రుణమే యమపాశమై..

Huge Farmer suicides in the State - Sakshi

రాష్ట్రంలో మోగుతున్న అన్నదాతల చావుడప్పు

రుణాల ఊబిలో కూరుకుపోతున్న రైతన్నలు

వడ్డీలకూ సరిపోని రుణమాఫీ..

బ్యాంకుల్లో కొత్త అప్పులు పుట్టక విలవిల 

నడ్డి విరుస్తున్న పెట్టుబడి వ్యయం

కనీస మద్దతూ లేదు....గిట్టుబాటు ధరా రాదు

ఇన్‌పుట్‌ సబ్సిడీ అందదు... పంటల బీమా చెల్లించరు

వరస కరువులు, ప్రకృతి వైపరీత్యాలతో సాగు కకావికలం

విపత్కర పరిస్థితుల్లో ఆదుకోని సర్కారు

కోర్టులు మొట్టికాయలు వేసినా చలించని వైనం

ఆర్థిక ఇక్కట్లతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతన్నలు

కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామానికి చెందిన గొల్ల లక్ష్మీదేవీ నాయుడు చిన్న రైతు. తొలకరిలో కురిసిన వర్షంతో పత్తి, మిర్చి సాగు చేశారు. ఆ తర్వాత వరుణదేవుడు ముఖం చాటేయడంతో పంటలు నిలువునా ఎండిపోయాయి. అప్పులు పెరిగిపోయాయి. దిక్కుతోచని స్థితిలో ఆయన బలవన్మరణానికి పాల్పడ్డాడు. కనికరం లేని పాలకులు మొఖం చాటేశారే కానీ ఆ కుటుంబాన్ని కనీసం పరామర్శించలేదు.
శ్రీకాకుళం జిల్లా మందస మండలం భేతాళపురం గ్రామానికి చెందిన దున్న లక్ష్మీనారాయణ ఖరీఫ్‌లో సాగు చేసిన వరి పంట తిత్లీ తుపానుకు ధ్వంసమైంది. ప్రభుత్వం నుంచి ఆయనకు నయా పైసా సాయం అందలేదు. అప్పుల భారం పెరిగి బతుకు భారమై పంట చేలో శవమై తేలాడు.

సాక్షి, అమరావతి:రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల రైతన్నలు పెద్ద ఎత్తున బలవన్మరణాలకు పాల్పడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. టీడీపీ సర్కారు అధికారంలోకి వచ్చాక వేల సంఖ్యలో అన్నదాతలు తనువు చాలిస్తున్నారు. తాజాగా కర్నూలు జిల్లా పెదకడబూరుకు చెందిన రైతు కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. పురుగుల మందు తాగి ఓ రైతు తనువు చాలించగా ఆయన భార్య చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. రైతు దంపతుల ఆత్మహత్యాయత్నంతో ముగ్గురు చిన్నారులు అనాథలుగా మిగిలారు. ప్రకాశం జిల్లాలోనూ ఓ యువరైతు వరుసగా మూడేళ్ల పాటు అప్పుల పాలు కావడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

కరువు ప్రాంతాలకు వెళ్లని సీఎం..
అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్‌ ఇటీవల అన్నదాతల చావుకేకలతో మార్మోగుతోంది. పంట పొలాలు మరుభూములుగా మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ఆత్మహత్యల ప్రదేశ్‌గా మారుతోంది. సీఎం చంద్రబాబు ప్రకటించిన రుణమాఫీ వర్తించకపోవడం, అరకొర మాఫీ వడ్డీలకే సరిపోక బ్యాంకులకు డిఫాల్టర్లుగా మారి దిక్కుతోచని స్థితిలో పలువురు రైతులు చనిపోతుండగా అననుకూల పరిస్థితుల్లో పంట పండించినా గిట్టుబాటు ధర రాక మరికొందరు, ప్రైవేట్‌ వ్యాపారుల నుంచి 4 – 5 రూపాయల వడ్డీకి అప్పులు తెచ్చి సంక్షోభంలో చిక్కుకుని ఇంకొందరు రైతులు మరణిస్తుంటే ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తోంది. ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వకుండా, పంటల బీమాను పట్టించుకోకుండా రైతులను గాలికి వదిలేసింది. ధరలలో వ్యత్యాసం కింద ఇస్తామని ప్రకటించిన స్థిరీకరణ నిధుల్ని గానీ, మొక్కజొన్న, కంది, మిర్చికి ఇస్తామన్న బోనస్‌ మొత్తాల్ని గానీ ఇవ్వకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. పంటల సాగుబడి వ్యయం భారీగా పెరిగినా, వరుస కరువులు, తుపాన్లు వెంటాడుతున్నా సర్కారు కనికరం చూపడం లేదు. రైతు ఆత్మహత్యల్ని గుర్తిస్తే ఎక్కడ సాయం ఇవ్వాల్సి వస్తుందోనన్న భయంతో రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉన్నట్టు వృద్ధి రేటుపై గొప్పలు చెబుతోంది. నాలుగున్నరేళ్లుగా వరుస కరువులు, ప్రకృతి విపత్తులు, తుపాన్లతో రైతులు కకావికలమై ఊళ్లకు ఊళ్లు వలస వెళుతున్నా ప్రభుత్వం మొండిచెయ్యే చూపుతోంది. ప్రస్తుత ఖరీఫ్‌లో ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద ఇవ్వాల్సిన రూ.2 వేల కోట్లలో ఇంతవరకు నయాపైసా కూడా ఇవ్వకపోవడం గమనార్హం. ఆత్మహత్యల నివారణకు చొరవ చూపించి రైతన్నల్లో మనోధైర్యం నింపాల్సిన ముఖ్యమంత్రి కనీసం కరువు పీడిత జిల్లాల్లో  పర్యటించకపోవడం దురదృష్టకరమని వ్యవసాయ రంగ ప్రముఖులు విమర్శిస్తున్నారు.

కనికరం ఏది?
రాష్ట్రంలో ఈ ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లకు కలిపి కేవలం 347 మండలాలను రాష్ట్ర ప్రభుత్వమే కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. వాస్తవానికి అన్ని మండలాల్లోనూ కరువు తాండవిస్తోందని రైతు సంఘాలు చెబుతున్నాయి. అయితే కరువు ప్రాంతాలను ప్రకటించారే గానీ కరువు మాన్యువల్‌ ప్రకారం ప్రభుత్వం ఎటువంటి సహాయక చర్యలను ప్రకటించలేదు. ఖరీఫ్‌లో వర్షాభావ పరిస్థితుల వల్ల పంట నష్టపోయిన రైతులకు రూ.2 వేల కోట్లను పెట్టుబడి రాయితీగా ఇవ్వాల్సి ఉన్నా ఇంతవరకు ఇవ్వలేదు. పంటల బీమా లెక్కల్ని ఇంతవరకు తేల్చలేదు. ఫలితంగా రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోవాల్సి వచ్చింది. మరోవైపు రాష్ట్రంలో సాగు విస్తీర్ణం సైతం గణనీయంగా తగ్గిపోతోంది. రబీలో మొత్తం సాగు విస్తీర్ణం 23.43 లక్షల హెక్టార్లకుగానూ ఇప్పటి వరకు సగం ప్రాంతంలో కూడా విత్తనాలు పడలేదు. మరో వారంలో సీజన్‌ కూడా ముగియబోతోంది. రెండు సీజన్లలో కలిపి రైతులు రూ.19 వేల కోట్ల పెట్టుబడులు నష్టపోయినట్టు అనధికార అంచనా.

వడ్డీకీ చాలని మాఫీ 
2014లో చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రకారం రాష్ట్రంలో సుమారు రూ.87,612 కోట్ల రుణాలు మాఫీ కావాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు ఇచ్చింది కేవలం రూ.15,038 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. అయితే ఇది రైతులు చెల్లించాల్సిన వడ్డీలకు కూడా సరిపోకపోవడంతో వారికి సకాలంలో రావాల్సిన ఏ రుణమూ అందకుండా పోయింది. వారికి కొత్తగా అప్పులిచ్చేందుకు బ్యాంకులు నిరాకరిస్తున్నాయి. ఫలితంగా ప్రైవేట్‌ వ్యాపారుల నుంచి అధిక వడ్డీలకు తెచ్చి సాగు చేసి చేతులు కాల్చుకోవాల్సి వచ్చింది. 

బీమా పరిహారానికీ మొండిచెయ్యి
కరువుల్ని జయించానని, సముద్రాలను గెలిచానని తరచూ చెప్పే సీఎం చంద్రబాబు రైతుల ఇక్కట్లను పట్టించుకోకుండా అభివృద్ధి రేట్లంటూ అంకెల గారడీ చేస్తున్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది వ్యవసాయాభివృద్ధి రేటు 16.55 శాతంగా నిర్ణయించి ఆ దిశగా ముందుకు సాగుతున్నట్టు చెప్పుకోవడం గమనార్హం. ఒకవైపు పండించిన ఏ పంటకూ గిట్టుబాటు ధర రాక రైతులు అల్లాడిపోతున్నారు. కనీస మద్దతు ధరలకు మార్కెట్‌ ధరలకు ఎటువంటి పొంతన లేకుండా పోయిందనే దానికి రాష్ట్రంలో అత్యధికంగా సాగు చేసే వరే ప్రత్యక్ష నిదర్శనం. కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ. 1750 ఉంటే రూ.1,100 – రూ1,200 మించి ఎవరూ కొనడం లేదు. ఈ పరిస్థితుల్లో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన రైతులు తీవ్ర ఆర్థిక ఇక్కట్లలో చిక్కుకుపోయి మరోమార్గం లేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఈ దుస్థితిపై హైకోర్టు సైతం ఇటీవల స్పందిస్తూ.. రైతులు కష్టాలు చెప్పుకునేందుకు ఓ చట్టబద్ధ సంస్థ ఉండాలని సూచించినా టీడీపీ సర్కారు ఆలకించలేదు. ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతులకు చంద్రన్న రైతు బీమా పథకం కింద ఇస్తామన్న రూ.5 లక్షలను సైతం ఇవ్వకుండా ఎగ్గొడుతూ అన్నదాతల ఆత్మహత్యలను గుర్తించడానికే ససేమిరా అంటోంది. ఈ నేపథ్యంలో రైతుల్లో మనోధైర్యం నింపేలా చేయడమే తక్షణ కర్తవ్యమని రైతు సంఘాలు సూచిస్తున్నాయి.

బాబు గద్దెనెక్కాక వేలల్లో రైతుల బలవన్మరణం..
2014లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 2,635 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడినట్టు వ్యవసాయ రంగంపై కృషి చేస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతు ఆత్మహత్యలు పెరిగిపోతూనే ఉన్నట్టు అధికారిక లెక్కలే చెబుతున్నాయి. 2014లో ఏపీలో 164 మంది (వ్యవసాయ కూలీలు, కౌలు రైతులను కలపలేదు. వారిని కూడా కలిపితే 570 మందికి పైగా ఉంటారని అంచనా) అన్నదాతలు చనిపోయినట్లు నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో అంచనా వేసింది. 2015లో ఆ సంఖ్య 916 (వీరిలో రైతులు 516 మంది)కి పెరిగింది. 2016లో ఏపీలో 804 మంది (వీరిలో కౌలు రైతులు, రైతు కూలీలు ఉన్నారు) ఆత్మహత్యలు చేసుకున్నట్టు  నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో ప్రకటించింది. 2017 నుంచి ఆ సంస్థ రైతుల చావుల్ని నమోదు చేయడం లేదని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి ఇటీవల పార్లమెంటులో ప్రకటించారు. అంటే సగటున ఏటా రాష్ట్రంలో 7 వందల మంది రైతులు చనిపోతున్నారు. దీని అర్థం రాష్ట్రంలో పూటకో రైతు ఆత్మహత్య చేసుకున్నట్టని, ఈ నాలుగేళ్లలో 2,650 మంది చనిపోయారని రైతు సంఘాలు పేర్కొంటున్నాయి. ఈ ఏడాది జూన్‌లో ఖరీఫ్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తల ప్రకారం రాష్ట్రంలో దాదాపు 163 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. వీరిలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 46 మంది, అనంతపురం జిల్లాలో 44 మంది ఉన్నారు. 

అప్పుల భయంతో కుమిలిపోయాడు..
మాకు సేద్యం తప్ప వేరే ఆధారం లేదు. రెక్కలు విరిగేలా కష్టపడ్డా గట్టెక్కలేకపోయాం. అప్పుల భయానికి నా బిడ్డ ఎంతో కుమిలిపోయేవాడు. దీనికి అనారోగ్యం కూడా తోడవడంతో ప్రాణం తీసుకున్నాడు. చిన్నారులు అనాథలయ్యారు. అన్యాయం జరిగిపోయింది నాయనా..     
– నాగన్న (మృతుడు పెద్ద రంగన్న తండ్రి)

పెద్ద దిక్కును కోల్పోయాం.. 
మా ఇంట్లో అమ్మనాన్న తర్వాత కుటుంబ భారాన్ని మా అన్నే భుజాన వేసుకున్నాడు. సేద్యం చేస్తూ మమ్మల్ని బతికిస్తూ వచ్చాడు. పంటలు పండక తీవ్రంగా నష్టపోయి అప్పుల పాలయ్యాం. ప్రాణాలు తీసుకోవడానికి అప్పులే  ప్రధాన కారణం. ఇంటి పెద్దదిక్కును కోల్పోయాం.
    – చిన్న రంగన్న (మృతుడి తమ్ముడు)

కరువు మండల మైనా ఏం లాభం?
గత సెప్టెంబర్‌లో పెద్దకడబూరు మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించినా ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయమూ లేదు. వరుస కరువులతో చితికిపోయిన తమను ప్రభుత్వం ఆదుకుంటుందన్న భరోసా కానరాక  యువరైతు పెద్ద రంగన్న బలవన్మరణానికి పాల్పడ్డాడు.        
–  వెంకటేశ్వర్లు, రైతు 

యువరైతు బలి
యర్రగొండపాలెం: వరుసగా మూడేళ్లు పాటు పంటలు పండక అప్పుల పాలు కావడం, రుణం తీర్చే దారి కానరాక ప్రకాశం జిల్లాలో ఓ యువరైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యర్రగొండపాలెం మండలం పందివానిపల్లెకు చెందిన గోపు వెంకటరెడ్డి (35) తనకున్న 1.22 ఎకరాల పొలంతోపాటు మరో మూడెకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. అదునులో వర్షాలు కురవకపోవడం, పొలంలో బోర్లు ఎండి పోవడంతో మిరప పంట చేతికి అందలేదు. తక్కువ నీటితో సాగు చేద్దామని మొక్కజొన్న వేసినా తెగులు సోకడంతో హతాశుడయ్యాడు. గత మూడేళ్లుగా పెట్టుబడికి తెచ్చిన అప్పులు కూడా తీరకపోవడం, రుణదాతల ఒత్తిడి పెరగడంతో మానసిక వ్యధకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో 15 రోజుల క్రితం తన ముగ్గురు పిల్లలను పుల్లలచెరువు మండలం సి.కొత్తపల్లిలోని అత్త వారి ఇంట్లో అప్పగించి భార్యతో కలసి వరి కోతల కోసం గుంటూరు జిల్లా కారంపూడికి వెళ్లాడు. అక్కడ పని చేయలేక ఒంటరిగా తిరిగొచ్చాడు. అనంతరం పనులు ముగించుకొని పుట్టింటికి చేరుకున్న భార్య అంజమ్మ మంగళవారం ఉదయం భర్తకు ఫోన్‌ చేసినా స్పందించకపోవడంతో పొరుగు వారికి ఫోన్‌ చేసింది. వారు ఇంట్లోకి వెళ్లి చూడగా వెంకటరెడ్డి చీరతో ఉరి వేసుకొని చనిపోయినట్లు గుర్తించారు. ఆదివారం ఉదయం తరువాత వెంకటరెడ్డి గ్రామంలో కనిపించ లేదని, బహుశా అదే రోజు ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని స్థానికులు తెలిపారు. మృతుడికి 11 ఏళ్ల వయసున్న కుమారుడు శివారెడ్డితోపాటు 9, 7 సంవత్సరాల వయసున్న కుమార్తెలు సుచిత్ర, లక్ష్మి ఉన్నారు. 

ఉసురు తీసిన అప్పులు..
వెంకటరెడ్డికి దాదాపు రూ.6 లక్షల మేర అప్పులు ఉన్నట్లు మృతుడి భార్య తెలిపింది. 2016లో యర్రగొండపాలెంలోని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో మృతుడు రూ.1.10 లక్షలు రుణం తీసుకున్నాడు. వడ్డీతో కలిసి ఇది దాదాపు రూ 1.50 లక్షల వరకు ఉండవచ్చని భావిస్తున్నారు. మరోవైపు ప్రైవేట్‌ అప్పులు కూడా ఉండటం, వాటిని తీర్చాలని ఒత్తిడి పెరగడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు పేర్కొంటున్నారు.

ప్రాణం తీసిన అప్పులు
ఆదోని/టౌన్‌/మంత్రాలయం/పెద్దకడబూరు: సాగు కోసం చేసిన అప్పు యమపాశమైంది. కరువు కుంగదీయగా ఏటా రుణఊబిలో కూరుకుపోవడం అన్నదాత వెన్ను విరిచింది. ఆదుకునే దిక్కు కానరాక ఆ రైతు దంపతులు పురుగుల మందు తాగారు. భర్త ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోగా భార్య పరిస్థితి విషమంగా ఉంది. కర్నూలు జిల్లా పెద్దకడబూరులో చోటు చేసుకున్న ఈ విషాద ఘటన అందరినీ కలచివేసింది. 

భార్య కళ్లెదుటే పురుగుల మందు తాగడంతో...
పెద్దకడబూరు గ్రామానికి చెందిన కురువ పెద్ద రంగన్న తన తల్లి నారాయణమ్మ పేరుతో ఉన్న 4.50 ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నాడు. వర్షాభావం కారణంగా ఏటా నష్టపోవడం మానసికంగా కుంగదీసింది. ఈ నేపథ్యంలో అప్పులు ఎలా తీర్చాలి? వైద్య చికిత్స కోసం డబ్బు ఎక్కడి నుంచి తేవాలనే విషయంపై భార్య సరస్వతి అలియాస్‌ పద్మతో సోమవారం రాత్రి వాగ్వాదం జరిగినట్లు సమాచారం. బంధువులు వచ్చి ఇద్దరికీ సర్ది చెప్పినా పెద్దరంగన్న బలవన్మరణమే శరణ్యమని భావించాడు. మంగళవారం ఉదయం మిరప పంటను మార్కెట్‌కు తరలించేందుకు బస్తాల్లో సిద్ధం చేసిన అనంతరం ఇంటికి చేరుకుని భార్య ఎదుటే పురుగుల మందు తాగాడు. దీంతో పెద్ద రంగన్న భార్య కూడా పురుగుల మందు డబ్బాను లాక్కుని బలవంతంగా తాగింది. దీన్ని గుర్తించిన స్థానికులు వారిని ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పెద్దరంగన్న చనిపోగా పద్మ పరిస్థితి విషమంగా ఉంది. పెద్దరంగన్న మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ దంపతులకు పదేళ్ల లోపు వయసున్న ముగ్గురు చిన్నారులు ఉండటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

పెట్టుబడులు మట్టిపాలు..
నిరుడు ఖరీఫ్‌లో ఉల్లి 90 బస్తాల దాకా దిగుబడి వచ్చినా ధరలు లేకపోవడంతో పెద్దరంగన్న దాదాపు రూ.40 వేల వరకు నష్టపోయాడు. ఎకరం పొలంలో వేసిన మిరపకు జెమిని వైరస్‌ సోకడంతో రూ.2 లక్షలు దాకా పెట్టుబడి మట్టి పాలైంది. వర్షాభావం, గులాబీరంగు పురుగు ఆశించడంతో పత్తి కూడా దెబ్బ తింది. దీంతో మూడు ఎకరాల్లో పత్తి పంటను గొర్రెల మేత కోసం వదిలేశాడు. పెద్ద రంగన్న స్థానిక ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో  2016లో పంట రుణం రూ.1.50 లక్షలు తీసుకున్నాడు. ప్రస్తుతం వడ్డీతో కలిపి అప్పు దాదాపు రూ.1.80 లక్షలకు చేరుకుంది. ఇది కాకుండా బయట మరో రూ.4 లక్షల మేరకు అప్పు చేశాడు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు అఖిల (7), అజయ్‌ (5), ఓంకార్‌(3) ఉన్నారు. చెట్టంత కొడుకు తన కళ్లెదుటే శాశ్వతంగా కళ్లు మూయగా కోడలు మృత్యువుతో పోరాడుతుండటాన్ని చూసి పెద్ద రంగన్న తల్లిదండ్రులు నాగన్న, నారాయణమ్మ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top