రిట్ ఇచ్చిన ఉత్సాహం | Given the excitement of the rate | Sakshi
Sakshi News home page

రిట్ ఇచ్చిన ఉత్సాహం

Feb 21 2015 3:08 AM | Updated on Aug 24 2018 2:36 PM

భూ సమీకరణ నుంచి తమ భూములు మినహాయించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ మంగళగిరి, తాడేపల్లి మండలాల రైతులు దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను హైకోర్టు శుక్రవారం స్వీకరించింది.

సాక్షి ప్రతినిధి, గుంటూరు : భూ సమీకరణ నుంచి తమ భూములు మినహాయించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ మంగళగిరి, తాడేపల్లి మండలాల రైతులు దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను హైకోర్టు శుక్రవారం స్వీకరించింది. భూ సమీకరణకు సంబంధించిన పూర్తి వివరాలను కోర్టు ముందుంచాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాజధాని  గ్రామాల్లోని రైతులు, రైతు కూలీలు, కౌలుదారుల ఆనందానికి అవధులు లేవు. దాదాపు మూడు నెలల నుంచి పెనుప్రమాదం ముంచుకు వస్తుందనే భావనతో రాజధాని గ్రామాల్లోని రైతు కుటుంబాలు కంటిమీద కునుకు లేకుండా జీవిస్తున్నాయి. రాజధాని నిర్మాణానికి భూములు ఇస్తూ అంగీకారపత్రాలు ఇవ్వాలని అధికారులు, టీడీపీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తల ఒత్తిడిని తట్టుకోలేక ఆ కుటుంబాలు తల్లడిల్లిపోయాయి. వ్యవసాయం మినహా మరో వ్యాపకం తెలీని తాము ప్రభుత్వానికి భూములు ఇచ్చి ఏం చేయాలి, పిల్లల చదువులు, పెళ్లిళ్లు వంటి బాధ్యతలను ఎలా తీర్చాలనే మనోవేదనతో ప్రతి కుటుంబం కుంగిపోయింది.
 
  ఈ నేపథ్యంలో రైతుల పక్షాన వైఎస్సార్ కాంగ్రెస్ నిలిచింది. పార్టీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ప్రారంభం నుంచి ఆ కుటుంబాలకు వెన్నుదన్నుగా నిలిచారు. భూ సమీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్మించారు. వందమైళ్ల ప్రయాణం మొదటి అడుగుతోనే ప్రారంభం అవుతుందనే రీతిలో రాజధాని ఉద్యమం వైఎస్సార్ సీపీతో ఆరంభమైంది. వివిధ రాజకీయపార్టీలు, రైతు సంఘాలు, హక్కుల పరిరక్షణ సంఘాలు అనేకం ఉద్యమానికి మద్దతుగా నిలిచాయి. ఈ సమయంలోనే రైతుల రిట్‌ను హైకోర్టు స్వీకరించడంతో ఉద్యమానికి మరింత ఉత్తేజం కలిగినట్లయింది.
 
 కోర్టుపై కొండంత నమ్మకం ...
 నిడమర్రు, పెనుమాక, ఉండవల్లి గ్రామాలకు చెందిన 32 మంది రైతులు రెండు రోజుల కిందట హైదరాబాద్ వెళ్లి సీఆర్‌డీఏ అధికారులకు అభ్యంతర ఫారాలు అందజేసినా భూ సమీకరణ నుంచి మినహాయించలేదు. ఒత్తిడి తెస్తూ తమను ఇబ్బందులుకు గురి చేస్తున్నారని, భూసమీకరణ నుంచి మినహాయించి న్యాయం చేయాలంటూ కోర్టును ఆశ్రయించారు. వారికి అండగా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) అండగా నిలిచారు. గురువారమే కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయగా, శుక్రవారం ఆ రిట్‌ను స్వీకరించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కోర్టు ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇప్పటివరకు భూసమీకరణకు అంగీకారపత్రాలు ఇవ్వని రైతులు కోర్టులో న్యాయం జరుగుతుందని నిశ్చింతగా ఉన్నారు. ఇప్పటికే అంగీకారపత్రాలు అందజేసిన రైతుల్లో ఆందోళన మొదలైంది. అంగీకారపత్రాలు ఇచ్చిన రైతుల భూములు మాత్రం చట్టప్రకారం ప్రభుత్వానికి చెందుతాయని, చట్టప్రకారమే వాటిపై నిర్ణయం వుంటుందని ప్రకటించారు. దీంతో కొందరు రైతులు తమ అంగీకారపత్రాలను ఉప సంహరించుకునే అవకాశాలపై న్యాయవాదులను సంప్రదిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement