‘గంటా’.. ‘గణ’గణమనలేదు!  | Ganta Srinivasa Rao Not Get PAC Chairman Post | Sakshi
Sakshi News home page

‘గంటా’.. ‘గణ’గణమనలేదు! 

Jul 25 2019 3:02 PM | Updated on Jul 29 2019 12:13 PM

Ganta Srinivasa Rao Not Get PAC Chairman Post - Sakshi

రాష్ట్రమంతటా చావుదెబ్బతిన్నా.. అప్పటి జీవీఎంసీ అధికారుల బ్లాక్‌మెయిల్‌  రాజకీయంతో చచ్చీచెడీ గెలిచిన నగర టీడీపీ ఎమ్మెల్యేలకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు మాత్రం షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు. ఐదేళ్లపాటు నగరంలో పార్టీని నడిపించిన దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌కు ముందుగానే పార్టీ బాధ్యతల నుంచి తీసిపారేశారు. దాంతో అలిగిన వాసుపల్లి పార్టీ కార్యాలయంలోకి అడుగుపెట్టనని భీష్మించుకున్నా పట్టించుకునే దిక్కులేకుండా పోయింది.

తాజాగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే గణబాబుల ఆశలపై అధినేత నీళ్లు చల్లేశారు. ఆనవాయితీగా ప్రతిపక్షానికి కేటాయించే అసెంబ్లీ పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ(పీఏసీ) చైర్మన్‌ పదవిని వీరిద్దరూ ఆశించారు. సీనియారిటీ, కుల సమీకరణలు తదితర లెక్కలు వేసుకొని మరీ కేబినెట్‌ మంత్రి హోదా కలిగిన ఆ పదవిపై ఆశలు పెంచుకున్నారు.అయితే అనంతపురం జిల్లాకు చెందిన పయ్యావుల కేశవ్‌కు పీఏసీ చైర్మన్‌గిరీ ఇవ్వాలని నిర్ణయించడం ద్వారా గంటా, గణబాబులకు జెల్లకొట్టారు.

సాక్షి, విశాఖపట్నం: సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాఅంతటా ఫ్యాన్‌ గాలి ఉధృతంగా వీచినా.. అప్పటి జీవీఎంసీ అధికారుల బ్లాక్‌మెయిల్‌ రాజకీయంతో విశాఖ నగరంలో మాత్రం టీడీపీ అభ్యర్థులు చావు తప్పి కన్నులొట్టపోయిన చందంగా బయటపడ్డారు. అలా నగరం నాలుగుదిక్కులా టీడీపీ ఎమ్మెల్యేలే ఉండటంతో పార్టీ అధినేత చంద్రబాబు పదవుల కేటాయింపులో వారికి ప్రాధాన్యత ఇస్తారని అందరూ ఆశించారు. ఆ మేరకు ప్రతిపక్ష పార్టీకి కేటాయించే ప్రజా పద్దుల కమిటీ(పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ–పీఏసీ) చైర్మన్‌ పదవిని నగర టీడీపీ ఎమ్మెల్యేల్లో ఎవరో ఒక్కరికి కట్టబెడతారని భావించారు. యాధృచ్ఛికమే కావొచ్చు గానీ గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలూ సీనియర్లే.

గంటా శ్రీనివాసరావు వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలవగా, పివీజీఆర్‌ నాయుడు అలియాస్‌ గణబాబు, వెలగపూడి రామకృష్ణబాబులు మూడుసార్లు, వాసుపల్లి గణేష్‌ వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో సహజంగానే వీరిలో ఎవరో ఒకరికి పీఏసీ చైర్మన్‌ పదవి దక్కుతుందని ఆశించారు. సామాజికవర్గ లెక్కల ప్రకారం వెలగపూడి మొదటి నుంచి ఆ పదవిపై పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. ఇక తనకంటే ఎక్కువ దఫాలు గెలిచిన ఎమ్మెల్యేలు ఉండటంతో వాసుపల్లి గణేష్‌ కూడా ఏమో వస్తే రావచ్చు.. అన్న ఆశ తప్పించి.. ఆ పోస్టు గురించి పెద్దగా ప్రయత్నించిన దాఖలాల్లేవు. కానీ సుమారు ఎనిమిదేళ్లుగా బుగ్గకారుకు అలవాటు పడిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, మూడుసార్లు గెలిచి సీనియర్‌ ముద్ర వేసుకున్న పశ్చిమ ఎమ్మెల్యే గణబాబులు మాత్రం ఆ పదవి కోసం తీవ్రంగా పోటీ పడ్డారనే చెప్పాలి.

గంటాకు మొండిచెయ్యి
సామాజికవర్గ కోణంలో చూసినా.. సీనియర్ల లెక్క చూసినా.. తనకు కచ్చితంగా పీఏసీ చైర్మన్‌ పదవి వస్తుందని గంటా శ్రీనివాసరావు లెక్కలు వేసుకున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందునా.. ఎన్నికలైన కొద్దిరోజుల్లోనే గంటా పార్టీ ఫిరాయించేస్తారని, కమలం గూటికి వెళ్లిపోతారన్న వదంతులు బలంగా వినిపించాయి. ఆయన వ్యక్తిగత పర్యటనలకు శ్రీలంక. అమెరికా వెళ్లిన సందర్భాల్లో గంటా క్యాంపు రాజకీయాలు మొదలుపెట్టేశారన్న వాదనలూ వినిపించాయి. ఈ నేపథ్యంలో గంటాను మచ్చిక చేసుకునేందుకు కచ్చితంగా చంద్రబాబు పీఏసీ చైర్మన్‌ పదవిని కట్టబెడతారని పార్టీలోని ఓ వర్గం అంచనా వేసింది.

ఎన్నికల ముందు కూడా టికెట్‌ విషయంలో గంటాను చివరి క్షణం వరకు ముప్పుతిప్పలు పెట్టిన చంద్రబాబు ఇప్పుడు కచ్చితంగా గంటాకు పదవి ఇచ్చి తనదారిలోకి తెచ్చుకుంటారన్న లెక్కలు వేశారు. కాపు సామాజికవర్గ కోణంలో కూడా ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో గంటా కంటే సీనియర్లు లేకపోవడంతో ప్రభుత్వపరంగా దక్కే ఒకే ఒక్క పీఏసీ పదవి ఆయనదేనన్న ప్రచారం జరిగింది. అయితే చంద్రబాబు ఎప్పటి మాదిరిగానే తన రాజకీయాన్ని ప్రదర్శించి గంటాకు ఝలక్‌ ఇచ్చారు.

గణబాబు ఆశలపై నీళ్లు
ఇక మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనను ఈసారి చంద్రబాబు కరుణిస్తారని, గతంలో మంత్రి పదవి ఇవ్వని కారణంగా ఇప్పుడైనా బీసీ కోటాలో పీఏసీ పదవి ఇస్తారని గణబాబు ఆశిస్తూ వచ్చారు. గంటాకు కాకుంటే తనకే కచ్చితంగా వస్తుందని లెక్కలు వేసుకున్నారు. గంటాను బాబును నమ్మే పరిస్థితి లేదని, తమ నాయకుడికే కీలక పదవి వస్తుందని ఆయన వర్గీయులు కూడా బలంగా నమ్ముతూ వచ్చారు. కానీ చంద్రబాబునాయుడు విశాఖ ఎమ్మెల్యేలను ఏమాత్రం లెక్కలోకి తీసుకోకుండా అనంతపురం జిల్లాకు చెందిన పయ్యావుల కేశవ్‌కు పీఏసీ పదవి కట్టబెట్టేశారు. దీంతో విశాఖ టీడీపీ శ్రేణులు, ప్రత్యేకించి గంటా, గణబాబు వర్గీయులు నైరాశ్యంలో మునిగిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement