
సాక్షి, విజయవాడ: చంద్రబాబు అప్పులు చేసి అభూత కల్పనపై ఖర్చు పెడుతున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు వైఎస్సార్‌సీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. వైఎస్ జగన్ చేసిన పనులను చూసి కాపీ కొట్టడమే చంద్రబాబుకు తెలిసిన విద్య అని ఎద్దేవా చేశారు. అలాగే, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరిగింది అంటూ వ్యాఖ్యలు చేశారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దేవీనగర్‌లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డిప్యూటీ మేయర్ శైలజ రెడ్డి, కార్పొరేటర్ జానారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ..‘మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. చంద్రబాబు అప్పులు చేసి అభూత కల్పనపై ఖర్చు పెడుతున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరిగింది. చంద్రబాబు ఆరోగ్య శ్రీని నిర్వీర్యం చేశాడు . వైఎస్ జగన్ ఆరోగ్యశ్రీకి గ్రీన్ చానల్ అని పెట్టి ఎప్పటికప్పుడు బకాయిలు చెల్లించారు. ఆరోగ్య శ్రీ ఉద్యోగులు రోడ్డుపై నిరసనలకు దిగుతున్నారు
ప్రతి సందర్భంలో వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా కూటమి నేతలు విర్రవీగుతున్నారు. వైఎస్ జగన్ దీపావళి పండగ చేస్తే.. దానిపై బురద జల్లుతున్నారు. వైఎస్ జగన్ చేసిన పనులన్నీ చంద్రబాబు కాపీ కొట్టడమే పని. వైఎస్ జగన్ దీపావళి చేస్తే.. చంద్రబాబు విజయవాడలో దీపావళి చేస్తాడు. వినాయక చవితి వేడుకలు నిర్వహిస్తే.. చంద్రబాబు విజయవాడలో వినాయక చవితి వేడుకలు ఏర్పాటు చేశాడు. వైఎస్ జగన్ చేసే ప్రతీ పనిని చంద్రబాబు కాపీ కొడుతున్నాడు. ప్రజల విషయంలో అన్యాయం జరిగితే వైఎస్సార్‌సీపీ ఉద్యమాలు చేపడుతుంది. 28వ తేదీన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా భారీ ర్యాలీ చేపడతాం’ అని చెప్పుకొచ్చారు.