బిల్లులివ్వండి బాబూ! | Contractors protest in front of RWS office | Sakshi
Sakshi News home page

బిల్లులివ్వండి బాబూ!

Mar 26 2026 3:28 AM | Updated on Mar 26 2026 3:28 AM

Contractors protest in front of RWS office

ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఎన్‌సీ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న కాంట్రాక్టర్లు

సాక్షి, అమరావతి: చేసిన పనులకు బిల్లులు చెల్లించని గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం (ఆర్‌డబ్ల్యూఎస్‌) తీరుకు నిరసనగా కాంట్రాక్టర్లు విజయవాడలోని చీఫ్‌ ఇంజినీర్‌ కార్యాలయం ఎదుట బుధవారం ఆందోళన చేశారు. కార్పొరేట్‌ కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌లు ఇవ్వడంతోపాటు వాళ్లు చేసిన పనులకు ఎప్పుటికప్పుడే బిల్లులు చెల్లిస్తూ.. చిన్న కాంట్రాక్టర్లకు మాత్రం నెలల తరబడి చెల్లింపులు నిలిపివేయడం దుర్మార్గమంటూ నల్ల రిబ్బన్లు ధరించి, ప్లకార్డులు ప్రదర్శిస్తూ ధర్నా చేపట్టారు. 

ప్రభుత్వ పనుల కోసం తమ సొంత ఆస్తులు కుదవ పెట్టి తెచ్చిన అప్పులు తీర్చలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని, గత్యంతరం లేక రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నామని కాంట్రాక్టర్లు పేర్కొన్నారు. ‘చిన్న కాంట్రాక్టర్లకు న్యాయం చేయాలి.. పెండింగ్‌ బిల్లుల్ని మార్చి నెలాఖరులోగా చెల్లించాలి’ అంటూ నినాదాలు చేశారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ విభాగంలో జరిగిన పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఈ వారంలో రూ.707 కోట్లు విడుదల చేసి.. ఆ మొత్తాన్ని మొబిలైజేషన్‌ అడ్వాన్సులతో సహా కార్పొరేట్‌ సంస్థలకు రూ.562 కోట్లు చెల్లించారని చెప్పారు. 

వందలాది మంది చిన్న కాంట్రాక్టర్లకు రూ.850 కోట్ల వరకు చెల్లించాల్సి ఉండగా మొత్తం బకాయిల్లో కేవలం పది శాతం రూ.85.88 కోట్లు విడుదల చేశారంటూ దుయ్యబట్టారు. 20 రోజుల క్రితం పెట్టిన బిల్లులకు కూడా కార్పొరేట్‌ సంస్థలకు చెల్లింపులు పూర్తయ్యాయని, తమకు మాత్రం 16 నెలలుగా చెల్లించాల్సిన బిల్లులు కూడా చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన కాంట్రాక్టర్లు సాయంత్రం వరకు ఈఎన్‌సీ కార్యాలయం ఎదుట ఆందోళన కొనసాగించారు. 

ఈఎన్‌సీ గాయత్రిదేవిని కలిసి వినతిపత్రం అందజేయగా.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఆ తర్వాత పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌తో కాంట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి కోనేరు శ్రీనివాస ప్రసాద్, ఉపాధ్యక్షుడు సమావేశమై తమ సమస్యలు వివరించారు. మార్చి 31లోగా వీలైనన్ని బకాయిలు చెల్లించేలా చర్యలు చేపడతామని శశిభూషణ్‌కుమార్‌ హామీ ఇచ్చారు.  

Advertisement
 
Advertisement
Advertisement