తొలి పీఠంపై ఆశలు | Hopes on the first Chair | Sakshi
Sakshi News home page

తొలి పీఠంపై ఆశలు

Aug 20 2013 7:02 AM | Updated on Apr 7 2019 4:30 PM

రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తయితే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి పదవి ఎవరిని వరిస్తుందనే చర్చ జిల్లా కాంగ్రెస్‌లో జోరుగా సాగుతోంది.

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తయితే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి పదవి ఎవరిని వరిస్తుందనే చర్చ జిల్లా కాంగ్రెస్‌లో జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, యూపీఏ సమన్వయ కమిటీ తెలంగాణపై ఏకగ్రీవ తీర్మానం చేయడంతో ఇక్కడి ప్రజల ఆకాంక్ష ..సుదీర్ఘమైన కల నెరవేరింది.దీంతో తెలంగాణ ముఖ్యపీఠం ఎవరికి దక్కుతుందన్న విషయంపై కాంగ్రెస్ వర్గాలు ఊహాగానాలు చేస్తున్నాయి. జిల్లాకు చెందిన పలువురు నేతలు రాష్ట్ర, జాతీయ స్థాయిలో కీలకంగా వ్యవహరించటమే  దీనికి ప్రధాన కారణం.  ఈ నేపథ్యంలోనే అందరి చూపు ఇందూరు పైన ఉన్న ట్టు చెప్పుకుంటున్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి పదవి రేసులో పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ ఉన్నట్లు పార్టీ శ్రేణు లు భావిస్తున్నాయి. జిల్లాకు చెందిన మరో ఇద్దరు నేతలు షబ్బీర్‌అలీ, కె.ఆర్.సురేష్‌రెడ్డిలకూ అవకాశాలు లేకపోలేదంటున్నారు. కాగా ముఖ్యనేతల్లో అగ్రగణ్యుడుగా డీఎస్‌కు పేరుంది.ప్రస్తుతం పార్టీ సమన్వయ కమిటీ సభ్యునిగా, ఎమ్మెల్సీగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌లో ముఖ్య భూమికను ఆయన పోషిస్తున్నారు.
 
 రెండు పర్యాయాలు 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని డాక్టర్ వైఎస్ రాజ శేఖర్‌రెడ్డి జోడితో పీసీసీ అధ్యక్షుడిగా డీఎస్ విజయ పథంలోకి నడిపించి అధికారంలోనికి తీసుకువచ్చారని అధిష్టానం వద్ద ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది. పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో ఇరుప్రాం తాల ముఖ్యనేతలతో పాటు జాతీయ స్థాయిలో సత్సంబంధాలను డీఎస్ కొనసాగించారు. సోనియాగాంధీకి నమ్మకమైన నాయకుల్లో ఒకరిగా డీఎస్ పేరు తెచ్చుకున్నారు. అదే విధంగా సోనియా  కోటరీలోని అహ్మద్ పటేల్, గులాం నబీ ఆజాద్, దిగ్విజయ్‌సింగ్ వంటి ముఖ్యనేతలతో ఆయనకు దగ్గరి సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి మరణాంతరం ఆ పీఠాన్ని అధిరోహించే జాబితాలో డీఎస్ పేరు ప్రముఖంగా ప్రచారంలో వచ్చింది. ఆ తరువాత ముఖ్యమంత్రులు మారినప్పడు, పీసీసీ అధ్యక్షులను మార్చాల్సి వచ్చినప్పడు కూడా డీఎస్ పేరు వినిపించింది.
 
 తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో రెండు ప్రాంతాలకు చెందిన నాయకుడిగా వ్యవహరించే ప్రయత్నం చేశారు. తెలంగాణ కోసం సాగిన ఉద్యమంలో భాగంగా పీసీసీ హోదాలో తటస్థ వైఖరిని ప్రదర్శించి ఇక్కడి ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ, అధిష్టానవర్గం వద్ద మాత్రం గట్టిగా తెలంగాణ వాణి వినిపించటంలో తీవ్ర కృషి చేసినట్టు ఆయ న స్వయంగా పేర్కొంటున్న వాదనలను బట్టి తెలుస్తోంది. ఢిల్లీకి వెళ్లిన ప్రతి సందర్భంలోనూ సోనియా గాంధీ, పలువురు నేతలను కలిసినప్పడు తెలంగాణపై పట్టుబట్టి, అవశ్యకతను వివరించటంలో విజ యం సాధించానని ఆయనే పలు మార్లు మీడియాతో ప్రస్తావించిన సందర్భాలు ఉన్నాయి.తెలంగాణ ప్రకటన తర్వాత సీఎం కిర ణ్ విభజనకు వ్యతిరేకంగా హైకమాండ్‌పై విమర్శలతో పాటు విద్యుత్తు, నీటి పంపకాలపై అనుమానాలు లేవనెత్తినప్పుడు డీఎస్ ఆయనపై ఘాటుగా స్పందించారు. తెలంగాణలో మరింతగా చాంపియన్ కావటం ద్వారా తొలి ముఖ్యమంత్రి పదవి సాధించే ప్రయత్నంలో భాగమేనన్న చర్చ సాగుతోంది. కాంగ్రెస్ వర్గాలతో పాటు జిల్లా రాజకీయ వాదుల్లో కూడా ఇదేవిషయంపై ప్రచారం జరుగుతోంది.
 
 సామాజిక కోటాపైనే షబ్బీర్, కేఆర్‌ల  ఆశలు
 సామాజిక వర్గం నేపథ్యంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి పదవి మాజీ మంత్రి, పార్టీ సమన్వయకర్త  షబ్బీర్‌అలీ, మాజీ స్పీకర్ కేఆర్ సురేష్‌రెడ్డిలకు దక్కవచ్చుననే అభిప్రాయం కాంగ్రెస్‌లో వ్యక్తమవుతోంది. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన చెన్నారెడ్డి, కోట్లా విజయభాస్కర్‌రెడ్డి, డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రి వర్గంలో షబ్బీర్‌అలీ సభ్యుడుగా పనిచేశారు. సంక్షేమం, మైనార్టీ, విద్యుత్, బొగ్గు, సమాచార శాఖలను షబ్బీర్‌అలీ నిర్వహించారు. గతంలో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జిగా పనిచేసిన గులాబినబీ ఆజాద్‌తో పాటు పలువురు జాతీయ నాయకులతో షబ్బీర్‌అలీకి సత్సంబంధాలు ఉన్నాయి.
 
 తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా మైనార్టీ వర్గానికి అవకాశం లభించినట్లయితే ఆ పీఠం దక్కవచ్చుననే ప్రచారం పార్టీ వర్గాల్లో సాగుతోంది. మాజీ స్పీకర్ కేఆర్ సురేష్‌రెడ్డి కూడా సామాజిక వర్గంలో భాగంగానే సీఎం పీఠంపై ఆశలు పెంచుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణపై కేంద్రం ఢిల్లీలో అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించిన సందర్భంలో కాంగ్రెస్‌పార్టీ నుంచి సురేష్‌రెడ్డి ప్రతినిధిగా పాల్గొని తెలంగాణ వాణిని గట్టిగా వినిపించారు. అదే సామాజిక వర్గం నుంచి సీఎం రేసులో రాష్ట్ర సీనియర్ మంత్రి కె.జానారెడ్డితో పాటు అదే జిల్లాకుచెందిన మరో మంత్రి, గతంలో 610 జీవో అమలు కమిటీ చైర్మన్‌గా పనిచేసిన ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పలువురు ముఖ్యనేతలు  ఉండడం వల్ల సురేష్‌రెడ్డికి అవకాశాలు తక్కువేనన్న ప్రచారం ఆ పార్టీ వర్గాల నుంచే వ్యక్తమవుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement