గోవిందరాజస్వామి ఆలయ ఘటన టీటీడీ పాలనా వైఫల్యమే
ప్రభుత్వ తీరుపై మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆగ్రహం
సాక్షి, అమరావతి: ‘చంద్రబాబు పాలనలో దేవుడికే రక్షణ కరువైంది. ఒక ఉన్మాది తిరుపతి గోవిందరాజస్వామి ఆలయం లోపలి నుంచి పైకెక్కి కలశాలను ధ్వంసం చేయడం, దేవుడి విగ్రహాలను కాళ్లతో తన్నడం అత్యంత ఆందోళనకరం. ఇది పూర్తిగా ప్రభుత్వం, దేవదాయ శాఖ, భద్రతా సిబ్బంది, విజిలెన్స్ అధికారుల ఘోర వైఫల్యమే. వైకుంఠ ఏకాదశి సందర్భంగా లక్షలాది భక్తులు వస్తారని తెలిసినా, కనీస ఏర్పాట్లలో టీటీడీ చేతులెత్తేసింది. చివరకు గోవిందమాల స్వాములనూ అడ్డుకోవడం దారుణం’ అని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు.
తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైకుంఠ ఏకాదశి రోజున భక్తులకు దర్శనాలు నిలిపివేయడం దుర్మార్గమని, తిరుమలకు భక్తులను రావొద్దనడం చరిత్రలో ఇదే ప్రథమమని ఆక్షేపించారు. ఆలయాల్లో తొక్కిసలాటలు, శివలింగం ధ్వంసం వంటి వరుస అపచారాలు జరుగుతున్నా ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘చంద్రబాబు పాలనలో 20 నెలలుగా టీటీడీలో కోకొల్లలుగా అవకతవకలు జరుగుతున్నాయి. కొండపైకి మద్యం, మాంసంతో యథేచ్ఛగా వస్తున్నారు. చెప్పులు వేసుకుని దర్శనానికి వెళ్తున్నారు. అయినా, పాలక మండలి చోద్యం చూస్తోంది. వైకుంఠ ఏకాదశి నాడు ఎంతమంది వీఐపీలకు దర్శన టికెట్లు ఇచ్చారో వెల్లడించాలి’ అని మల్లాది విష్ణు డిమాండ్ చేశారు.
దుర్గగుడి ఘటనకు మంత్రి బాధ్యత వహించరా?
‘విజయవాడ దుర్గగుడికి మూడు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిపివేయడం ఘోర తప్పిదం. ఆ సమయంలో 70 వేల మంది భక్తులు ఉన్నారు. దీనికి చిన్నస్థాయి అధికారిని బాధ్యుడిని చేస్తూ ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. సీఎంవోకు తెలియకుండా కరెంట్ సరఫరా నిలిపివేశారా?’’ అని విష్ణు ప్రశి్నంచారు.
తిరుమల లడ్డూపై దు్రష్పచారంతో రాష్ట్రానికి చెడు
‘తిరుమల లడ్డూ నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందంటూ ఆరోపణలు చేసిన రోజు నుంచే రాష్ట్రానికి చెడ్డ కాలం మొదలైంది. నేడు ఆలయాలకు భద్రత లేదు, హుండీలకు భద్రత లేదు, గోశాలలో గోవులకు రక్షణ లేదు.హిందూ ధర్మాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఏం చేయాలనుకుంటోంది?’ అని మల్లాది విష్ణు ప్రశ్నించారు.


