కిరాతకంపై కన్నెర్ర
* ఇందుమతి మృతిపై విద్యార్థి, ప్రజాసంఘాల ధర్నా
* మంత్రి సుజాత అడ్డగింత.. నన్నపనేని రాజకుమారి ఘెరావ్
* ఏలూరులో ఉద్రిక్తత
ఏలూరు(ఆర్ఆర్ పేట): ప్రేమోన్మాదుల దాష్టీ కానికి బలైన పైడాల ఇందుమతి(18) ఘటన పశ్చిమగోదావరి జిల్లా ప్రజలను ఆవేదన, ఆగ్రహానికి గురిచేసింది. వివిధ విద్యార్థి, ప్రజాసంఘాల నాయకులు, విద్యార్థులు కన్నెర్ర చేశారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలంటూ ధర్నా నిర్వహించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
మృతురాలి మేనమామ ఆత్మహత్యకు యత్నించడంతో ఉద్రిక్తతకు దారితీసింది. ఏలూరు మండలం చాటపర్రుకు చెందిన ఇందుమతిపై అదే గ్రామానికి చెందిన అన్నదమ్ములు దగ్గుమిల్లి పెదవిక్కీ, చినవిక్కీ శనివారం కిరోసిన్ పోసి సజీవ దహనం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆరా తీసేందుకు ఆదివారం రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి ఆస్పత్రికి వచ్చారు. ఇందుమతి మృతదేహాన్ని పరిశీలించి, బాధిత కుటుంబా న్ని పరామర్శించారు. తిరిగి వెళుతుండగా విద్యార్థి, ప్రజా సంఘాల నాయకులు అడ్డుకున్నారు.
బాధితురాలి కుటుంబానికి ఎలాంటి హామీలు ఇవ్వకుండా, నష్టపరిహారం ప్రకటిం చకుండా వెళ్లడమేంటని ఘెరావ్ చేశారు. బాధిత కుటుంబానికి రూ.20లక్షల నష్టపరిహా రం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు. అనంతరం ఆస్పత్రికి వచ్చిన రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాతనూ వారు అడ్డుకున్నారు. ప్రభుత్వం, పోలీసుల నిర్లక్ష్యం వల్లే ప్రేమోన్మాదుల దురాగతానికి ఇందుమతి బలైందని వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు.
మేనమామ ఆత్మహత్యాయత్నం
నిందితులను తప్పించేందుకు పోలీసులు ప్ర యత్నిస్తున్నారని ఆరోపిస్తూ ఇందుమతి మేనమామ సుబ్బారావు ఆస్పత్రి ఆవరణలో ఆత్మహత్యాయత్నం చేశారు. ఇందుమతి మృతదేహానికి పోస్ట్‌మార్టం జరుగుతున్న సందర్భంలో మీడి యా వద్దకు వచ్చిన సుబ్బారావు.. వీడియో కెమెరాల వైర్లను మెడకు బిగించుకోగా... పోలీసులు అడ్డుకొని వెంటనే ఆస్పత్రికి తరలిం చారు. మరోవైపు పోస్టుమార్టం అనంతరం ఇందుమతి మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు పోలీసు లు ప్రయత్నించగా, వారు నిరాకరించారు.
నిందితులు ఇందుమతిని వేధిస్తున్నారని గతంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతోనే ఈ ఘోరం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు మృతదేహాన్ని తీసుకెళితే ప్రభుత్వం ఎలాంటి న్యాయం చేయదని నినాదాలు చేశారు. విషయాన్ని పోలీసులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా, ఆయన పెదపాడు తహసీల్దార్‌ను ఆస్పత్రికి పంపించారు. బాధితులకు న్యాయం చేస్తామని తహసీల్దార్‌తో హామీ ఇప్పించారు. దీంతో శాంతించిన ఇందుమతి కుటుంబ సభ్యులు, ఆందోళనకారులు ఆమె మృతదేహాన్ని తీసుకు వెళ్లారు.
విద్యార్థులు, గ్రామస్తులు వెంటరాగా, అశ్రునయనాల నడుమ చాటపర్రులో అంత్యక్రియలు నిర్వహించారు. కుమార్తెకు ఇష్టమైన చెరకు రసాన్ని బాటిల్ నిండా తెచ్చిన ఇందుమతి తండ్రి సత్యనారాయణ అంత్యక్రియలు పూర్తయిన అనంతరం ఆమె సమాధిపై పోశారు. గద్గద స్వరంతో ‘తాగమ్మా.. నీకు ఇష్టమైన చెరుకు రసం తెచ్చాను’ అంటూ ఆ తండ్రి రోదించడం అక్కడి వారందరినీ కంటతడి పెట్టించింది.
హత్య కేసుగా మార్పు
ఇందుమతి సజీవ దహనం నేపథ్యంలో పోలీసులు తొలుత ఐపీసీ సెక్షన్ 324 (గాయపర్చడం), సెక్షన్ 509 (మహిళను అవమానపర్చడం), సెక్షన్ 506 (నేరపూరితమైన బెదిరింపు) కింద కేసు నమోదు చేశారు. అనంతరం సెక్షన్ 302 కింద హత్య కేసుగా మార్చారు.