మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న ఆర్‌డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్లు
విజయవాడలో ఆర్‌డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్ల ధర్నా
చంద్రబాబు సర్కారు తీరుపై ఆగ్రహం
బడా కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరుతో దోచిపెడుతున్నారని ధ్వజం
సాక్షి, అమరావతి/మంగళగిరి టౌన్: గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం(ఆర్‌డబ్ల్యూఎస్) పరిధిలో గ్రామాల్లో చేసిన పనులకు బిల్లులు చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని చిన్న తరహా కాంట్రాక్టర్లు మంగళవారం విజయవాడ ధర్నా చౌక్‌లో ఆందోళన చేశారు. మొదట పనులు చేసిన వారికి మొదట బిల్లులు చెల్లించే విధానం అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. పనులు మొదలు పెట్టక ముందే బడా కార్పొరేట్ సంస్థలకు మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరుతో దోచిపెడుతున్న సర్కారు తమకు మాత్రం పనులు పూర్తయినా బిల్లులు చెల్లించడం లేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వం తక్షణం బిల్లులు చెల్లించకుంటే తమకు ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు.
మార్చిలో ధర్నా చేస్తే ఏప్రిల్ పదికల్లా చెల్లిస్తామన్నారు..
దాదాపు 750 మంది చిన్న తరహా కాంట్రాక్టర్లకు రూ.1,050 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉండగా సర్కారు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వం విడుదల చేసిన రూ.707 కోట్లలో మొబిలైజేషన్ అడ్వాన్స్‌లతో కలిపి రూ. 562 కోట్లు కార్పొరేట్ సంస్థలకే ప్రభుత్వం చెల్లించిందని దుయ్యబట్టారు. చిన్న తరహా కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బకాయిల్లో పది శాతం కూడా చెల్లించలేదన్నారు. పెండింగ్ బిల్లుల చెల్లింపుల కోసం తాము మార్చి 25 నుంచి 31 మధ్య ఆరు రోజుల పాటు ఆర్‌డబ్ల్యూఎస్ ఈఎన్‌సీ కార్యాలయం ఎదుట నిరసన దీక్ష చేపట్టినప్పుడు ఏప్రిల్ 10 కల్లా డబ్బులు విడుదల చేయనున్నట్టు అధికారులు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే ఇప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బిల్లుల చెల్లింపు ఆలస్యంతో సమస్య జఠిలం
బిల్లుల చెల్లింపులో సర్కారు ఆలస్యం చేయడంతో జలజీవన్ మిషన్ 2.0 మార్గదర్శకాలు మారిపోయి, తమ సమస్య మరింత జఠిలంగా మారిందని కాంట్రాక్టర్లు మండిపడ్డారు. జలజీవన్ మిషన్ తాజా మార్గదర్శకాల ప్రకారం బిల్లుల చెల్లింపులు జరగాలంటే.. పాత బిల్లులను మళ్లీ కొత్త పద్దతిలో అప్‌లోడ్ చేయాలంటున్నారని, దానికి సంబంధించిన విధివిధానాలూ తమకు తెలియదని అధికారులు సమాధానమిస్తున్నారని కాంట్రాక్టర్లు ఆవేదన చేశారు. తమ బిల్లుల చెల్లింపు పూర్తయ్యే వరకు కొత్త బిల్లులు ప్రాసెస్ వద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధర్నాలో నవ్యాంధ్ర ఆర్‌డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కోనేరు శ్రీనివాస్ ప్రసాద్, అసోషియేషన్ అధ్యక్షులు రామలింగరాజు, ఉపాధ్యక్షులు వెంకటేశ్వరరావు, కార్యదర్శులు శేషగిరిరావు, రాజు, సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జనసేన కార్యాలయం వద్ద కాంట్రాక్టర్ల ఆందోళన
’కొన్ని నెలలుగా పెండింగ్‌లో ఉన్న జలజీవన్ మిషన్ (జేజేఎం) బిల్లులను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ నవ్యాంధ్ర ఆర్‌డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ సభ్యులు మంగళవారం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. పలువురు అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ ఆస్తులు కుదవబెట్టి పనులు చేశామని, బిల్లులు రావడం లేదని ఆవేదన చెందారు. మంత్రి పవన్‌కళ్యాణ్‌ను కలిసే అవకాశం కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. తక్షణం నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 16న మంత్రి అందుబాటులోకి వస్తారని, అప్పుడు కలిసే అవకాశం కల్పిస్తామని పార్టీ ప్రతినిధులు హామీ ఇచ్చినట్లు కాంట్రాక్టర్లు తెలిపారు.


