రాజధాని రైతులపై జులుం

Govt Officials Over Action on Farmers - Sakshi

     సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు కోసం బలవంతంగా భూసేకరణ  

     సమాచారం ఇవ్వకుండానే ఉండవల్లిలో రైతుల పొలాల్లో సర్వే 

     పంటలను తొక్కుకుంటూ వెళ్లిన అధికారులు 

     అడ్డుకున్న రైతులు, రైతు కూలీల అరెస్ట్‌ 

     పోలీసుల పహారా మధ్య 200 ఇళ్లు, 28 ఎకరాల సర్వే 

     బాధితుల అభ్యంతరాలను లెక్కచేయని ప్రభుత్వం 

సాక్షి, అమరావతి బ్యూరో: ప్రశాంతంగా ఉన్న రాజధాని ప్రాంతంలో ఒక్కసారిగా అలజడి రేగింది. రైతులపై ప్రభుత్వం జులుం ప్రదర్శించింది. వారి భూములను బలవంతంగా లాక్కునేందుకు దౌర్జన్యంగా వ్యవహరించింది. ప్రతిఘటించిన రైతులను నిర్బంధించింది. భూములను నమ్ముకుని జీవిస్తున్న అన్నదాతలను భయభ్రాంతులకు గురి చేసింది. సర్కారు తీరుపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు పంపిణీ చేసిన స్థలాలను ఇప్పుడు ఆయన అల్లుడు చంద్రబాబు  లాక్కుంటున్నారని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు వారికి అండగా నిలిచారు. 

సమాచారం ఇవ్వకుండానే సర్వే 
సీడ్‌ యాక్సెస్‌ రహదారి నిర్మాణం కోసం ఉండవల్లిలో 200 ఇళ్లు, 28 ఎకరాల భూమి అవసరమని అధికారులు గుర్తించారు. సంబంధిత రైతులకు, ఇళ్ల యజమానులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా శుక్రవారం ఉదయం ఉండవల్లికి చేరుకుని సాగులో ఉన్న పంటలను తొక్కుకుంటూ భూముల్లోకి వెళ్లి సర్వే చేయడం ప్రారంభించారు. విషయం తెలుసుకున్న రైతులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తమకు చెప్పకుండా భూముల్లోకి ఎలా వచ్చారంటూ అధికారులను నిలదీశారు. ఎవరిని అడిగి సర్వే చేస్తున్నారు? వెంటనే నిలిపేసి వెళ్లిపోవాలని అధికారులతో వాగ్వాదానికి దిగారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు రైతులను, పొలాల్లో పనిచేస్తున్న కూలీలను బలవంతంగా మంగళగిరి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 10 మంది మహిళా రైతులతో సహా 23 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి మద్దతుగా వైఎస్సార్‌సీపీ నేతలు పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారు. రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. పోలీసుల భద్రత నడుమ అధికారులు రైతుల పొలాల్లో సర్వే పూర్తి చేశారు. 

భూములు ఇవ్వనందుకే కక్ష 
రాజధాని అమరావతి ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం 2016 జూన్‌లో రూ.580 కోట్ల వ్యయంతో సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టింది. ఉండవల్లి రైతులు తమ భూములు ఇచ్చేందుకు నిరాకరించడంతో మొదటి దశ పనులను నిలిపివేసింది. రెండో దశ పనులను తుళ్లూరు మండలం వెంకటపాలెం నుంచి బోరుపాలెం వరకు చేపట్టింది. ఇప్పటిదాకా అరకొరగానే పనులు జరిగాయి. ఎన్నికలకు ఏడాది మాత్రమే ఉండడంతో ఎలాగైనా సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు నిర్మించి, ఇది తమ ఘనత అని చాటుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. భూములు ఇవ్వడానికి నిరాకరిస్తున్న తమపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఉండవల్లి రైతులు మండిపడుతున్నారు. 

అభ్యంతరాలు వినరా? 
భూ సేకరణ చట్టం–2013  ప్రకారం భూ యజమానుల అభ్యంతరాలను తెలుసుకున్న తర్వాతే భూమి సేకరించాలి. ఇందుకు 60 రోజుల సమయం ఇవ్వాలి. కానీ, ప్రభుత్వం రైతుల అభ్యంతరాలను లెక్కచేయడం లేదు. భూ సేకరణ చట్టం ప్రకారం భూమి వాస్తవ ధరకు మూడు రెట్ల పరిహారాన్ని అందజేయాలి. సామాజిక ప్రభావ అంచనా సర్వే నిర్వహించాలి. రైతులు, కూలీలకు ప్రత్యామ్నాయ జీవనోపాధి మార్గాలు చూపాలి. నిబంధలను సర్కార్‌ పట్టించుకోకుండా మొండిగా ముందుకెళుతోంది. ఉండవల్లిలో ఎకరా భూమి రూ.10 కోట్ల దాకా పలుకుతోందని, ప్రభుత్వం కేవలం రూ.50 లక్షలే ఇస్తామని తేల్చిచెబుతోందని రైతులు వాపోతున్నారు. 

మమ్మల్ని నిర్బంధించి సర్వే చేశారు
ఉండవల్లిలో 124/1 సర్వే నంబర్‌లో నాకు ఎకరా 20 సెంట్లు ఉంది. ప్రస్తుతం ఇందులో కంద సాగు చేస్తున్నా. రూ. లక్షన్నర పెట్టుబడి పెట్టా. అధికారులు సమాచారం ఇవ్వకుండానే పంటను తొక్కుకుంటూ పొలంలోకి వెళ్లారు. మమ్మల్ని పోలీస్‌ స్టేషన్‌లో నిర్బంధించి మరీ సర్వే పూర్తి చేశారు. భూమిని సర్కారు లాక్కుంటే మేమెలా బతకాలి 
– భీమిరెడ్డి కృష్ణారెడ్డి, ఉండవల్లి గ్రామం 

ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలట! 
కరకట్ట మీద 30 ఏళ్ల నుంచి ఇల్లు వేసుకుని జీవిస్తున్నాం. ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మాకు కాలువ పోరంబోకు స్థలాన్ని పంపిణీ చేశారు. ఇల్లు, నీటి పన్నులు కడుతున్నాం. ఇప్పుడు వెంటనే ఇల్లు ఖాళీ చేసి వెళ్లాలని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు 
– తుమ్మల చిన్నలక్ష్మి, ఎన్టీఆర్‌ కాలనీ, తాడేపల్లి  

సర్కారు దౌర్జన్యాన్ని అడ్డుకుంటాం 
భూ సేకరణ చట్టానికి టీడీపీ ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. రైతులను నష్టం చేకూర్చేలా సవరణలు చేసి దాన్ని ఆమోదించుకోవాలని చూస్తోంది. రైతులకు అన్యాయం జరిగితే ఊరుకోం. ప్రభుత్వ దౌర్జన్యాన్ని అడ్డుకుంటాం. బాధితుల తరఫున పోరాడుతాం. న్యాయం జరిగే వరకూ అండగా ఉంటాం.         
 – బుర్రముక్క వేణుగోపాల్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నేత, తాడేపల్లి 

కుమారుడి కోసమే చంద్రబాబు భూదాహం: మధు
తాడేపల్లి రూరల్‌: రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన నాటి నుంచి భూ దాహం తీర్చుకునేందుకు అధికారులను, పోలీసులను ఉపయోగిస్తూ రైతులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ఆరోపించారు. ఉండవల్లిలో పోలీసులు అరెస్టు చేసిన రైతులను పరామర్శించేందుకు ఆయన మంగళగిరి పోలీసు స్టేషన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. 600 అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తన కుమారుడి ఆస్తులను పెంచేందుకు భూ దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో రైతులపై బుల్లెట్ల వర్షం కురిపించి, లాఠీలు ప్రయోగించి భూములను లాక్కొని భూదందా సాగిస్తున్నారని దుయ్యబట్టారు. రైతులపై దౌర్జన్యం చేస్తే సహించబోమన్నారు. భూ సేకరణ చట్టంపై రైతులకు అవగాహన కల్పించేందుకు సదస్సు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ సదస్సు తాడేపల్లి పట్టణంలో శనివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతుందని వెల్లడించారు. రైతులపై టీడీపీ ప్రభుత్వం సాగిస్తున్న దుశ్చర్యలకు అడ్డుకునేందుకు భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top