నిర్వహణ లోపంతోనే అగ్ని ప్రమాదం  | Fire accident in Visakha Solvents‌ Limited due to Management Negligence | Sakshi
Sakshi News home page

నిర్వహణ లోపంతోనే అగ్ని ప్రమాదం 

Jul 15 2020 4:55 AM | Updated on Jul 15 2020 7:39 AM

Fire accident in Visakha Solvents‌ Limited due to Management Negligence - Sakshi

మృతుడు కాండ్రేగుల శ్రీనివాస్‌ (ఫైల్‌)

సాక్షి, అమరావతి/విశాఖపట్నం/విశాఖ సిటీ: నిర్వహణ లోపంతోనే విశాఖ జిల్లా పరవాడ మండలంలోని విశాఖ సాల్వెంట్స్‌ లిమిటెడ్‌లో అగ్ని ప్రమాదం సంభవించిందని నిపుణుల కమిటీ ప్రాథమికంగా నిర్ధారించింది. ప్లాంట్‌ రియాక్టర్‌లో ‘డై మిథైయిల్‌ సల్ఫాక్సైడ్‌’ డిస్టిలేషన్‌ ప్రక్రియ కొసాగుతుండగా ప్రమాదం సంభవించిందని తెలిపింది.
 
► ఈ దుర్ఘటనలో ఓ కార్మికుడు మృతిచెందడంతోపాటు మరొకరు తీవ్రంగా గాయపడిన ఈ ప్రమాదంపై విచారణకు విశాఖ జిల్లా కలెక్టర్‌ ఐదుగురు సభ్యులతో కమిటీని నియమించారు.  
► ఈ కమిటీ రియాక్టర్‌ను పరిశీలించి మంగళవారం కలెక్టర్‌కు నివేదిక సమర్పించింది.  
► రియాక్టర్‌లో పరిమితికి మించి వాక్యూమ్‌ పెరగడం.. రసాయన మిశ్రమాల్లో ఉష్ణోగ్రత పెరగడంతో ప్రమాదానికి దారితీసింది.  

మంటలు పూర్తిగా అదుపులోకి.. 
కాగా, సోమవారం రాత్రి ఉవ్వెత్తున లేచిన మంటలను మంగళవారం ఉ.6గంటలకల్లా పూర్తిస్థాయిలో అదుపుచేశారు.  
► ప్రమాద సమయంలో రియాక్టరు వద్దనున్న కాండ్రేగుల శ్రీనివాస్‌ అనే కార్మికుడు అగ్నికి ఆహుతైనట్లు మంగళవారం గుర్తించారు.  
► అతని కుటుంబానికి సీఎం సహాయనిధి నుంచి రూ.15 లక్షల పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. మరో రూ.35 లక్షలు ఇచ్చేందుకు పరిశ్రమ యాజమాన్యం అంగీకరించింది.  
► అలాగే, ప్రమాదంలో మల్లేశ్‌ అనే మరో కార్మికుడికి గాయాలయ్యాయి. అతనికి ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు. వైద్యానికయ్యే ఖర్చుతో పాటు రూ.20 లక్షల పరిహారం ఇవ్వడానికి యాజమాన్యం అంగీకరించింది.  
► ప్రమాదం విషయం తెలిసిన వెంటనే హోంమంత్రి సుచరిత, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ఆరా తీశారు.  
► విచారణ కమిటీ తుది నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కలెక్టర్‌ వినయ్‌చంద్‌ తెలిపారు.  
► ప్రమాదంపై పరవాడ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేశారు.  
ఇదిలా ఉంటే.. పేలుడు సంభవించిన వెంటనే ప్రభుత్వ యంత్రాంగం గంటల వ్యవధిలో పరిస్థితిని అదుపులోనికి తీసుకురావడంతో మంగళవారం ఫార్మాసిటీలో కార్యకలాపాలు యథావిధిగా కొనసాగాయి.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement