హార్సిలీహిల్స్‌కు కోవిడ్‌ ముప్పు!

Horsley Hills Affected Due To Corona - Sakshi

ఆంధ్రా ఊటీ హార్సిలీ హిల్స్‌. ఇది ప్రఖ్యాత వేసవి విడది కేంద్రం. వేసవిలో సేద తీరడానికి ఇక్కడికి పలు రాష్ట్రాలతోపాటు విదేశాల నుంచి పర్యాటకులు వచ్చి వెళుతున్నారు. వేసవి ప్రారంభమైన నేపథ్యంలో ఇటీవల కాలంలో కర్ణాటక పర్యాటకులతోపాటు విదేశీయులూ వచ్చి వెళుతున్నారు. ఆయా ప్రాంతాల్లో కోవిడ్‌ ఉన్న నేపథ్యంలో ఇక్కడి స్థానికులు, ఉద్యోగులకూ కోవిడ్‌ సోకే ప్రమాదం ఉంది.

సాక్షి, చిత్తూరు:  మండలంలోని హార్సిలీహిల్స్‌పై కోవిడ్‌ ముప్పు పొంచివుంది. ఇక్కడి పరిస్థితులు, వాతావరణం నేపథ్యంలో వ్యాధి ఉధృతమయ్యే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. హార్సిలీహిల్స్‌కు వస్తున్న సందర్శకుల్లో అత్యధికులు సరిహద్దులోని కర్ణాటకకు చెందినవారే. ఆ రాష్ట్రంలో కోవిడ్‌ అధికమైన పరిస్థితుల్లో హార్సిలీహిల్స్‌పై తీవ్ర ప్రభావం ఉంటుంది. బెంగళూరుకు చెందిన సందర్శకులు అత్యధికులు ఇక్కడికి వస్తున్నారు. ముందుగానే గదులను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుని ఇక్కడికి వస్తారు. విడిది చేసి తిరిగి వెళ్తారు.

ఈ పరిస్థితుల్లో వ్యాధి సోకిన వారు గదులను తీసుకుని విడిది చేసి వెళ్లే ప్రమాదం ఉంది. అలాంటి వారితో వ్యాధి ఒకసారిగా విజృంభించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. దీనికితోడు ఇటీవల కొండకు వస్తున్న సందర్శకుల్లో విదేశీయులు ఎక్కువగా ఉంటున్నారు. గతనెల రోజుల్లో ఇటలీ, బ్రిటన్‌ దేశాలకు చెందిన సందర్శకులు వచ్చి వెళ్లారు. అంతకుముందు కూడా కొందరు సందర్శకులు నాలుగైదురోజులు గడిపి వెళ్లారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రస్తుతం విదేశీ పర్యాటకుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో వ్యాధి వారి ద్వారా కూడా ప్రబలే ప్రమాదం ఉంది. ఇక్కడికి వచ్చే సందర్శకులను పరీక్షించేందుకు ఎలాంటి పరికరాలు ఏర్పాటు కాలేదు.  

ఆన్‌లైన్‌ మూసేయాలి 
హార్సిలీహిల్స్‌లో టూరిజంశాఖ 54కు పైగా అతిథిగృహాలను బార్, రెస్టారెంట్‌ను నిర్వహిస్తోంది. ప్రైవేటుగా మరో ముగ్గురు అతిథిగృçహాలను నిర్వహించుకుంటున్నారు. వీటిని తక్షణమే నిలిపివేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చి వెళ్లే వారి వివరాలు టూరిజంశాఖ వద్ద ఉంటా యి. టూరిజంశాఖ గదుల కేటాయింపును తాత్కాలికంగా నిలిపివేయడమేకాక, ప్రైవేటు అతిథిగృహలను మూసివేస్తే ప్రయోజనం ఉంటుంది. కొంతకాలం సందర్శకులను నిషేధించడం లేదా పరీక్షలు నిర్వహించాక అనుమతించడం చేయాల్సివుంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top