నిధులు పక్కదారి | Funded by the wayside | Sakshi
Sakshi News home page

నిధులు పక్కదారి

Oct 14 2014 2:56 AM | Updated on Aug 30 2018 4:49 PM

నిధులు పక్కదారి - Sakshi

నిధులు పక్కదారి

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు నగరంలో రహదారుల మరమ్మతుల కోసం డిపాజిట్ చేసిన నిధులను కార్పొరేషన్ అధికారులు దారి మళ్లించారు.

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు నగరంలో రహదారుల మరమ్మతుల కోసం డిపాజిట్ చేసిన నిధులను కార్పొరేషన్ అధికారులు దారి మళ్లించారు. రహదారులను యథాస్థితికి తీసుకొచ్చేందుకు డిపాజిట్ చేసిన రూ.2.21 కోట్ల నిధులను గతంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులపెండింగ్ బిల్లుల చెల్లింపునకు వినియోగిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. నెల్లూరు నగరంలో 72 మార్గాల్లో  68 కిలోమీటర్ల మేర ఓఎఫ్‌సీ కేబుల్ ఏర్పాటు చేసేందు కు రిలయన్స్ ఇన్‌ఫోకాం లిమిటెడ్ సంస్థ ముందుకొచ్చింది.

ఈ మేరకు నెల్లూరు నగర పాలక సంస్థకు మూడు ప్రతిపాదనలు పంపింది. మొదటి విడతగా నగరంలోని 23 మార్గాల్లో 33 కిలోమీటర్ల పొడవునా రహదారులను తవ్వి కేబుల్ ఏర్పాటు చేసి తిరిగి రోడ్డును యథాస్థితిలోకి తీసుకొచ్చేందుకు రూ.1.07 కోట్లు కార్పొరేషన్‌కు చెల్లించేందుకు ప్రపోజల్స్ పెట్టుకున్నారు. అందుకు నగరపాలక సంస్థ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు మొదటి విడతగా రిలయన్స్ ఇన్‌ఫో కాం సంస్థ ఆ మొత్తం నిధులు రూ.1.07 కోట్లను నెల్లూరు నగరపాలక సంస్థకు డిపాజిట్ చేసింది.

అదే విధంగా రెండో విడత 11 మార్గాల్లో 11 కిలోమీటర్ల దూరం కేబుల్ ఏర్పాటు కోసం తవ్వేసిన రోడ్లను యథాస్థితికి తీసుకొచ్చేందుకు రూ.1.14 కోట్లు చెల్లిస్తామని కార్పొరేషన్‌కు రిలయన్స్ సంస్థ నివేదికలు పంపింది. నగరపాలక సంస్థ అంగీకారం తెలపడంతో రెండో విడత పనులకూ రూ.1.14 కోట్ల మొత్తాన్ని సదరు సంస్థ కార్పొరేషన్‌కు చెల్లించింది.
 
మూడునెలల క్రితమే పనులు ప్రారంభం
 నెల్లూరు నగరంలో మూడునెలల క్రితమే టెలిఫోన్ కేబుల్ ఏర్పాటు పనులను రిలయన్స్ ఇన్‌ఫో సంస్థ ప్రారంభించింది. రెండు విడతల పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. కేబుల్ ఏర్పాటు కోసం తీసిన గుంతలు అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. పనులు పూర్తి అయిన వెంటనే రోడ్లను యథాస్థితిలోకి తీసుకొచ్చేందుకు డిపాజిట్ చేసిన సొమ్ముతో కార్పొరేషన్ మరమ్మతు పనులు చేపట్టాల్సి ఉంది. ఈ మేరకు తవ్వి వదిలేసిన గుంతలను మట్టితో నింపి తిరిగి యథాస్థితికి తీసుకురావాలి.

అయితే ఎక్కడా ఆ పనులు చేపట్టిన దాఖలాలు కనిపించలేదు. రిలయన్స్ ఇన్‌ఫో సంస్థ చేసి వదిలేసిన రోడ్లే దర్శనమిస్తున్నాయి. నగరంలోని పలు వీధుల్లో రోడ్లపై కంకర తేలి దర్శనమిస్తోంది. మరి కొన్నిచోట్ల ఇంకా పెద్దపెద్ద గుంతలు కనిపిస్తున్నాయి. కేబుల్ కోసం రోడ్లను పగులగొట్టే సమయంలో కొన్నిచోట్ల పగిలిన తాగునీటి పైప్‌లైన్లు లీకేజీ అవుతున్నా పట్టించుకోవటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నాయి.

 ఇష్టానుసారం నిధులు మళ్లింపు
 రోడ్లను యథాస్థితికి తీసుకొచ్చేందుకు రిలయన్స్ కార్పొరేషన్ డిపాజిట్ చేసిన రూ.2.21 కోట్ల నిధులను కొందరు పాలకులు, అధికారులు ఇష్టారాజ్యంగా పక్కదారి పట్టిస్తున్నారు. గతంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు సంబంధించి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆ బిల్లుల చెల్లింపునకు రోడ్ల మరమ్మతుల కోసం డిపాజిట్ చేసిన నిధులను వినియోగిస్తున్నట్టు సమాచారం.

అది కూడా అధికార పార్టీ నాయకుల సిఫారసు చేసిన బిల్లులకే చెల్లిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. వీటిలో గత కౌన్సిల్‌లో తీర్మానం చేసి పూర్తి చేసిన పనులకు సంబంధించిన బిల్లులు కూడా ఉన్నట్టు తెలిసింది. ఈ విషయమై సంబంధిత అధికారులు స్పందించి రోడ్లు మరమ్మతుల కోసం కేటాయించిన నిధులను ఆ పనులకే వినియోగించి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉంది.

 ఎన్‌బీకే విద్యార్థుల ప్రయోగాత్మక బోధన
 కోట: నూతన బోధనా పద్ధతులకు ఎన్‌బీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు శ్రీకారం చుట్టారు. మెకానికల్ విద్యార్థులు డీజిల్ ఇంజన్ వినియోగంపై సోమవారం ప్రయోగాత్మక సెమినార్ ఇచ్చారు. ఫైనలియర్ విద్యార్థులు ధరణ్, వెంకటలోకేష్, వంశీశ్రీధర్ డీజిల్ ఇంజన్ పనిచేసే విధానంపై వివరించారు. డీజిల్ ఇంజన్‌లో ఒక్కో భాగాన్ని విడదీసి వాటి ప్రాముఖ్యతను వివరించారు.  

తరగతి గదిలో నేర్చుకున్న అంశాల కంటే ఈ ప్రయోగాత్మక బోధన ద్వారా సులభంగా అర్థమవుతుందన్నారు. విద్యార్థులు ప్రయోగాత్మకంగా చేసిన ఆవిష్కరణలపై కళాశాల డెరైక్టర్ విజయ్‌కుమార్‌రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల పరిశోధనలకు  తమ సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement