ఇసుకను ఉచితంగా సరఫరా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం వల్ల అన్ని
తాడేపల్లిగూడెం : ఇసుకను ఉచితంగా సరఫరా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం వల్ల అన్ని రంగాల నుంచి మద్దతు లభిస్తుందని గనుల శాఖ మంత్రి పీతల సుజాత అన్నారు. పట్టణంలో 15వ వార్డులో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ పార్కు ప్రారంభోత్సవ కార్యక్రమంలో శనివారం ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఇసుక ఉచితంగా సరఫరా చేసే విధానానికి సంబంధించి త్వరలో స్పష్టత వస్తుందన్నారు. సీఎం తీసుకున్న నిర్ణయం వల్ల నిర్మాణరంగ అభివృద్ధికి చేయూత నిచ్చినట్టేనన్నారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ల నుంచి సానుకూల స్పందన వచ్చిందన్నారు. పర్యావరణ పరిరక్షణ, ర్యాంపుల నిర్వహణ తదితర అంశాలపై పరిశీలన చేసిన అనంతరం ఇసుక సరఫరా విషయంలో స్పష్టమైన విధానం ప్రకటిస్తారన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న మరో ముఖ్యఅతిథి దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మాట్లాడుతూ అమృత్ పథకానికి సంబంధించి రానున్న రాష్ట్ర బడ్జెట్‌లో మ్యాచింగ్ గ్రాంటుగా 50 శాతం నిధులను కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అమృత్ ద్వారా పట్టణాలలో మౌలికవసతుల కల్పన జరుగుతుందన్నారు. మునిసిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్, వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.