చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి

Former IAS Officers Meeting with governor Narasimhan - Sakshi

గవర్నర్‌ నరసింహన్‌తో మాజీ ఐఏఎస్‌ల భేటీ

సీఎం అనుచిత వైఖరిపై నిరసన

ఈసీ నియమించిన సీఎస్‌ను కోవర్ట్‌ అంటారా?

రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారిని బెదిరిస్తారా!

వారి ఆత్మగౌరవం దెబ్బతీస్తారా?

భవిష్యత్తులో ఇవి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోండి

గవర్నర్‌కు లేఖ అందజేసిన మాజీ ఐఏఎస్‌లు

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర ఎన్నికల కమిషన్‌ నియమించిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంను కోవర్టు అన్నందుకు, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ)ని బెదిరిస్తూ వ్యాఖ్యలు చేసినందుకు.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు క్షమాపణలు చెప్పాలని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పలువురు మాజీ ఐఏఎస్‌ అధికారులు డిమాండ్‌ చేశారు. మంగళవారం మధ్యాహ్నం వారు హైదరాబాద్‌ రాజ్‌భవన్‌లో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ను కలసి చంద్రబాబు అనుచిత వైఖరిపై తమ నిరసన తెలియజేశారు. భవిష్యత్తులో ఇలా ఉన్నత స్థానాల్లో విధులు నిర్వహిస్తున్న ఐఏఎస్‌ అధికారులను కించపర్చకుండా చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఉదంతాలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

ఈ మేరకు ఒక లేఖను గవర్నర్‌కు అందజేశారు. గవర్నర్‌తో భేటీ అనంతరం మాజీ ఐఏఎస్‌ టి.గోపాలరావు మీడియాతో మాట్లాడారు. పరిపాలనా విధుల్లో నిమగ్నమై ఉన్న ఐఏఎస్‌ అధికారుల మనోభావాలు దెబ్బతినేలా చంద్రబాబు మాట్లాడటం దారుణమని మండిపడ్డారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌ నియమించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఒక ముఖ్యమంత్రి కోవర్టు అనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని అవమానించి భయపెట్టారని, ఒక ప్రధాన కార్యదర్శిపై నిందారోపణలు చేశారని, తద్వారా ఉన్నతాధికారుల ఆత్మగౌరవం దెబ్బ తీశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ముఖ్యమంత్రి ఇలా వ్యవహరించడం తమకు బాధ కలిగించిందని చెప్పారు. ఇదెంత దుర్మార్గమో ప్రజలంతా గమనించాలని గోపాలరావు కోరారు. భారత పరిపాలనా వ్యవస్థకు వెన్నెముక లాంటి ఐఏఎస్‌ సర్వీసుల హుందాతనాన్ని, ప్రతిష్టను నిలబెట్టేందుకు మాజీ ఐఏఎస్‌ అధికారులమైన తాము గవర్నర్‌ను కలిశామని వివరించారు. చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని, తన ప్రవర్తన పట్ల విచారం వ్యక్తం చేయాలని తాము డిమాండ్‌ చేస్తున్నామని గోపాలరావు అన్నారు.

ప్రభుత్వాధినేత ప్రతిష్టకే భంగం
చంద్రబాబు ఐఏఎస్‌ అధికారుల పట్ల అనుచితంగా ప్రవర్తించడం ఒక ప్రభుత్వాధినేతగా ఆయన ప్రతిష్టకే భంగం కలుగజేస్తుందని మాజీ ఐఏఎస్‌లు అభిప్రాయపడ్డారు. సుబ్రహ్మణ్యం వంటి ఉత్తమమైన అధికారిపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ఎన్నికల కమిషన్‌ చట్టబద్ధమైన సాధికారతనే ప్రశ్నించినట్లుగా ఉన్నాయన్నారు. గవర్నర్‌కు ఇచ్చిన లేఖలో వారు ఈ అంశాలను పొందుపరిచారు. ఈ విషయంలో తమ మాజీ సహచరుడు ఈఏఎస్‌ శర్మ రాసిన లేఖ కూడా గవర్నర్‌ దృష్టికి వచ్చే ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు. గవర్నర్‌ రాజ్యాంగపరమైన అధిపతి కనుక చంద్రబాబు ప్రవర్తనను ఆయన దృష్టికి తీసుకువెళ్లడం సముచితమని తాము భావించామని వారు పేర్కొన్నారు. భవిష్యత్తులో మరెప్పుడూ ఇలాంటివి పునరావృతం కాకుండా, ప్రజల దృష్టిలో సీనియర్‌ ఉన్నతాధికారుల ప్రతిష్ట పలుచన చేసే ప్రయత్నాలు జరక్కుండా గట్టి నివారణ చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో కోరారు.

గవర్నర్‌కు ఇచ్చిన లేఖలో పలువురు మాజీ ఐఏఎస్‌లు సంతకాలు చేశారు. 33 మంది ఐఏఎస్‌ అధికారులు తమ సంఘీభావాన్ని తెలిపారు. అందుబాటులో లేనివారు ఫోన్‌లలో మౌఖికంగా తమ మద్దతు తెలిపారు. వీరిలో ముగ్గురు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శులు, 11 మంది ప్రభుత్వ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ఉన్నారు. 1958, 1968, 1971, 72, 73, 1983 బ్యాచ్‌లకు చెందినవారు వీరిలో ఉన్నారు. గవర్నర్‌ను కలసిన బృందంలో గోపాలరావుతో పాటు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శులు రమాకాంత్‌రెడ్డి, ఐవైఆర్‌ కృష్ణారావు, అజేయ కల్లం, ఏకే ఫరీదా, శామ్యూల్, ఎంజీ గోపాల్, పీకే రస్తోగి, బుసి శ్యాంబాబ్, సి.ఉమామహేశ్వరరావు, బి.కృపానందం, జె.రాంబాబు తదితరులున్నారు. మద్దతు పలికిన వారిలో ఎ.భట్టాచార్య, అనిల్‌కుమార్‌ కుట్టి, ఎ.విద్యాసాగర్‌రావు, సీబీఎస్‌ వెంకటరమణ, సీవీఎస్‌కే శర్మ, డీఆర్‌ గార్గ్, డి.శ్రీనివాసులు, హరీష్‌కుమార్, జేసీ మహంతి,  కేవీ రావు, ప్రియదర్శి దాస్, పి.దయాచారి, ఎంవీపీసీ శాస్త్రి, ఎంవీఎస్‌ ప్రసాద్, ఎన్‌కే నరసింహారావు, ఆర్‌ఎస్‌ గోయెల్, రేమాండ్‌ పీటర్, డాక్టర్‌ విజయకుమార్, వినోద్‌కుమార్‌ అగర్వాల్, జేపీ మూర్తి, సీఎస్‌ రంగాచారి ఉన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top