

కేంద్ర ప్రభుత్వ ఒక జిల్లా–ఒక ఉత్పత్తి అవార్డు సాధించిన నరసాపురం లేసులు 

ఇప్పటికే భౌగోళిక గుర్తింపుతో ఖండాంతర ఖ్యాతి 

గత ఏడాది ఒలింపిక్స్‌లోనూ మెరిసిన మన లేసులు 

లేసు పరిశ్రమకు ఊపిరిలూదిన మాజీ సీఎం వైఎస్సార్‌ 

2004లో లేసు పార్కు ఏర్పాటు 

సాక్షి, భీమవరం:   హస్తకళల్లో లేసు అల్లికలు ముఖ్యమైనవి. ఇక్కడి మహిళలు సూది మొనకు దారం తగిలించి అలవోకగా అల్లికలు చేస్తుంటారు. బ్రిటిష్‌ హయాంలో జల రవాణాకు పశ్చిమ గోదావరి జిల్లా  నరసాపురం కేంద్రంగా ఉండేది. అప్పట్లో క్రిస్టియన్‌ మిషనరీ సంస్థల ద్వారా పరిచయమైన లేసు అల్లికలను తర్వాతి కాలంలో ఈ ప్రాంతానికి భౌగోళిక గుర్తింపు తెచ్చే స్థాయికి ఇక్కడి మహిళలు అభివృద్ధి చేశారు. 

టవల్స్, టేబుల్‌ క్లాత్స్, లంచ్‌ మ్యాట్స్, క్రోచట్‌ బ్యాగ్స్, డెకో కుషన్స్, బీచ్‌ కలెక్షన్స్‌ తదితర ఇక్కడి హ్యాండ్‌ మేడ్‌ ఉత్పత్తులకు విదేశాల్లో మంచి గిరాకీ ఉంది. వీటిని అమెరికా, యూరప్, సింగపూర్, కొరియా తదితర దేశాలకు ఎగుమతులు చేసే కంపెనీలు నరసాపురం, పరిసరాల్లో 50కు పైగా ఉన్నాయి. దేశ విదేశాల్లో జరిగే ఎక్స్‌పోలు, డిజైనర్లు, థర్డ్‌ పార్టీల ద్వారా ఆర్డర్లు తీసుకుని ఎగుమతులు చేస్తుంటారు. గతంలో ఏటా రూ.300 కోట్లు మేర లేసు ఉత్పత్తులు ఎగుమతులు జరిగేవి. 

అండగా నిలిచిన వైఎస్సార్‌  
స్థానిక మహిళలు పొద్దు పొడవక ముందే లేచి ఇంటి పనులు, వంట ముగించుకుని, పిల్లలను స్కూళ్లకు, భర్తను పనికి పంపి అల్లికల పనిలో పడతారు. నలుగురైదుగురు కలసి టీవీ చూస్తున్నా, కబుర్లు చెప్పుకుంటున్నా వారి చేతిలో సూది, దారం కదులుతూనే ఉంటాయి. ఒక మహిళ రోజులో ఐదారు గంటలు పనిచేస్తే కేజీ దారం అల్లికకు పది రోజుల పడుతుంది. డిజైన్‌ను బట్టి కేజీకి గతంలో రూ.15 నుంచి రూ. 50 మాత్రమే వారికి కంపెనీలు ఇచ్చేవి. దళారుల దోపిడీని గుర్తించిన దివంగత మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి మహిళలకు అండగా 2004లో నరసాపురం రూరల్‌ సీతారాంపురంలో లేసు పార్కును ఏర్పాటుచేశారు.

కేజీ దారం అల్లికకు ఒక్కసారిగా రూ.100 పెంచారు. దీనికి సమానంగా  ప్రైవేట్‌ కంపెనీలు వేతనాన్ని పెంచాయి. మొదట్లో లేసు పార్కు పరిధిలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఆరు మండలాలకు చెందిన 10 వేల మంది సభ్యులు ఉంటే తర్వాతి కాలంలో ఈ సంఖ్య 15 మండలాల్లోని 30 వేల మందికి పెరిగింది. మార్కెటింగ్‌ మేనేజర్, ఇతర సిబ్బంది ఆర్డర్లు తెచ్చి మహిళలతో అల్లికలు చేయించడం ద్వారా అప్పట్లో ఏడాదికి రూ.100 కోట్ల విలువైన ఉత్పత్తులు ఎగుమతులు జరిగేవి. ఈ పార్క్‌ ద్వారా గతంలో స్థానిక మహిళలు అమెరికా, యూరప్, సింగపూర్‌ తదితర దేశాలకు వెళ్లి లేసు ఉత్పత్తులను ప్రదర్శించడం గమనార్హం. 

యాంత్రీకరణ, ఇతర దేశాల నుంచి పోటీ, కోవిడ్‌ పరిణామాల అనంతరం లేసు పరిశ్రమ ప్రాభవం కోల్పోయి ఎగుమతులు తగ్గినా ఏడాది క్రితం భౌగోళిక గుర్తింపు దక్కించుకుని సత్తాను చాటింది. పారిస్‌ వేదికగా గత ఏడాది 206 దేశాలు పాల్గొన్న ఒలింపిక్స్‌ పోటీల్లో ఇక్కడి లేసు ఉత్పత్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నిర్వాహకుల ఆర్డరుపై సీతారాంపురానికి చెందిన సంస్థ క్రీడాకారులు, సందర్శకుల కోసం లేస్, ఫ్యాబ్రిక్‌లను ఉపయోగించి ఒలింపిక్స్‌ థీమ్, లోగోలతో టవల్స్, డెకో కుషన్స్, బీచ్‌ కలెక్షన్స్‌ తదితర ఉత్పత్తులను భారీ మొత్తంలో పంపింది.  

ఒక జిల్లా..ఒక ఉత్పత్తికి ఎంపిక  
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నుంచి దాదాపు రెండు లక్షల మంది మహిళలు లేసు అల్లికలు చేస్తున్నారు. 2024–25కి గాను నరసాపురం లేసుకు కేంద్ర ప్రభుత్వ ఒక జిల్లా–ఒక ఉత్పత్తి అవార్డు దక్కింది. కేంద్ర ప్రభుత్వ వాణిజ్య పన్నులు, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో  న్యూఢిల్లీ ప్రగతి మైదానంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్‌ చదలవాడ నాగరాణి అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని అల్లికలు చేసే మహిళలకు కలెక్టర్‌ శుభాకాంక్షలు తెలిపారు.  

ఆనందంగా ఉంది  
చిన్నతనం నుంచి ఇంట్లో అమ్మ, నానమ్మలను చూసి లేసులు అల్లడం అలవాటు చేసుకున్నాను. ఇప్పటికీ రోజూ ఖాళీ సమయంలో అల్లికలు చేస్తుంటాం. వీటిపై వచ్చే డబ్బులు ఇంటిలోని చిన్నచిన్న అవసరాలకు ఎంతో ఉపయోగపడతాయి. లేసు అల్లికలకు అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది.  – రాట్నాల లక్ష్మి, గృహిణి,ఎల్‌బీ చర్ల

తరతరాలుగా అల్లికలు  
మా చిన్నతనంతో పోలిస్తే ఇప్పుడు లేసులు అల్లేవారు కొంత తగ్గారని చెప్పవచ్చు. అప్పట్లో ఏ ఇంటి వద్ద చూసిన ఆడవాళ్లు అల్లికలు చేస్తూ కనిపించేవారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇప్పటితరం వారు రకారకాల డిజైన్లలో అల్లికలు చేస్తూ జిల్లాకు దేశ విదేశాల్లో మంచి గుర్తింపు తీసుకురావడం అభినందనీయం.   – తెలగంశెట్టి వెంకటలక్షి్మ, నరసాపురం  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement