డబ్బు జబ్బు..!

Fake Clinics And Hospitals In Vizianagaram - Sakshi

డబ్బు సంపాదనే లక్ష్యంగా సాగుతున్న ప్రైవేటు క్లినిక్‌లు, ల్యాబ్‌లు

పరీక్షల పేరుతో రోగులను దోపిడీ చేస్తున్న వైనం

అనుమతులు లేకున్నా నిర్వహణ

తప్పుడు నివేదికలతో తగ్గని జబ్బులు  

చోద్యం చూస్తున్న వైద్యాధికారులు

వైద్య పరీక్ష... ఆరోగ్య సమస్యలను తెలుసుకునేందుకు కొలమానం. లోపాలను నిర్ధారించేందుకు ఆధారం. ల్యాబ్‌లో ఇచ్చిన నివేదిక అనుగుణంగా మందులు వాడితే జబ్బు తగ్గుతుంది. ఆరోగ్యం కుదుట పడుతుంది. అవే... నివేదికలు తప్పుడువైతే.. ఇక అంతే. ఎన్నిసార్లు పరీక్షలు చేయించుకున్నా.. ఎన్ని మందులు మింగినా, ఎంత డబ్బు ఖర్చయినా వ్యాధులు నయంకావు. ఇల్లుగుల్లకావడమే తప్ప ఆరోగ్యం కుదుటపడదు. ప్రస్తుతం విజయనగరం జిల్లాలో ఇదే పరిస్థితినెలకొంది. అనుమతులు లేని ల్యాబ్‌లు, క్లినిక్‌లు పుట్టగొడుగుల్లా వెలిశాయి.  తప్పుడు నివేదికలతో బెంబేలెత్తిస్తున్నాయి. పరీక్షల పేరిట డబ్బులు
దోచేస్తున్నాయని జనం గగ్గోలు పెడుతున్నారు.

విజయనగరం ఫోర్ట్‌:  ‘గంట్యాడ మండలానికి చెందిన ఎస్‌. శ్రీను అనే వ్యక్తి కొద్ది రోజుల కిందట జ్వరం రావడంతో విజయనగరం పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడకు వెళ్లిన వెంటనే అతనిని పరీక్షించిన వైద్యులు వైద్య పరీక్షలకు రిఫర్‌ చేశారు. అక్కడే ఉన్న ల్యాబ్‌లో అతను పరీక్షలు చేయించుకోగా రూ.1000 తీసుకున్నారు. మందులు, ఫీజు నిమత్తం మరో రూ.1200 వరకు ఖర్చ యింది. జ్వరం మాత్రం తగ్గలేదు. మరో ఆస్పత్రికి వెళ్తే నివేదికలు తప్పు అని సెలవివ్వడంతో నిశ్చేస్టుడయ్యాడు’.

‘విజయనగరం మండలానికి  చెందిన ఎస్‌. శంకర్‌ అనే యువకుడు కొద్ది రోజుల కిందట జ్వరం రావడంతో విజయనగరం పట్టణంలోని  ఓ ప్రవేటు ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడి వైద్యుడు పరీక్షించగానే వైద్య పరీక్షలు రాసి అక్కడే ఉన్న ల్యాబ్‌లో చేయించుకోమని సెలవిచ్చాడు. రక్త పరీక్షల కోసం రూ.1200 వసూలు చేశారు. జ్వర తీవ్రత ఎక్కువగా ఉందంటూ అదే ఆస్పత్రిలో ఇన్‌పేషెంట్‌గా చేర్చుకున్నారు. మూడు రోజులకు రూ.15 వేలు వసూలు చేశారు.’

ఇది ఒక్క వీరి పరిస్థితే కాదు. జిల్లాలో అనేక మందిది. రోగులు ఆర్థికదోపిడీకి గురవుతున్నారు. ఎటువంటి రిజిస్ట్రేషన్‌ లేని ల్యాబ్‌లలో విద్యార్హతలు లేనివారుపరీక్షలు నిర్వహించి నివేదికలు ఇచ్చేస్తున్నారు. వైద్యులు సైతం వాటినే కొలమానంగా తీసుకుని మందులు రాసేస్తున్నారు. మరిన్ని పరీక్షలు రాసే స్తున్నారు. ప్లేట్‌లెట్స్‌ తగ్గాయని, ఆరో గ్యం విషమంగా ఉందంటూ కొందరు భయపెడుతున్నారు. డబ్బుకోసమే వైద్యం అన్న ధోరణితో దోపీడీ చేస్తున్నారని రోగులు చెబుతున్నారు. ఒంటిలో నలతగా ఉందని చెప్పినా అరవైఆరు పరీక్షలు రాసేస్తున్నారని, శరీరంలో ఉన్న రక్తాన్ని కాస్త పరీక్షల కోసం సూదులుతో లాగేస్తున్నారంటూ వాపోతున్నారు.

పుట్టుగొడుగుల్లా పుట్టుకొస్తున్న క్లినిక్‌లు, ల్యాబ్‌లు..
జిల్లాలో ప్రభుత్వ అనుమతి ఉన్న ల్యాబ్‌లు 38 మాత్రమే. వాస్తంగా అయితే జిల్లాలో 150 వరకు ల్యాబ్‌లు ఉన్నాయి. జిల్లాలో ప్రైవేటు క్లినిక్‌లు 200 వరకు ఉన్నాయి. వీటిలో అనుమతి ఉన్నవి కేవం 120 మాత్రమే. రిజిస్ట్రేషన్‌ లేకుండా క్లినిక్‌లు, ల్యాబ్‌లు చాలా మంది నిర్వహిస్తున్నారు. రోగులకు అవసరం లేకున్నా వైద్యపరీక్షలు రాసేసి దోచుకుంటున్నారు. సాధారణ జ్వరాలకు సైతం రూ. 5 వేలు నుంచి రూ.10 వేలు వరకు దోచుకుంటున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఒక్కో పరీక్షకు ప్రైవేటు ల్యాబ్‌లో రూ.200 నుంచి రూ.600 వరకు వసూలు చేస్తుండగా, కొన్ని పరీక్షలకు రూ.1000 నుంచి రూ.1200 వరకు తీసుకుంటున్నారు.

ఫిర్యాదు చేస్తే చర్యలుతీసుకుంటాం
ప్రభుత్వ అనుమతి లేకుండా ల్యాబ్‌లు, క్లినిక్‌లు నిర్వహించకూడదు. వైద్య ఆరోగ్య శాఖ రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి. అనుమతి లేకుండా ఎటువంటి బోర్డులు కూడా పెట్టకూడదు. ఎవరైనా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం.– డాక్టర్‌ వరాల వెంకటరావు,డీఎంహెచ్‌ఓ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top