సాక్షి, తిరుపతి: రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న కోటి సంతకాల సేకరణ విజయవంతంగా ముగిసిందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన పార్టీలకు అతీతంగా ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పారు.
టీడీపీకి ఓటు వేసిన వారు, ఆ పార్టీ సానుభూతిపరులు కూడా కోటి సంతాకాల్లో భాగమయ్యారని పేర్కొన్నారు. పేదవర్గాల పిల్లలు డాక్టర్లు కావాలన్న కలలకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూపం ఇచ్చిందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకు వచ్చింది. చాలా చోట్ల 60-70 శాతం పనులు పూర్తయ్యాయి. పేద పిల్లలు డాక్టర్లు అవుతారని ప్రజలు ఆశించారని పెద్దిరెడ్డి తెలిపారు.
మదనపల్లి ప్రభుత్వ మెడికల్ కాలేజి పై కుక్కలు మొరుగుతూ ఉంటాయి. రూ.70కోట్లు పైగా ఖర్చు చేశారు ఇప్పటి వరకు రూ. 27 కోట్లు బిల్లులు చెల్లించారు అని వ్యాఖ్యానించారు. టిడిపి ప్రభుత్వం చేసే అవినీతి చాలా పెద్దది. దానిపై దృష్టి మళ్లించడానికి మాపై బురద చల్లుతున్నారు. సర్పంచ్ నుంచి కిందిస్థాయి నాయకులు కూడా విమర్శలు చేసే స్థితికి చేరుకున్నారు అని మండిపడ్డారు.
జిల్లాలో తమ గురించి ఎవరిని అడిగినా తాము చేసిన సేవల గురించి చెబుతారని ఆయన పేర్కొన్నారు. మెడికల్ కాలేజీలను ప్రభుత్వం పూర్తిచేయాలి. పేద వర్గాల పిల్లలు డాక్టర్లు అయ్యేందుకు ప్రభుత్వాలు సహకరించాలని పెద్దిరెడ్డి అన్నారు.


