కదిలిన డొంక | Housing officials moved into corruption action | Sakshi
Sakshi News home page

కదిలిన డొంక

Nov 15 2013 2:38 AM | Updated on Sep 2 2017 12:36 AM

అవినీతి హౌసింగ్ అధికారుల డొంక కదిలింది. హౌసింగ్ ప్రత్యేకాధికారి విచారణలో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ప్రొద్దుటూరు టౌన్, న్యూస్‌లైన్:  అవినీతి హౌసింగ్ అధికారుల డొంక కదిలింది.  హౌసింగ్ ప్రత్యేకాధికారి విచారణలో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.  దాదాపు రూ.39.42 కోట్ల  అవినీతి జరిగినట్లు విచారణలో తేలింది.  ఇప్పటికే అరెస్టు అయిన ఏఈలతో పాటు అవినీతి జరిగిన కాలంలో పని చేసిన డీఈలు, ఈఈలు, పీడీపై కూడా వేటు వేసేందుకు జిల్లాకలెక్టర్ రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.   
 
  ప్రొద్దుటూరు రూరల్, అర్బన్ పరిధిలో పేదలు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునేందుకు అమృతామయి కాలనీలో 356 ఎకరాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇందిరమ్మ ఫేజ్-1 అర్బన్ పరిధిలో 873 ప్లాట్లు వేశారు.  అందులో 30 ప్లాట్లను పార్కుకు కేటాయించారు. రూరల్ పరిధిలో 656 గృహాలు మంజూరయ్యాయి. ఒక్కో గృహానికి  ప్రభుత్వం రూ.40 వేలు వెచ్చించి అనుమతి పొందిన కాంట్రాక్టర్ల ద్వారా నిర్మించారు. ఈ గృహాల్లో చాలా వరకు లబ్ధిదారులకు అందలేదు. రాజకీయ నేతల అనుచరులు కాంట్రాక్టర్లుగా అవతారమెత్తి వారి అనుకూలురకు గృహాలు నిర్మించి ఇచ్చారు.
 దీంతో చాలా మంది అర్హులైన లబ్ధిదారులు అధికారుల చుట్టూ కాళ్లు అరిగేలా నేటికీ తిరుగుతున్నారు. కాగా ఈ గృహాల్లో చేరక ముందే   గోడలు బీటలువారడంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేసి అందులో  చేరేందుకు సుముఖత చూపలేదు.  ఇందిరమ్మ ఫేజ్-2 అర్బన్ పరిధిలో 2059 ప్లాట్లు, రూరల్ పరిధిలో 650 ప్లాట్లు వేశారు.  ఈ గృహాలను లబ్ధిదారుడే సొంతంగా నిర్మించు కోవాలన్న నిబంధనను ప్రభుత్వం పెట్టింది. గృహాలు నిర్మించుకునేందుకు వివిధ దశలలో  రూ.80 వేలు మంజూరు చేసింది. వీటిల్లో కూడా చాలా వరకు ఎలాంటి పత్రాలు లేకుండా నిర్మించుకున్న గృహాలు,  నిబంధనలకు విరుద్దంగా బిల్లులు మంజూరు చేసిన గృహాలు ఉన్నాయ.
 
 ఫేజ్-2లోనే 1730 గృహాలు ఐహెచ్‌ఎస్‌డీపీ కింద మంజూరు కావడంతో వాటికి సంబంధించి ఒక్కో గృహానికి అదనంగా రూ.30 వేలను  ప్రభుత్వం మంజూరు చేసింది. ఆ సమయంలో పని చేసిన ఏఈలు  సంజీవరాయుడు, రామచంద్రారెడ్డిలతోపాటు వర్క్ ఇన్‌స్పెక్టర్లు రమణ, గురువయ్య రూ.66 లక్షల మేరకు అవినీతికి  పాల్పడ్డారన్న ఫిర్యాదు మేరకు గత ఏడాది సెప్టెంబర్ నెలలో పోలీసులు  అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరిచారు.  ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న కలెక్టర్ విచారణకు ఆదేశించారు.
 
 విచారణలో తేలిన అవినీతి
 అర్బన్ పరిధిలో లబ్ధిదారులకు మంజూరైన 110 గృహాలను  పక్కదారి పట్టించి   రూ.50 లక్షలు,   రూరల్ పరిధిలో 80 గృహాలను విక్రయంచి  రూ.20లక్షలకు పైగా సొమ్ము చేసుకున్నట్లు  ప్రత్యేకాధికారి సుధాకర్‌రెడ్డి విచారణలో తేలింది. అలాగే నిబంధనలు పాటించకుండా 700 గృహాలకు దాదాపు 1.5కోట్లు మంజూరు చేసినట్లు విచారణ నివేదికలో పొందుపరిచారు. అలాగే బినామీల చేతిలోకి వెళ్లిన గృహాలు, పత్రాలు లేకుండా మంజూరు చేసిన 4,500 గృహాల విలువ రూ. కోట్లుగా తేల్చారు. విచారణ సమయంలో ప్రత్యేకాధికారికి తీవ్ర స్థాయిలో  ఒత్తిళ్లు వచ్చినట్లు తెలుస్తోంది.  
 
 అవినీతి అధికారులపై చర్యలకు రంగం సిద్ధం
 గతంలో అరెస్టయిన  ఏఈలతోపాటు అవినీతిలో పాలుపంచుకుని ప్రస్తుతం  వివిధ ప్రాంతాలలో పనిచేస్తున్న  డీఈలు, ఈఈలు కలిపి మొత్తం 12 మందిపై  వేటు వేసేందుకు  కలెక్టర్  రంగం సిద్ధం చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement