‘ఆంధ్రజ్యోతి పేపర్‌ను చంద్రజ్యోతిగా మార్చుకోండి’

Gudivada Amarnath Slams On Chandrababu In Visakhapatnam - Sakshi

సాక్షి, విశాఖపట్నం: అక్టోబర్ 2 నుంచి ప్రభుత్వ పథకాలను గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు అందిస్తామని అనకాపల్లి ఎమ్యెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు. ఆదివారం ఆయన  మీడియాతో మాట్లాడుతూ.. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఒక లక్ష 27 వేల ఉద్యోగాలు సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి కల్పించారని ప్రశంసించారు. వార్డు సచివాలయాల ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసినప్పటి నుంచి పరీక్ష సమాధానాలకి ‘కీ’ విడుదల చేసే వరకు ఎక్కడ ఎటువంటి లోటు పాట్లు రాలేదని వివరించారు. ఫలితాలు వెలువడిన తర్వాత చంద్రబాబు ఉలిక్కిపడుతున్నారని.. ఉద్యోగాలు సాధించిన బీసీలు, మహిళలను, చివరకు అధిక మార్కులతో టాపర్‌లుగా నిలిచిన వారిని కూడా కించపరుస్తూ తన పచ్చపత్రిక ద్వారా అనుమానాలను వ్యాప్తి చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ హయంలో ఎన్నిసార్లు పేపర్లు లీక్ అయ్యాయో గుర్తు చేసుకోవాలన్నారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, చంద్రబాబులకు తప్ప ఈ పరీక్షల మీద ఎవరూ ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేయలేదన్నారు.

సీఎం వైఎస్‌ జగన్‌ తీసుకునే నిర్ణయాలను ఓర్వలేక చంద్రబాబు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. గత ప్రభుత్వ హయాంలో ఏబీఎన్ రాధాకృష్ణకు కట్టబెట్టిన పనులపై విచారణ చేపట్టాలన్నారు. ప్రతి ఆదివారం నిర్వహించే ఓపెన్ హార్ట్ విత్‌ ఆర్కేలో అసలు ఓపెన్ హార్ట్ ఉందా అని ప్రశ్నించారు. ఆంధ్రజ్యోతి పేపర్‌ను చంద్రజ్యోతిగా మార్చుకోవాలని ఎద్దేవా చేశారు. సీఎం జగన్‌  అందిస్తున్న పారదర్శక పాలన చూసి ఓర్వలేక పరీక్షలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ చంద్రబాబు పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా అసత్య, నిరాధార ఆరోపణలు మానుకోవాలని హెచ్చరించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top