
సరిగ్గా ఐదేళ్ల క్రితం..
సరిగ్గా ఐదేళ్ల క్రితం.. ఇదే రోజు.. 2009 సెప్టెంబర్ 2వ తేదీ రాష్ట్రం మొత్తం దుఃఖసాగరంలో మునిగింది. తమ అభిమాన నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఇక లేరని తెలిసి కొన్ని గుండెలు ఆగిపోయాయి.
సరిగ్గా ఐదేళ్ల క్రితం.. ఇదే రోజు.. 2009 సెప్టెంబర్ 2వ తేదీ రాష్ట్రం మొత్తం దుఃఖసాగరంలో మునిగింది. తమ అభిమాన నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఇక లేరని తెలిసి కొన్ని గుండెలు ఆగిపోయాయి. చేదు నిజాన్ని జీర్ణించుకోలేక మరికొందరు బలవన్మరణాలకు పాల్పడ్డారు. సరిగ్గా ఐదేళ్ల క్రితం.. ఇక్కడే నల్లమల అడవిలో ప్రజలతో పాటు ప్రతి చెట్టూ.. ప్రతి రాయి శోకించింది. సీమ ముఖద్వారమైన కర్నూలు జిల్లా శోక సంద్రంలో మునిగింది. అప్పటి జ్ఞాపకాలు ఇప్పటికీ తలుచుకొని ప్రజల కళ్లు చెమ్మగిల్లుతున్నాయి.
రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు చిత్తూరు జిల్లాకు వెళ్తూ వైఎస్సార్ కనిపించలేదనే దుర్వార్త్త విన్న కర్నూలు గడ్డ తల్లడిల్లింది. ప్రతి పల్లెలో చిన్నా..పెద్దా తేడాలేకుండా ‘వైఎస్’ కోసం ఒళ్లంతా కళ్లు చేసుకుని ఎదురుచూశారు. కానీ.. గుండెలు పగిలే నిజం చెవిన పడింది. వైఎస్సార్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పావురాల గుట్టను ఢీకొట్టి పేలిపోయిందని.. ఒక్కసారిగా నిశ్శబ్ద వాతావరణం. జనంలో పుట్టి.. జనం వెంట నడిచి.. జనం కోసం అహర్నిశలూ శ్రమించిన వైఎస్ రాజశేఖరరెడ్డి మరణ వార్తతో సీమ ముఖద్వారం కన్నీరు మున్నీరైంది. వెలకట్టలేని ఆచిరునవ్వు పావురాల గుట్టలో దాగింది.