విజయవాడ బస్టాండ్‌లో తెలంగాణ ఆర్టీసీ బస్సు వద్ద ప్రయాణికుల రద్దీ
కీలకమైన సంక్రాంతి సీజన్‌లో ముఖం చాటేసిన మన ఆర్టీసీ
హైదరాబాద్ నుంచి ఏపీకి ఏపీఎస్ ఆర్టీసీ కేవలం 200 సర్విసులే
ప్రైవేటు ట్రావెల్స్ మాఫియాతో కూటమి ప్రభుత్వ నేత కుమ్మక్కు
టికెట్ రేట్లు ఐదారు రెట్లు పెంచేసి రూ.2 వేల కోట్ల దోపిడీకి స్కెచ్
ఏపీకి ఏకంగా 6,430 స్పెషల్ బస్ సర్విసులు తిప్పి టీఎస్ ఆర్టీసీ పండుగ
సాక్షి, అమరావతి: పండుగ ముసుగులో ఓవైపు టీడీపీ నేతలు కోడిపందేలు, కేసినోలు, గుండాట, కోత ముక్కలాట ఆడిస్తూ పండుగ నాలుగు రోజులు రూ.వేల కోట్లు దండుకున్నారు. మరోవైపు చంద్రబాబు ప్రభుత్వం ప్రయాణికుల రద్దీకి తగ్గట్టు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయకుండా ప్రైవేటు ట్రావెల్స్‌కు పెద్దపీట వేసింది. ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు ప్రయాణికులను నిలువుదోపిడీ చేస్తుంటే పట్టించుకోకుండా యాజమాన్యాల నుంచి రూ.వందల కోట్లు దండుకుని అవినీతికి కొత్తదారులు తెరిచింది. ఇలా దేన్నీ వదిలిపెట్టకుండా అందినకాడికి టీడీపీ నేతలు దోచుకునేలా చంద్రబాబు ప్రభుత్వం దగ్గరుండి ప్రోత్సహించింది. మరోవైపు సంక్రాంతికి ఏపీఎస్‌ఆర్టీసీ ముఖం చాటేసింది. ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా దోపిడీకి కొమ్ము కాసింది. మరోవైపు తెలంగాణ ఆర్టీసీ మాత్రం సంక్రాంతి సీజన్‌ను సది్వనియోగం చేసుకోవడం గమనార్హం.
టీఎస్ ఆర్టీసీ 6 వేల సర్విసులు
సంక్రాంతికి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేవారిలో అత్యధికులు హైదరాబాద్ నుంచే బయలుదేరుతారు. అందువల్లే హైదరాబాద్ నుంచి ఏపీలో వివిధ ప్రాంతాలకు బస్సు సర్విసులు నడపటంపై నిర్వాహకులు దృష్టి సారిస్తారు. ఏపీఎస్ ఆర్టీసీ మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరించడం విస్మయపరిచింది. గత కొన్నేళ్లుగా సంక్రాంతి సీజన్‌లో హైదరాబాద్ నుంచి రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు 2 వేలకుపైగా స్పెషల్ బస్ సర్విసులను తిప్పిన ఏపీఎస్ ఆర్టీసీ ఈ ఏడాది మాత్రం కేవలం 200 సర్విసులకే పరిమితం చేసినట్లు ప్రకటించడం గమనార్హం. టీడీపీ కూటమి ప్రభుత్వంలో కీలక నేత ఒకరు ప్రైవేటు ట్రావెల్స్ మాఫియాతో కుమ్మక్కు కావడమే దీనికి కారణమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో సంక్రాంతి సీజన్‌లో టికెట్ రేట్లను ఏకంగా ఐదారు రెట్లు అదనంగా పెంచేసి ఏకంగా రూ.2 వేల కోట్ల దోపిడీకి ప్రైవేటు ట్రావెల్స్ పన్నాగం పన్నింది. అందుకు రాష్ట్ర ప్రభుత్వంలో కీలక నేత ఒకరు వత్తాసు పలికారు.
ఆయనకు భారీగా ముడుపులు ముట్టజెప్పడమే దీనికి కారణం. దాంతో ఈ ఏడాది ఏపీఎస్‌ఆర్టీసీ హైదరాబాద్ నుంచి సంక్రాంతి స్పెషల్ బస్సులకు భారీగా కోత పెట్టింది. కేవలం 200 స్పెషల్ సర్వీసులతో చేతులు దులుపుకొంది. దీనిపై తీవ్ర విమర్శలు రేగడంతో ఏటా మాదిరిగానే హైదరాబాద్ నుంచి స్పెషల్ బస్సు సర్విసులను నిర్వహిస్తామని తూతూమంత్రంగా ప్రకటన చేసి పక్కకు తప్పుకుంది. హైదరాబాద్ నుంచి రాష్ట్రంలో ఏ ప్రాంతాలకు ఎన్ని సర్విసులు అనే వివరాలను మాత్రం వెల్లడించలేదు. తద్వారా ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియాకు టీడీపీ కూటమి ప్రభుత్వం వత్తాసు పలికింది. మరోవైపు సంక్రాంతి సీజన్‌ను పూర్తి స్థాయిలో సది్వనియోగం చేసుకుంటూ టీఎస్ ఆర్టీసీ ఏపీకి పెద్ద ఎత్తున బస్సు సర్విసులను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు టీఎస్ ఆర్టీసీ ఏకంగా 6,430 సంక్రాంతి స్పెషల్ సర్విసులను తిప్పడం గమనార్హం.


