'దారీ'తెన్నూ లేక.. | Severe delays and negligence in road construction works in Telangana | Sakshi
Sakshi News home page

'దారీ'తెన్నూ లేక..

Jun 26 2026 2:34 AM | Updated on Jun 26 2026 2:34 AM

Severe delays and negligence in road construction works in Telangana

నిర్వహణ అంతంతే... వర్షాలతో దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణా అదే తీరు

నిర్మాణ పనుల్లో తీవ్ర జాప్యం, నిర్లక్ష్యం 

పాత బిల్లుల పెండింగ్‌తో టెండర్లలో పాల్గొనని కాంట్రాక్టర్లు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో గ్రామీణ రోడ్ల నిర్మాణం, నిర్వహణ..వర్షాలతో దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ పనుల్లో తీవ్ర జాప్యం, నిర్లక్ష్యం కారణంగా గ్రామీణ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లాలు, మండలాలు, గ్రామ స్థాయిలో వరదలతో పాడైన రోడ్ల పునరుద్ధరణ, గ్రామీణ రోడ్ల నిర్మాణం నిర్వహణ ప్రక్రియ తరచుగా నిధుల కొరత, కాంట్రాక్టర్ల స్పందన లేకపోవడం, అనుమతుల జాప్యం కారణంగా తీవ్రంగా మందగించాయి. దీంతో పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ శాఖల పరిధిలో రోడ్ల నిర్మాణం, నిర్వహణల తీరుతెన్నులు మందగించాయి. 

పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగం (పీఆర్‌ఈడీ) రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ రహదారుల నిర్మాణం, అధునీకరణ, నిర్వహణ పనులను పర్యవేక్షిస్తోంది. ఈ విభాగ పరిధిలో మొత్తం రహదారి నెట్‌వర్క్‌ 68,708 కి.మీ కాగా, అందులో బీటీ పొడవు 26,503 కి.మీ కాగా, మిగిలిన పొడవును బీటీ ప్రమాణాలకు అనుగుణంగా ఆధునీకరించాల్సి ఉంది. అయితే పనులు మాత్రం అంతంతమాత్రంగానే జరుగుతున్నాయి.గ్రామాల్లో రవాణా సదుపాయాలను పెంచేందుకు మండలాలు, హాబిటేషన్ల మధ్య, దగ్గరలోని పట్టణాలకు అవసరమైన రోడ్‌ కనెక్టివిటీ పెంచి గ్రామీణ ప్రజలకు నాణ్యమైన జీవితం, రవాణా సౌకర్యాలు కల్పించాలనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం దెబ్బతింటోంది.  

నిర్లక్ష్యం నీడలో పల్లెబాటలు  
సీఆర్‌ఆర్‌ ప్రోగ్రాం కింద కొత్త గ్రామీణ రోడ్లు, బీటీ (బిటుమినియస్‌) రోడ్లకు అప్‌గ్రేడేషన్‌ లేదా సీసీ (సిమెంట్‌ కాంక్రీట్‌) ప్రమాణాలకు అప్‌గ్రేడేషన్, ప్రస్తుతమున్న రోడ్ల విస్లరణ, పాడైపోయిన రోడ్ల పటిష్టత వంటివి చేపట్టాల్సి ఉంది. దీని కింద మొత్తం 4,813.12 కి.మీ.కు 2,563 పనులు చేపట్టగా, (రూ.4,566.20 కోట్లు), 61.92 కి.మీ. పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఆయా పనులకు నిధులు మంజూరైనా, క్షేత్రస్థాయిలో టెండర్లు పడకపోవడం, కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం, కాంట్రాక్టర్ల పాత బకాయిలు చెల్లించకపోవడం వంటి కారణాలతో పనులు వేగం పుంజుకోవడం లేదనే విమర్శలున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలకు కనెక్టివిటీ మెరుగుపరచడానికి సుమారు రూ.6,478 కోట్ల అంచనా వ్యయంతో హైబ్రిడ్‌ అన్యూటీ మోడ్‌ (హ్యామ్‌) విధానానికి ప్రభుత్వం ఆమోదం తెలిపినా, అనేక కారణాలతో దీని కింద పనులేవి టెండర్ల దశ దాటి ఇంకా ముందుకు సాగులేదు.  

ఏ రోడ్డు పని చూసినా అంతే... 
గ్రామీణ రోడ్ల నిర్వహణ (ఎంఆర్‌ఆర్‌) కింద 9,662.87 కి.మీ. దూరానికి రూ.4,150 కోట్ల అంచనా వ్యయంతో మొత్తం 3,913 పనులకు మంజూరు ఇచ్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 67.37 కి.మీ. పనులు మాత్రమే పూర్తయ్యాయి.  
⇒ ఎఫ్‌డీఆర్‌ గ్రాంట్‌ ముఖ్య ఉద్దేశం భారీవర్షాలు, వరదలతో దెబ్బతిన్న గ్రామీణ రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టడం, అత్యవసరంగా వీటి పునరుద్ధరణ, గుంటలు పూడ్చడం, బ్రీచ్‌ ఫిల్లింగ్‌ వంటివి కాగా...దీని కింద రూ.494.66 కోట్ల అంచనా వ్యయంతో 278.16 కి.మీ.కు మొత్తం 543 పనులకు మంజూరు ఇచ్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 23.25 కి.మీ. పనులు మాత్రమే పూర్తయ్యాయి.  
⇒ ఎస్‌డీఆర్‌ఎఫ్‌ కార్యక్రమం కింద 624.48కి.మీ.కు రూ.30.37 కోట్ల అంచనా వ్యయంతో 641 పనులు చేపట్టగా...ఈ ఆర్థిక సంవత్సరంలోనే వీటిని పూర్తి చేయాలని ఆదేశించారు 

రోడ్ల కనెక్టివిటీ లేని పంచాయతీలు 354  
మొత్తం 12,780 గ్రామ పంచాయతీల్లో 12,426 జీపీలకు అన్ని కాలాలకు అనువైన రోడ్లు అనుసంధానం కాగా, 352 పంచాయతీలు కనెక్టివిటీ లేకుండా ఉన్నాయి. వీటిలో 121 జీపీలను కలిపే రహదారులు సీఆర్‌ఆర్‌/ఎస్‌డీఎఫ్‌ కింద మంజూరు చేశారు. 35 పంచాయతీలను పీఎంజీఎస్‌వై–4 కింద ప్రతిపాదించారు. 171 పంచాయతీలను హ్యామ్‌ మొదటిదశ–1 కింద ప్రతిపాదించారు. కాగా...అమ్రాబాద్‌ మండలంలోని సార్లపల్లి, కొండమల్లేపల్లి మండలంలోని గుడితండా జీపీలకు రోడ్డు వేయడం ఆచరణ సాధ్యం తేల్చారు. 

ఇక హాబిటేషన్ల విషయానికొస్తే... 
– రాష్ట్రంలోని మొత్తం 23,170 హాబిటేషన్లకుగాను 21,276 కనెక్ట్‌ కాగా 1,894 హాబిటేషన్లు కనెక్ట్‌ కాలేదు. 
– 1,894లో 612 హాబిటేషన్లను కలిపే రోడ్లకు వివిధ గ్రాంట్ల కింద మంజూరునిచ్చారు. వీటిలో 139 అనుసంధానం సాధ్యం కాలేదు 
– మిగిలిన 1,143 హాబిటేషన్లను రోడ్లను అనుసంధానించాల్సి ఉంది. వీటిలో 770 ట్రైబల్‌ హాబిటేషన్లున్నాయి. వీటికి 1,193 కి.మీ. పొడవున కనెక్టివిటీ అవసరం. దీని అంచనా వ్యయం రూ.1,550 కోట్లు. 
– అటవీ ప్రాంతాల్లో, మున్సిపాలిటీల్లో 139 హాబిటేషన్లను ఆచరణ సాధ్యం కానివిగా పరిగణిస్తున్నారు  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement