మాకు ఆత్మహత్యలే శరణ్యం

Fathima Medical College students demand justice

నిరసన దీక్షలో ఫాతిమా కళాశాల విద్యార్థులు, తల్లిదండ్రులు

మంత్రి కామినేని రాజీనామా చేయాలి: మల్లాది విష్ణు

గాంధీనగర్‌ (విజయవాడ సెంట్రల్‌): ఫాతిమా కళాశాల యాజమాన్యం విద్యార్థులను మోసగించిందని, ప్రభుత్వం చొరవ తీసుకొని న్యాయం చేయకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమని బాధిత విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాదిన్నరగా ప్రభుత్వం మాయమాటలు నమ్మి మోసపోయామంటూ అలంకార్‌ సెంటర్‌లోని ధర్నాచౌక్‌లో మంగళవారం వారు నిరసన దీక్ష చేపట్టారు. దీక్షకు వైఎస్సార్‌సీపీతోపాటు కాంగ్రెస్, సీపీఐ, విద్యార్థి సంఘాలు వైఎస్సార్‌ ఎస్‌యూ, పీడీఎస్‌యూ, ఏఐఎస్‌ఎఫ్‌ మద్దతు ప్రకటించాయి.

విద్యార్థులు మాట్లాడుతూ నంద్యాల ఉపఎన్నిక సమయంలో సీఎం చంద్రబాబు తమకు వేరే కళాశాలల్లో ప్రవేశం కల్పిస్తామని ఇచ్చిన హామీ అమలు కాలేదన్నారు. మంత్రి కామినేని శ్రీనివాస్‌ ఫాతిమా కాలేజీ యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరిస్తూ కోర్టులో తప్పుడు అఫిడవిట్‌ సమర్పించినందునే తాము రోడ్డున పడాల్సి వచ్చిందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆర్‌.అర్షాద్, అజ్మతుల్లా, రహీంబాషా మాట్లాడుతూ కళాశాల యాజమాన్యం తమ వద్ద రూ.లక్షల రూపాయలు వసూలు చేసి, అనుమతుల్లేకుండా అడ్మిషన్లు ఇచ్చిందన్నారు. ప్రభుత్వం ఎంసీఐతో సంప్రదింపులు జరిపి పిల్లల భవిష్యత్‌ను కాపాడాలని కోరారు. కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకుని వారిని శిక్షించాలని కోరారు.


విజయవాడ అలంకార్‌ సెంటర్‌లోని ధర్నా చౌక్‌లో ఫాతిమా మెడికల్‌ కాలేజి విద్యార్థుల నిరసన కార్యక్రమంలో ప్రసంగిస్తున్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సిటీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లాది విష్ణు  

ప్రతిపక్ష నేత దృష్టికి తీసుకెళ్తాం..
దీక్షలో వైఎస్సార్‌సీపీ నగర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లాది విష్ణు మాట్లాడుతూ నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి కామినేని శ్రీనివాస్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ ప్రభుత్వంలో విద్యార్థులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. ఈ విషయాన్ని ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తామన్నారు. విద్యార్థులకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ మంత్రి కామినేని వారానికో ప్రకటన చేస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులను అయోమయానికి గురిచేస్తున్నారన్నారు. సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా చొరవచూపాలన్నారు. నిరసన దీక్షలో కళాశాల విద్యార్థులు, కాంగ్రెస్‌ నేత ఆకుల శ్రీనివాస్, సీపీఐ నేత దోనేపూడి శంకర్, కొలనుకొండ శివాజీ, విద్యార్థి సంఘం నాయకులు రవిచంద్ర, విశ్వనాథ్, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వైద్య సీట్లలో జాతీయ పూల్‌కు వెళ్తున్నాం: కామినేని
సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది నుంచి ఎంబీబీఎస్, బీడీఎస్, పీజీ వైద్య సీట్ల విషయంలో జాతీయ పూల్‌లోకి వెళ్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ ప్రకటించారు. మంగళవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జాతీయ స్థాయిలో 27,710 ఎంబీబీఎస్‌ సీట్లున్నాయని, వీటిలో 15 శాతం సీట్ల చొప్పున మనమిచ్చే సీట్లతో కలిపి 4,442 సీట్లలో పోటీపడవచ్చునన్నారు. మన రాష్ట్రం నుంచి కేవలం 285 సీట్లు మాత్రమే జాతీయ పూల్‌లోకి వెళ్తాయన్నారు. పీజీ సీట్ల విషయంలో మన రాష్ట్రం 415 సీట్లు ఇస్తే మన విద్యార్థులు దేశ వ్యాప్తంగా 6,665 సీట్లలో పోటీ పడే అవకాశం ఉంటుందని తెలిపారు. ఫాతిమా కాలేజీ విద్యార్థుల విషయంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పడం సరైంది కాదని, ప్రభుత్వ పరంగా వారికి చేయాల్సిందంతా చేశామని చెప్పారు. వచ్చే ఏడాది ఫాతిమా కాలేజీలో మొత్తం సీట్లను రద్దు చేసి, 2015–16 బ్యాచ్‌లో మోసపోయిన విద్యార్థులను చేర్చుకునే ప్రతిపాదన చేసినప్పటికీ భారతీయ వైద్యమండలి అంగీకరించలేదన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top